PhonePe: ఫోన్‌పే యూజర్లకు గుడ్ న్యూస్.. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇక పండగే!
ABN , First Publish Date - 2023-08-30T18:44:37+05:30 IST
వాల్‌మార్ట్‌కు చెందిన ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే కస్టమర్లకు శుభవార్త చెప్పింది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు కొత్త యాప్‌ను తీసుకొచ్చింది.
వాల్‌మార్ట్‌కు(Walmart) చెందిన ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే కస్టమర్లకు శుభవార్త చెప్పింది. స్టాక్ మార్కెట్‌లో(Stock Market) పెట్టుబడులు పెట్టేందుకు కొత్త యాప్‌ను(APP) తీసుకొచ్చింది. ఈ యాప్ పేరు షేర్ మార్కెట్(Share.Market). ఈ యాప్ ద్వారా వినియోగదారులు స్టాక్‌లు, మ్యూచువల్ ఫండ్స్, ఎక్స్‌ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్)లలో పెట్టుబడులు పెట్టొచ్చు. ఈ యాప్‌తో ఫోన్‌పే స్టాక్ మార్కెట్ వ్యాపారంలో అడుగుపెట్టింది. ఫోన్ పే వ్యవస్థాపకుడు, సీఈఓ సమీర్ నిగమ్(Sameer Nigam) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఫోన్‌పే వెల్త్ కింద స్టాక్ బ్రోకింగ్ వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఈ యాప్ ఉపయోగపడుతుందని చెప్పారు. దీంతో ఫోన్ పే ద్వారా షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇక పండగే అని చెప్పుకోవాలి.
ఇక ఇప్పటికే ఫోన్‌పే ద్వారా యూపీఐ లావాదేవీలు, బీమా పాలసీలు, మ్యూచువల్ ఫండ్స్‌లలో(mutual funds) పెట్టుబడులు పెట్టేందుకు సేవలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా స్టాక్ మార్కెట్ రంగంలోకి కూడా ప్రవేశించింది. నిజానికి స్టాక్ మార్కెట్ వ్యాపారాల్లోకి ప్రవేశించాలని ఫోన్ చాలా కాలం నుంచి ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే 2021లో స్టాక్ బ్రోకింగ్ డొమైన్‌లో(stockbroking domain) తన ప్రయాణాన్ని కూడా మొదలుపెట్టింది. కానీ స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) నుంచి అనుమతి కోసం ఎదురుచూసింది. తాజాగా సెబీ నుంచి అనుమతి రావడంతో ఆలస్యం చేయకుండా వెంటనే యాప్‌ను ప్రారంభించింది.
ప్రస్తుతం స్టాక్ బ్రోకింగ్ వ్యాపారాల్లో జెరోధా, గ్రో, అప్‌స్టాక్స్ వంటి కంపెనీలు అధిపత్యం చెలాయిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఫోన్ పే తీసుకొచ్చిన షేర్ మార్కెట్ ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి. కాగా పెట్టుబడుల కోసం ఫోన్ పే ఇప్పటికే జనరల్ అట్లాంటిక్, ఇతర ఇన్వెస్టర్ల నుంచి 100 మిలియన్ డాలర్లను సమీకరించింది. ఫోన్ పే ఈ సంవత్సరం ప్రారంభంలో రిబ్బిట్ క్యాపిటల్, టైగర్ గ్లోబల్, టీవీఎస్ క్యాపిటల్ ఫండ్స్ కంపెనీల నుంచి 100 మిలియన్ల డాలర్లను సేకరించింది. ఆ తర్వాత మార్చిలో వాల్‌మార్ట్ నుంచి అదనంగా 200 మిలియన్ల డాలర్ల ప్రాథమిక మూలధనాన్ని పొందింది.