Budget 2023: బడ్జెట్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ విధానంలో ముఖ్యమైన మార్పులు?.. టార్గెట్ ఏంటంటే..
ABN , First Publish Date - 2023-01-06T17:55:56+05:30 IST
రెండేళ్లక్రితం కేంద్ర ప్రభుత్వం (Central Govt) ప్రవేశపెట్టిన నూతన పన్నుల విధానానికి (New income tax regime) రానున్న బడ్జెట్-2023లో (Budget2023) కొన్ని కీలక మార్పులు జరిగే సూచనలున్నాయి.
న్యూఢిల్లీ: రెండేళ్లక్రితం కేంద్ర ప్రభుత్వం (Central Govt) ప్రవేశపెట్టిన నూతన పన్నుల విధానానికి (New income tax regime) రానున్న బడ్జెట్-2023లో (Budget2023) కొన్ని కీలక మార్పులు జరిగే సూచనలున్నాయి. కొత్త విధానంలో పన్ను రేట్లు (Tax rates) తక్కువగానే ఉన్నప్పటికీ 80సీ, 80డీ, 80జీ, 80టీటీఏ వంటి సెక్షన్ల కింద దాదాపు 70 మినహాయింపులను (Exemptions) పొందే అవకాశం కొత్త విధానంలో లేదు. ఈ కారణంతోనే వేతనజీవుల్లో (Salaried taxpayers) ఎక్కువమంది పాత విధానంవైపే మొగ్గుచూపుతున్నారు. మరోవైపు వార్షికాదాయం రూ.10 లక్షలు పైబడిన చెల్లింపుదార్లు (Taxpayers) కూడా పాత విధానానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. బేసిన్ మినహాయింపులేమీ లేకపోయినప్పటికీ.. రూ.50 వేల స్టాండర్డ్ డిడక్షన్ (Standard deductions) ఉండడమే కారణంగా ఉంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని నూతన ట్యాక్స్ విధానానికి ఊతమివ్వడమే లక్ష్యంగా బడ్జెట్ 2023లో కొన్ని మార్పులు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం.
వేతన జీవులే టార్గెట్!
ఈ ప్రయత్నంలో భాగంగా బడ్జెట్2023లో కొత్తగా మినహాయింపులేమీ జోడించకపోయినప్పటకీ.. వేతన ఆధారిత చెల్లింపుదారులు కొత్త విధానం వైపు మొగ్గుచూపేలా ఊతమివ్వాలని ప్రభుత్వం భావిస్తోందట. ఇందులో భాగంగా పాత పన్ను విధానంలో వేతనజీవులకు వర్తించే రూ.50 వేల మినహాయింపు ఉపశమనాన్ని కొత్త విధానంలోనూ ప్రవేశపెట్టాలని చూస్తోందట. తద్వారా వేతన జీవుల్లో నూతన విధానానికి ఆదరణ పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
పన్నురహిత ఆదాయ పరిమితి పెంపు!
నూతన ట్యాక్స్ విధానంలో పన్నురహిత ఆదాయ పరిమితిని కూడా పెంచవచ్చుననే ఊహాగానాలున్నాయి. ప్రస్తుతం గరిష్ఠ పరిమితి రూ.2.5 లక్షలు ఉండగా దీనిని రూ.5 లక్షల వరకు పెంచొచ్చనే రిపోర్టులు పేర్కొంటున్నాయి. తద్వారా మరింత మంది చెల్లింపుదార్లను కొత్త విధానంవైపు ఆకర్షించొచ్చని ప్రభుత్వం లెక్కలు వేస్తోంది.
పన్ను స్లాబులు పెంపు.. తక్కువ రేట్లు!
నూతన పన్ను విధానంలోని ట్యాక్స్ స్లాబ్స్ (Tax slabs) సంఖ్యను ప్రభుత్వం పెంచే అవకాశాలున్నాయి. ప్రస్తుతం రూ.2.5 లక్షలు - రూ.5 లక్షల ఆదాయంపై 5 శాతం ట్యాక్స్, రూ.5 లక్షలు - రూ.7.5 లక్షల ఆదాయంపై 10 శాతం ట్యాక్స్, ఇక రూ.7.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయంపై 15 శాతం ట్యాక్స్, రూ.10 లక్షలు-రూ.12.5 లక్షలకు 20 శాతం, రూ.12.50 లక్షలు-రూ.15 లక్షల ఆదాయంపై 25 శాతం, రూ.15 లక్షలపైగా ఆదాయంపై 30 శాతంగా స్లాబు రేటులు ఉన్నాయి. ఈ స్లాబుల సంఖ్యను పెంచి రేట్లను కాస్తంత తగ్గించొచ్చనే అంచనాలున్నాయి. ఇలాంటి మార్పులు నూతన పన్ను విధానానికి ఊతమివ్వొచ్చని, చెల్లింపుదారుల్లో ఆదరణ మరింత పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.