Stock Market Scams: హర్షద్ మెహతా నుంచి అదానీ వరకు.. స్టాక్ మార్కెట్‌లో ఏం జరుగుతోందసలు!

ABN , First Publish Date - 2023-01-27T19:30:40+05:30 IST

స్టాక్ మార్కెట్.. కొందరికి ఇది కలల ప్రపంచం. మరికొందరికి బ్రహ్మపదార్థం. ఇక్కడ చేతులు కాల్చుకోవచ్చు.. రాతలు మార్చుకోవచ్చు

Stock Market Scams: హర్షద్ మెహతా నుంచి అదానీ వరకు.. స్టాక్ మార్కెట్‌లో ఏం జరుగుతోందసలు!

హైదరాబాద్: స్టాక్ మార్కెట్.. కొందరికి ఇది కలల ప్రపంచం. మరికొందరికి బ్రహ్మపదార్థం. ఇక్కడ చేతులు కాల్చుకోవచ్చు.. రాతలు మార్చుకోవచ్చు. కావాల్సిందల్లా కాసింత అదృష్టం. స్టాక్ మార్కెట్‌పై పట్టుసాధిస్తే రాత్రికి రాత్రే కోట్లాది రూపాయలకు అధిపతి కావొచ్చు. లేదంటే క్షణాల్లోనే బిచ్చమెత్తుకోవాల్సి రావొచ్చు. కావాల్సిన దానికంటే కాస్తంత తెలివి ఎక్కువ ఉంటే, ఉన్న వాటిని అడ్డంగా వాడుకోగలితే చరిత్ర సృష్టించవచ్చు. స్టాక్ మార్కెట్‌ను శాసించవచ్చు. అలా శాసించి... అత్యాశతో అథఃపాతాళానికి పడినవారే హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్. ఇప్పుడు అకస్మాత్తుగా వీరు తెరపైకి రావడం వెనక ఓ కారణం ఉంది. అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ ‘హిండెన్‌బర్గ్’ అదానీ సంస్థపై బాంబు పేల్చింది. ఆర్థిక అవకతవకలకు పాల్పడిందంటూ సంచలన నివేదిక బయటపెట్టింది. ఈ పరిణామం భారత స్టాక్ మార్కెట్‌ని ఓ కుదుపు కుదిపింది. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన స్టాక్ మార్కెట్ కుంభకోణాలపై ఓ లుక్కేద్దాం.

ప్రపంచాన్ని కుదిపేసిన హర్షద్ మెహతా

Harshad-mehta1.jpg

గుజరాత్‌లోని ఓ దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు హర్షద్ మెహతా(Harshad Mehta). పూర్తి పేరు హర్షద్ శాంతిలాల్ మెహతా. చిన్నప్పటి నుంచి ఏదో సాధించాలన్న కసి ఉండేది. కొన్నేళ్లు ఏవో చిన్నచిన్న పనులు చేసిన హర్షద్ మెహతా దృష్టి ఆ తర్వాత స్టాక్‌మార్కెట్‌పై పడడంతో ముంబైలోని దలాల్ స్ట్రీట్(Dalal Street) చేరుకున్నాడు. తొలుత స్టాక్ బ్రోకర్ల వద్ద ఉద్యోగిగా చేరాడు. ఆ తర్వాత సొంతంగా బ్రోకరేజీ సంస్థను స్థాపించాడు. ఇక అది మొదలు అతడు తన సామ్రాజ్యన్ని విస్తరిస్తూ పోయాడు. తన తెలివితో బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలను తనకు అనుకూలంగా మార్చుకుని కోట్లకు పడగలెత్తాడు.

బ్రోకర్‌గా మంచి పేరు

స్టాక్ మార్కెట్‌‌లో బ్రోకర్‌గా మంచి పేరు సంపాదించుకున్న హర్షద్ మెహతా వలలో ప్రభుత్వ, ప్రైవేటు, విదేశీ బ్యాంకులు గుడ్డిగా పడిపోయాయి. వాటి నుంచి రుణాలు తీసుకుని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవాడు. షేర్ విలువ పెరిగిన తర్వాత అమ్మేసి వారం చివర్లో బ్యాంకులకు డబ్బులు కట్టేసి రుణాలు క్లోజ్ చేసేవాడు. అలా ఫార్వడ్ డీల్ నిబంధనను తనకు అనుకూలంగా వాడుకునేవాడు. భారతీయ స్టేట్ బ్యాంకు(SBI) నుంచి ముంబై మెట్రోపాలిటన్ బ్యాంకు వరకు ఎన్నో బ్యాంకులు అతడిని నమ్మి దొడ్డిదారిన రుణాలు ఇచ్చేవి. కంపెనీ ఏదైనా హర్షద్ మెహతా ఇన్వెస్ట్ చేస్తే వాటి షేర్ల విలువ భారీగా పెరిగేది. ఆ ప్రభావం సెన్సెక్స్‌పై ఉండేది. ఆ షేర్లను కొన్నాళ్లపాటు అలాగే ఉంచుకుని ఆ తర్వాత లాభాలకు అమ్మేసేవాడు. అలా, వందల కోట్ల విలువైన షేర్లు కొని మార్కెట్‌ను పూర్తిగా తప్పుదారి పట్టించేవాడు. అప్పట్లో అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీ షేర్లను హర్షద్ కొనడంతో రూ. 200 నుంచి ఆ షేర్ ధర ఏకంగా రూ. 10 వేలకు పెరిగింది.

ఏడాదికి రూ. 28 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్

స్టాక్‌లను మేనిప్యులేట్ చేయడంలో పట్టుసాధించిన మెహతా షేర్ మార్కెట్లో చేసిన పెట్టుబడి అప్పట్లో వందల కోట్ల నుంచి వేల కోట్లకు పెరిగింది. 1991-92లో ఏకంగా రూ. 28 కోట్ల అడ్వాన్స్ చెల్లించి సంచలనం సృష్టించాడు. హర్షద్ మెహతా చలవతో సామాన్య, మధ్యతరగతి వారికి కూడా స్టాక్ మార్కెట్ గురించి తెలిసింది. వారు కూడా నెమ్మదిగా స్టాక్స్‌(Stocks)లో పెట్టుబడులు పెట్టడాన్ని అలవాటు చేసుకున్నారు. ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మెహతా వేలకోట్లకు అధిపతి అయ్యాడు. బాంబే మెయిన్ సెంటర్‌లో 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన భవనం కొన్నాడు. అతడి వద్ద అత్యంత ఖరీదైన లెక్సస్ కారు సహా 20 విదేశీ కార్లు ఉండేవి.

కుప్పకూలిన సామ్రాజ్యం

స్టార్ లైఫ్‌ను అనుభవిస్తున్న మెహతా సామ్రాజ్యం 23 ఏప్రిల్ 1992లో కుప్పకూలింది. ముంబైకి చెందిన బిజినెస్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సుచేత దలాల్(Sucheta Dalal) అతడి బండారాన్ని బయటపెట్టారు. బ్యాంకు అధికారులతో చేతులు కలిపి దాదాపు రూ. 5 వేల కోట్ల ప్రజల సొమ్మును మెహతా తన సొంతానికి వాడుకున్న విషయాన్ని వివరాలతో సహా ఆమె బయటపెట్టారు. ఈ ఒక్క వార్త స్టాక్ మార్కెట్‌లో అణుబాంబులా పేలింది. షేర్ల ధరలు ఢమాల్ అన్నాయి. సెన్సెక్స్ భారీగా పతనమైంది. కోట్లాది రూపాయల జనం సొమ్ము ఆవిరైంది. నష్టాలు భరించలేని ఇన్వెస్టర్లలో కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలామంది బ్యాంకు మేనేజర్లు, చైర్మన్లు రాజీనామా చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. విజయ బ్యాంకు చైర్మన్ బ్యాంక్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

మెహతాపై 72 క్రిమినల్ కేసులు

మెహతా కుంభకోణం వెలుగు చూసిన తర్వాత స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు జనం వణికిపోయారు. మెహతాపై మొత్తంగా 72 క్రిమినల్ కేసులు, 600కుపైగా సివిల్ కేసులు నమోదయ్యాయి. సుదీర్ఘ విచారణ అనంతరం హర్షద్‌కు కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధించింది. థానే జైలులో శిక్ష అనుభవిస్తూ 31 డిసెంబరు 2001న హర్షద్ మెహతా గుండెపోటుతో మృతి చెందాడు. సక్సెస్‌కు సింబల్‌గా మారి స్టాక్ మార్కెట్‌ను ఓ ఊపు ఊపిన మెహతా చివరికి ప్రపంచం ముందు దోషిగా నిలబడి జైలులోనే ప్రాణాలు విడిచాడు. అయితే, స్టాక్ మార్కెట్‌కు ఓ ట్రెండ్ అంటూ తీసుకొచ్చింది మాత్రం హర్షద్ మెహతానే.

కేతన్ పరేఖ్..

ketan-parekh.jpg

హర్షద్ మెహతా కుంభకోణం తర్వాత కూడా ఇలాంటి మోసాలు చాలానే జరిగాయి. ముంబైకి చెందిన కేతన్ పరేఖ్(Ketan Parekh) 1998-2001 మధ్య స్టాక్ మార్కెట్లో మళ్లీ మంటలు రేపాడు. చార్టెడ్ అకౌంటెంట్ నుంచి స్టాక్ బ్రోకర్‌‌గా మారి నర్బేరామ్ హరక్‌‌చంద్ సెక్యూరిటీస్ (NH Securities) పేరుతో బ్రోకరేజ్ సంస్థ ప్రారంభించాడు. 1990లలో హర్షద్ మెహతా బ్రోకరేజ్ సంస్థ ‘గ్రో మోర్’ (Grow More)లో చేరాడు. అక్కడ కిటుకులు నేర్చుకుని బయటకొచ్చాడు. 1992 హర్షద్ మెహతా కుంభకోణంలో అతడి పాత్ర కూడా ఉన్నట్టు 2001లో పరేఖ్ కుంభకోణం వెలుగులోకి వచ్చాక తెలిసింది. 1992 స్కాంలో కెనరా బ్యాంకు యూనిట్ నుంచి రూ. 48 కోట్లు తీసుకుని దుర్వినియోగం చేసినందుకు గాను 2008లో దోషిగా తేలిన కేతన్‌కు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది.

షేర్ల ధరలను పెంచడంలో దిట్ట

సంస్థాగత పెట్టుబడిదారులతో కుమ్మక్కై ఇతర వ్యాపారులతో కలిసి షేర్ల ధరలు విపరీతంగా పెరిగేలా చేసేవాడు. రూ. 30 ఉన్న జీ టెలిఫిల్మ్(Zee Telefilms) షేర్ ధర రూ. 720 ఎగబాకేలా చేశాడు. అలాగే, విజువల్ సాఫ్ట్ షేర్ ధర రూ. 625 ఉండగా దానిని అమాంతం రూ. 8,448కి పెరిగేలా మేనిప్యులేట్ చేశాడు. జీ టెలిఫిల్మ్స్, హెచ్ఎఫ్‌సీఎల్, సిల్వర్‌లైన్, సత్యం కంప్యూటర్స్, ఆఫ్‌టెక్ ఇన్ఫోసిస్, డీఎస్‌క్యూ సాఫ్ట్‌వేర్, ర్యాన్‌బాక్సీ, పెంటామీడియా గ్రాఫిక్స్, సొనాటా సాఫ్ట్‌వేర్, విజువల్ సాఫ్ట్ వంటి షేర్ల ధరల పెంపు కోసం అవకతవకలకు పాల్పడ్డాడు. వీటిని ఇతర స్టాక్ బ్రోకర్లు ‘కె-10’ స్టాక్స్‌గా పిలిచేవారు.

1 మార్చి 2001లో కేంద్ర బడ్జెట్ ఆమోదం పొందిన రెండు రోజుల తర్వాత బీఎస్ఈ సెన్సెక్స్ 176 పాయింట్లకు పడిపోయింది. దీనిపై అప్పటి ఎన్‌డీఏ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో కేతన్ పరేఖ్ లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నట్టు రిజర్వు బ్యాంకు గుర్తించింది. అతడి పెట్టుబడులన్నీ ‘కె-10’(K-10) స్టాక్స్‌పైనే ఉండడంతో ఆరాతీయడంతో భారీ కుంభకోణం వెలుగు చూసింది. అతడు మొత్తంగా రూ. 30 వేల నుంచి రూ. 40 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడినట్టు తేలింది. బ్యాంకు ఆఫ్ ఇండియాను రూ. 137 కోట్ల మేర మోసం చేసిన ఆరోపణలపై 30 మార్చి 2001లో కేతన్ అరెస్ట్ అయ్యాడు.

‘సత్యం’ రామలింగరాజు

satyam.jpg

ఇక ఇలాంటిదే మరో కుంభకోణానికి ‘సత్యం’ రామలింగరాజు(Satyam Ramalinga Raju) పాల్పడ్డారు. సత్యం కంప్యూటర్స్‌తో దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఆయన ఓ పెద్ద కుంభకోణంతో ప్రపంచం ముందు తలదించుకున్నారు. కంపెనీలో ఆదాయాలు, లాభం, నగదు నిల్వ వివరాలు తప్పుగా చూపించి ఇన్వెస్టర్లను మభ్యపెట్టారు. ఫలితంగా కంపెనీ పటిష్ఠంగా ఉందని నమ్మబలికారు. దానిని ఎల్లకాలం కొనసాగించడం సాధ్యం కాదని తెలుసుకుని అసలు నిజాన్ని బయటపెట్టారు. 2009లో వెలుగు చూసిన ఈ కుంభకోణాన్ని ‘సత్యం కుంభకోణం’గా పిలుస్తారు. రామలింగరాజు ప్రకటనతో సత్యం షేరు ధర దారుణంగా పడిపోయింది. సత్యం ఖాతాను కొన్ని సంవత్సరాలుగా తప్పుగా చూపించానంటూ జనవరి 2009లో రామలింగరాజు చేసిన ప్రకటన దేశ విదేశాల్లో ప్రకంపనలు రేపింది. మొత్తంగా రూ. 7 వేల కోట్ల మోసం జరిగినట్టు ఆయన అంగీకరించారు. ఈ కేసులో రామలింగరాజు, ఆయన సోదరులకు కోర్టు ఏడేళ్ల జైలుశిక్ష రూ. 5.5 కోట్ల జరిమానా విధించింది.

మరి అదానీ సంగతేంటి?

adani.jpg

అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ ‘హిండెన్‌బర్గ్ రీసెర్చ్’(Hindenburg Research) ఇటీవల వెల్లడించిన నివేదిక ప్రపంచవ్యాప్తంగా మరోమారు ప్రకంపనలు రేపింది. స్టాకులు తారుమారు చేస్తూ అకౌంటింగ్ మోసాలకు పాల్పడుతోందంటూ అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు తమ పరిశోధనలో బయటపడిందని పేర్కొంది. దాదాపు 218 బిలియన్ డాలర్ల విలువ కలిగిన అదానీ గ్రూపు (Adani Group) దశాబ్దాలుగా ఇదే పద్ధతిలో నడుచుకుంటున్నట్టు ఆరోపించింది.

అదానీ గ్రూపునకు చెందిన 7 కీలకమైన కంపెనీల స్టాకుల విలువ భారీగా పెరగడంతో గౌతమ్ అదానీ మొత్తం సంపదలో 100 బిలియన్ డాలర్లు గత మూడేళ్లలోనే సమకూరినట్టు పేర్కొంది. ఈ మూడేళ్లకాలంలో సగటున 819 శాతం మేర షేర్ల విలువ పెరిగినట్టు వివరించింది. పన్ను స్వర్గధామ దేశాలైన కరీబియన్, మారిషస్ నుంచి యూఏఈ వరకు పలు దేశాల్లో అదానీ కుటుంబం నియంత్రణలో ఉన్న పలు డమ్మీ కంపెనీలను గుర్తించినట్టు తెలిపింది. అదానీ గ్రూపునకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు సహా ఎంతో మందితో దీనిపై మాట్లాడామని, వేలాది డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాతే ఈ నివేదిక విడుదల చేసినట్టు పేర్కొంది. ఒకవేళ మా రిపోర్టుపై నమ్మకం లేకపోతే అదానీ గ్రూపు ఫైనాన్సియల్ డేటాను పరిశీలించవచ్చని కూడా పేర్కొంది.

అయితే, ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ కొట్టివేసింది. కంపెనీని అపఖ్యాతి పాలుచేసే ఆరోపణలతో రిపోర్ట్ విడుదల చేసిందని మండిపడింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ దేశంలోనే అతిపెద్ద ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫరింగ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో కంపెనీ ప్రతిష్ఠను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ రిపోర్టును బయటపెట్టినట్టు ఆరోపించింది. హిండెన్‌బర్గ్‌పై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.

అదానీ గ్రూప్ హెచ్చరికలపై స్పందించిన హిండెన్‌బర్గ్.. తమ నివేదికకు కట్టుబడి ఉన్నట్టు తెలిపింది. దమ్ముంటే తమపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సవాలు విసరడం ద్వారా అదానీ గ్రూప్ అవకతవకలు నిజమేనని చెప్పకనే చెప్పింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలు నిజమేనా? ప్రపంచ కుబేరుల్లో ఒకరైన గౌతం అదానీ కూడా ఇలాంటి అవకతవకలకు పాల్పడ్డారా? అన్నది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Updated Date - 2023-01-27T20:13:47+05:30 IST