Hyderabad: నగరంలో.. యూపీఐ మోసాలే అధికం!
ABN , First Publish Date - 2023-12-06T09:16:56+05:30 IST
ఒకప్పుడు బ్యాంకులో డబ్బులున్నా.. తీసుకోవాలంటే బ్యాంకు లేదా ఏటీఎం సెంటర్‌కు వెళ్లాల్సి వచ్చేది. ఏడేళ్ల క్రితం
- ఐఐటీ కాన్పూర్ ఎఫ్‌సీఆర్‌ఎఫ్ నివేదిక వెల్లడి
- మూడున్నరేళ్లలో భారీగా పెరిగిన క్రైమ్
- ఆర్థిక నేరాల్లో ముంబై టాప్.. రెండోస్థానంలో హైదరాబాద్: ఎన్‌సీఆర్‌బీ
హైదరాబాద్ సిటీ, (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు బ్యాంకులో డబ్బులున్నా.. తీసుకోవాలంటే బ్యాంకు లేదా ఏటీఎం సెంటర్‌కు వెళ్లాల్సి వచ్చేది. ఏడేళ్ల క్రితం ప్రారంభమై.. ఐదేళ్లుగా విరివిగా వినియోగంలోకి వచ్చిన యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్)తో ఎక్కడ డబ్బు చెల్లించాలన్నా ఈజీగా మారిపోయింది. ఒక్క రూపాయి నుంచి వేల రూపాయల వరకు క్షణాల్లో ఖాతాల్లోకి డబ్బులు వెళ్లే సౌలభ్యంతో ఎంతోమంది చిరు వ్యాపారుల నుంచి పెద్దపెద్ద వ్యాపారుల వరకు ఈ సౌకర్యాన్ని పొందగలుగుతున్నారు. అయితే, ఇంటర్నెట్ ఆధారంగా సాగే యూపీఐ చెల్లింపుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం.. గతేడాది 7,400 కోట్ల లావాదేవీలు జరగడం.. 126 ట్రిలియన్ (ట్రిలియన్ అంటే లక్ష కోట్లు) రూపాయల మారకం జరిగిందంటే జనంలో ఎలా దూసుకెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. అంతపెద్ద స్థాయిలో ఫోన్‌లు, ఇంటర్నెట్ ద్వారా డబ్బు చేతులు మారుతుందంటే అందులో సైబర్ క్రిమినల్స్ తలదూర్చారు. గత మూడున్నరేళ్లుగా వారు యూపీఐ లావాదేవీలపై దృష్టి సారించారు. యూపీఐ వాడకంలో నిర్లక్ష్యం వహించినా.. ఏమాత్రం అజాగ్రత్త వహించినా కాచుక్కూర్చున్న సైబర్ నేరగాళ్లు ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు.
ఐఐటీ కాన్పూర్-ఇంక్యుబేటెడ్ స్టార్ట్-అప్, ఫ్యూచర్ క్రైమ్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎఫ్‌సీఆర్‌ఎఫ్) నివేదిక ప్రకారం, జనవరి 2020 నుంచి జూన్ 2023 మధ్యకాలంలో నమోదైన సైబర్ కేసులపై రీసెర్చ్ నిర్వహించారు. వాటిలో సుమారు సగం కేసులు యూపీఐ సంబంధించినవేనని నివేదికలో పేర్కొన్నారు. గత మూడున్నరేళ్ల కాలంలో నమోదైన సైబర్‌నేరాల్లో సుమారు సగం (47.25) శాతం కేసులు యూపీఐ సంబంధించినవే కావడం.. యూపీఐ ప్రమాద సంకేతాలను స్పష్టం చేస్తోంది. డార్క్‌వెబ్, డార్క్‌నెట్, హ్యాకింగ్ కాన్సె్‌ప్టల పేమెంట్‌ల గేట్‌వేలలో చొచ్చుకెళ్తున్న హ్యాకర్లు ఈజీగా యూపీఐ సంబంధిత ఫోన్‌ల నుంచి డబ్బులు కాజేస్తున్నారని పేర్కొన్నారు. సాంకేతికత, ఇంటర్నెట్ అవగాహన ఉన్న వారికన్నా అవగాహన లేని వారు కూడా పెద్దస్థాయిలో యూపీఐ చెల్లింపులు చేస్తున్నారు. అలాంటి వారిని లక్ష్యంగా చేసుకుంటున్న హ్యాకర్లు.. పేమెంట్లలో చేసే వారి నిర్లక్ష్యాన్ని సొమ్ము చేసుకుంటున్నారు.
ఆర్థిక నేరాల్లో ముంబై టాప్
జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించిన నివేదిక ప్రకారం.. ఆర్థిక నేరాల్లో హైదరాబాద్ నగరం రెండో స్థానంలో నిలిచింది. ఈ కేటగిరీలో ముంబై నగరం టాప్‌లో ఉంది. 2022లో ముంబైలో 6,960 ఆర్థిక నేరాలు నమోదు కాగా, హైదరాబాద్‌లో 6,015 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో ఢిల్లీ 5,007 ఆర్థిక నేరాలతో మూడో స్థానంలో నిలిచింది.