Twitter bathrooms: కంపుకొడుతున్న‘ట్విట్టర్’ బాత్రూములు.. టాయిలెట్ పేపర్ తెచ్చుకుంటున్న ఉద్యోగులు!
ABN , First Publish Date - 2023-01-01T16:45:34+05:30 IST
మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్(Twitter) ఎలాన్ మస్క్(Elon Musk) చేతికి చిక్కిన తర్వాత అష్టకష్టాల పాలవుతోంది. ఉద్యోగుల తొలగింపు నుంచి అంతా గందరగోళంగా తయారైంది.
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్(Twitter) ఎలాన్ మస్క్(Elon Musk) చేతికి చిక్కిన తర్వాత అష్టకష్టాల పాలవుతోంది. ఉద్యోగుల తొలగింపు నుంచి అంతా గందరగోళంగా తయారైంది. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా దాదాపు సగం మంది ట్విట్టర్ ఉద్యోగులను మస్క్ ఇంటికి పంపేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ట్విట్టర్ నియంత్రణ కోల్పోయింది. కంపెనీ నుంచి క్లీనర్లు, సెక్యూరిటీ గార్డులను కూడా బయటకు పంపేయడంతో నిర్వహణ లేక కార్యాలయం కంపుకొడుతోంది. ముఖ్యంగా బాత్రూములు దుర్గంధ భరింతంగా మారిపోతున్నాయి. చివరికి ఉద్యోగులు స్వయంగా టాయిలెట్ పేపర్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
‘న్యూయార్క్ టైమ్స్’ (New York Times) చెబుతున్న దాని ప్రకారం.. ట్విట్టర్ కార్యాలయం వద్ద సెక్యూరిటీ సిబ్బంది కానీ, పర్యవేక్షకులు కానీ అందుబాటులో లేరు. దీంతో బాత్రూములు(Bathrooms) మురికిగా మారిపోయి కంపుకొడుతున్నాయి. ఉద్యోగులు భోజనం చేసిన తర్వాత శుభ్రం చేసేందుకు ఎవరూ లేకపోవడంతో టేబుళ్లపైనే ఆహారం మిగిలిపోతూ కంపుకొడుతోంది. బాత్రూములను శుభ్రం చేసేవారు, పర్యవేక్షించేవారు లేకపోవడంతో ఉద్యోగులు స్వయంగా టాయిలెట్ పేపర్లు(Toilet Papers) తెచ్చుకుంటున్నారు. కార్యాలయంలోని నాలుగు అంతస్తులను మూసేసిన ట్విట్టర్.. మొత్తం ఉద్యోగులను రెండు అంతస్తుల్లో కుక్కేసి పనిచేయిస్తోంది.
సియాటెల్(Seattle)లో కార్యాలయం ఉన్న భవనం అద్దె చెల్లించకపోవడంతో ఇంటి నుంచి పనిచేయాలని ఉద్యోగులను కోరుతోంది. న్యూయార్క్ టైమ్స్ చెబుతున్న దాని ప్రకారం ట్విట్టర్‌కు ఇప్పుడు న్యూయార్క్ నగరం, శాన్‌ఫ్రాన్సిస్కో(San Francisco)లో మాత్రమే కార్యాలయాలు ఉన్నాయి. న్యూయార్క్‌లోని కొన్ని నగరాల్లోని కార్యాలయాల్లోని క్లీనర్లు, సెక్యూరిటీ గార్డులకు మస్క్ లే ఆఫ్‌లు ఇచ్చేశారు. చాలా వరకు ఖర్చు తగ్గించేసుకున్న మస్క్.. ఇటీవలి కాలంలో తన ఇతర కంపెనీలైన టెస్లా, స్పేస్ ఎక్స్‌ల నుంచి ఇంజినీర్లను తెచ్చుకుని ట్విట్టర్‌లో పనిచేయించుకుంటున్నారు.