దారుణం: 13 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడు ఓ బిచ్చగాడు

ABN , First Publish Date - 2023-07-04T16:28:00+05:30 IST

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో దారుణం జరిగింది. 13 ఏళ్ల మైనర్ బాలికపై 21 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడడమే కాకుండా ఆ తర్వాత దారుణంగా చంపేశాడు. జూన్ 27న బాలిక అదృశ్యంపై కేసు నమోదవగా తాజాగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

దారుణం: 13 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడు ఓ బిచ్చగాడు

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో దారుణం జరిగింది. 13 ఏళ్ల మైనర్ బాలికపై 21 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడడమే కాకుండా ఆ తర్వాత దారుణంగా చంపేశాడు. జూన్ 27న బాలిక అదృశ్యంపై కేసు నమోదవగా తాజాగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సురేంద్రనగర్ జిల్లాకు చెందిన జయదీప్ అలియాస్ జయు పర్మార్‌గా గుర్తించారు. జయదీప్ బిక్షాటన చేస్తూ జీవిస్తుంటాడని, గతంలో జేబు దొంగతనాలకు కూడా పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..నిందితుడు జయదీప్ మరణించిన బాలిక మేనమామాతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయంతో తరచుగా బాలిక ఇంటికి వెళ్లేవాడు. బాలిక తన దినచర్యలో భాగంగా జూన్ 27న కూడా కట్టెలు తీసుకురావడానికి వెళ్లింది. ఇది గమనించిన నిందితుడు పర్మార్ బాలికను అజీ ఫ్యాక్టరీకి లాకెళ్లాడు. ఫ్యాక్టరీలోని ఒక రూంలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను ప్రాణాలతో వదిలేస్తే తన గురించి ఆమె కుటుంబసభ్యులకు చెబుతుందని భయపడ్డాడు. దీంతో ఓ బరువైన వస్తువుతో బాలిక తలపై పలుమార్లు బాది చంపేశాడు.

మరోవైపు కట్టెల కోసం వెళ్లిన బాలిక ఇంకా ఇంటికిరాకపోవడంతో కుటుంబసభ్యులు వెతుకులాట ప్రారంభించారు. ఎక్కడా కనిపించకపోవడంతో అజీ డ్యామ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో నిందితుడు పర్మార్ వాళ్ల వెంటనే ఉండడం గమనార్హం. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో కుటుంబసభ్యుల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. దీంతో తాను పట్టుబడతాననే భయంతో పర్మార్ అక్కడి నుంచి పారిపోయాడు. దీనికి తోడు సీసీటీవీ పుటేజ్ కూడా ఉండడంతో నిందితుడు పర్మార్ దొరికిపోయాడు. పర్మార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బాలిక మృతదేహం మూసివేసిన లాత్ మెషిన్ యూనిట్ సమీపంలో దొరికింది. కాగా చనిపోయిన బాలికకు ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు ఉన్నారు. తండ్రి డ్రైవర్. బాలిక స్వస్థలం రాజస్థాన్ అయినప్పటికీ కొన్ని సంవత్సారాలుగా రాజ్‌కోట్‌లోనే నివసిస్తున్నారు.

Updated Date - 2023-07-04T16:31:44+05:30 IST