Nirmala Sitharaman Budget Speech: అప్పుడలా.. ఇప్పుడిలా!
ABN , First Publish Date - 2023-02-01T16:05:21+05:30 IST
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) నేటి (బుధవారం) ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్ 2023-24ను
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) నేటి (బుధవారం) ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్ 2023-24ను పార్లమెంటుకు సమర్పించారు. ఈ సందర్భంగా నిర్మలమ్మ తన బడ్జెట్ ప్రసంగాన్ని 87 నిమిషాల్లోనే ముగించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 1 ఫిబ్రవరి 2020లో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల అప్పట్లో 162 నిమిషాలు ప్రసంగించారు. బడ్జెట్ ప్రసంగాల్లో ఇదే అత్యంత సుదీర్ఘమైనదిగా( Longest Budget Speech) రికార్డులకెక్కింది. ఆ తర్వాతి నుంచి ఆమె బడ్జెట్ ప్రసంగం నిడివి క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఈసారి అతి తక్కువగా 87 నిమిషాల్లోనే ముగించి మరోమారు రికార్డులకెక్కారు. కాగా, కేంద్ర బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టడం ఇది ఐదోసారి కావడం విశేషం.
బడ్జెట్ ప్రసంగాల్లో ఎవరెవరు ఎంతసేపు?
* 2023 బడ్జెట్ సమర్పణ సందర్భంగా నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) 1.25 గంటలు ప్రసంగించారు. బడ్జెట్ ప్రసంగాల్లో అతి స్వల్ప వ్యవధిలో ముగిసిన ప్రసంగంగా ఇది రికార్డులకెక్కింది. పార్లమెంటులో నిర్మల బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఐదోసారి.
* 2020లో నిర్మల అత్యంత సుదీర్ఘంగా 2 గంటల 42 నిమిషాలు ప్రసంగించారు. బడ్జెట్ చరిత్రలో ఇదే అత్యంత సుదీర్ఘమైన ప్రసంగం.
* 2019లో నిర్మల పూర్తిస్థాయి ఆర్థికమంత్రిగా పార్లమెంటులో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె 2.17 గంటలు ప్రసంగించారు.
* 2003లో ఆర్థిక శాఖ మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ (Jaswant Singh) బడ్జెట్ స్పీచ్ 2.13 గంటలపాటు కొనసాగింది.
* 2014లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ(Arun Jaitley) 2.10 గంటల పాటు ప్రసంగించారు.
* పదాల లెక్కన చూస్తే 1991లో మన్మోహన్ సింగ్(Manmohan Singh) సుదీర్ఘంగా ప్రసంగించారు. ఆ ప్రసంగంలో 18,650 పదాలున్నాయి.
* అరుణ్ జైట్లీ(Arun Jaitley) 2018 బడ్జెట్ స్పీచ్‌లో 18,604 పదాలున్నాయి. పదాల లెక్కన చూసుకుంటే మన్మోహన్ సింగ్ తర్వాత ఆయనది రెండో సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం.
* 1977లో అప్పటి ఆర్థికశాఖ మంత్రి హీరుభాయ్ ముల్జీభాయ్ పటేల్(Hirubhai Mulljibhai Patel) బడ్జెట్ ప్రసంగంలో అతి తక్కువగా 800 పదాలు మాత్రమే ఉన్నాయి.
* అత్యధిక బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన రికార్డు మొరార్జీ దేశాయ్(Morarji Desai) పేరున ఉంది. 1962 నుంచి 69 వరకు ఆయన ఏకంగా 10 బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు.
* మెరార్జీ దేశాయ్ తర్వాతి పి.చిదంబరం రెండో స్థానంలో ఉన్నారు. ఆయన 9సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
* ప్రణబ్ ముఖర్జీ(Pranab Mukherjee), యశ్వంత్ సిన్హా(Yashwant Sinha) 8 సార్లు చొప్పున బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, మన్మోహన్ సింగ్(Manmohan Singh) ఆరుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.