ఈ భర్త మామూలోడు కాదు.. భార్యతో యాత్ర వెళ్లాలని ఏకంగా బుల్లెట్ బండినే కొట్టేశాడు.. కానీ..

ABN , First Publish Date - 2023-06-28T14:02:47+05:30 IST

‘నీ బుల్లెట్ బండి ఎక్కి వచ్చేస్తా పా డుగ్ డుగ్ మని’ అనే పాట కొంతకాలం క్రితం వరకు శ్రోతలను ఓ ఊపు ఊపేసింది. మరి ఆ పాట విని ప్రేరణ పొందాడో లేక మరేదైనా కారణమో తెలియదు కానీ ఓ భర్త తన భార్యతో కలిసి యాత్రకు వెళ్లడానికి బుల్లెట్ బండిని దొంగతనం చేశాడు. అంతటితో ఆగకుండా నగదును కూడా దొంగతనం చేశాడు.

ఈ భర్త మామూలోడు కాదు.. భార్యతో యాత్ర వెళ్లాలని ఏకంగా బుల్లెట్ బండినే కొట్టేశాడు.. కానీ..

ఉత్తరప్రదేశ్‌: ‘నీ బుల్లెట్ బండి ఎక్కి వచ్చేస్తా పా డుగ్ డుగ్ మని’ అనే పాట కొంతకాలం క్రితం వరకు శ్రోతలను ఓ ఊపు ఊపేసింది. మరి ఆ పాట విని ప్రేరణ పొందాడో లేక మరేదైనా కారణమో తెలియదు కానీ ఓ భర్త తన భార్యతో కలిసి యాత్రకు వెళ్లడానికి బుల్లెట్ బండిని దొంగతనం చేశాడు. అంతటితో ఆగకుండా నగదును కూడా దొంగతనం చేశాడు. దొంగిలించిన నగదును తీసుకోని బుల్లెట్ బండిపై భార్యతో కలిసి హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలి యాత్రకు వెళ్లాడు. యాత్ర ముగించుకుని తిరిగి వచ్చాక పోలీసులకు దొరికిపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జరిగిందీ ఈ ఘటన.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు వ్యక్తి జూన్ 3న బుల్లెట్ బండిని దొంగిలించాడు. మరుసటి రోజు ఓ మందుల వ్యాపారి వద్ద నగదుతో కూడిన బ్యాగును దొంగిలించాడు. ఆ తర్వాత జూన్ 6న తన భార్యను తీసుకుని దొంగిలించిన బుల్లెట్ బండిపై, దొంగిలించిన నగదుతో హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలి యాత్రకు వెళ్లాడు. యాత్ర ముగించుకుని మొరాదాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాత, దొంగతనాల వెనుకున్న వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసులు దాడులు నిర్వహిస్తున్న సమయంలో దొరికిపోయాడు.

నిందితుడి వద్ద ఉన్న రూ.86 వేలు, బుల్లెట్ బండి, అక్రమ పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా తన భార్యతో కలిసి మనాలీ యాత్రకు వెళ్లాలనే కోరికను తీర్చుకోవడానికే దొంగతనాలకు పాల్పడినట్లు సదరు వ్యక్తి పోలీసుల విచారణలో తెలిపాడు. అలాగే దొంగిలించిన నగదులో రూ.45,000 యాత్రలో భాగంగా ఖర్చు చేసినట్లు చెప్పాడు. కాగా ఈ కేసులో తదుపరి చర్యలు కొనసాగుతున్నాయి.

Updated Date - 2023-06-28T16:04:33+05:30 IST