Weekend Comment by RK : మేం న్యాయం వైపే
ABN , First Publish Date - 2023-07-30T01:24:40+05:30 IST
‘వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ చెత్తగా ఉంది! కోడి కత్తి కేసులో ఎన్‌ఐఏ సంస్థ కుట్ర కోణాన్ని బయటకు తీయాల్సిందే! అవినీతి కేసుల్లో జగన్మోహన్ రెడ్డిని సీబీఐ అన్యాయంగా ఇరికించింది...
‘వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ చెత్తగా ఉంది! కోడి కత్తి కేసులో ఎన్‌ఐఏ సంస్థ కుట్ర కోణాన్ని బయటకు తీయాల్సిందే! అవినీతి కేసుల్లో జగన్మోహన్ రెడ్డిని సీబీఐ అన్యాయంగా ఇరికించింది! న్యాయ వ్యవస్థను చంద్రబాబు మేనేజ్ చేస్తున్నారు! రాజకీయ వ్యవస్థ భ్రష్టుపట్టి పోయింది!’ ..జగన్ అండ్ కో నోటి వెంట వినబడుతున్న మాటలివి. పరస్పర విరుద్ధమైన ఈ వాదనల్లోని మర్మమేమిటో ప్రజలకు తెలియదని, తెలుసుకోలేరని జగన్ అండ్ కో నమ్ముతున్నది. తాము కోరుకున్న విధంగా దర్యాప్తు చేయని సంస్థలను నిందించడం ఈ గుంపు అలవాటుగా మార్చుకుంది. 2019 ఎన్నికల్లో జగన్‌రెడ్డికి అధికారం కట్టబెట్టి ముఖ్యమంత్రిని చేసి ఉండకపోతే ప్రజలు కూడా చెడిపోయారని నిందించి ఉండేవారు. వివేకానంద రెడ్డి హత్య వెనుక డాక్టర్ సునీతా రెడ్డి దంపతులే ఉన్నారని సీబీఐ నిర్ధారించి ఉంటే శభాష్! అని వీరతాడు మెడలో వేసేవారు. కోడి కత్తి కేసు వెనుక చంద్రబాబు కుట్ర కోణం ఉందని ఎన్‌ఐఏ తేల్చి ఉంటే ఆహా ఓహో అని ఉండేవారు. ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలను సమర్థించి ఉంటే న్యాయ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తోందని చెప్పి ఉండేవారు. కానీ, నిజానికి వ్యవస్థల్లోని లొసుగులతో ఆడుకుంటూ వాటిని అపహాస్యం చేస్తున్నది ఎవరు? అంటే జగన్ అండ్ కో అనే సమాధానం లభిస్తుంది. వివేకా హత్య కేసు విచారణకు సంబంధించి సజ్జల రామకృష్ణా రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలను తీసుకుందాం. ఈ కేసులో సీబీఐ విచారణ పరమచెత్తగా ఉందని ఆయన అంటున్నారంటే సీబీఐ విచారణ సక్రమంగానే జరిగిందని భావించాలి. ఈ కేసులో అవినాశ్ రెడ్డి అరెస్టు కాకుండా వ్యవస్థలను మేనేజ్ చేసింది ఎవరో చిన్న పిల్లవాడికి కూడా తెలుసు. న్యాయ వ్యవస్థలోని లొసుగులను అడ్డుపెట్టుకొని అరెస్టు కాకుండా ఎలా తప్పించుకున్నారో అందరం చూశాం. ఢిల్లీ పెద్దల అభయ హస్తం లభించి ఉండకపోతే అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయకుండా ఉండేదా? ఢిల్లీ పెద్దల అండదండలు పుష్కలంగా ఉన్నప్పటికీ అవినాశ్ రెడ్డి స్థానంలో డాక్టర్ సునీత దంపతులను దోషులుగా సీబీఐ ఎందుకు ఇరికించలేకపోయిందో అని ప్రశ్నించుకుంటే సజ్జల వాదనలోని డొల్లతనం బయటపడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో సీఐడీ అధికారుల వలే ఎవరిని పడితే వారిని కేసుల్లో ఇరికించడానికి సీబీఐ, ఎన్‌ఐఏ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలకు సాధ్యం కాదు. అందుకే కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దల సహకారంతో అరెస్టులు చేయకుండా అడ్డంకులు సృష్టించినప్పటికీ, సీబీఐ అధికారులు తమ పరిధి మేరకు నిందితుల పేర్లను చార్జిషీటులో చేర్చగలిగారు. భారతీరెడ్డితో పాటు తాను డాక్టర్ సునీత ఇంటికి వెళ్లలేదని సజ్జల చెబుతున్నారు. ఈ విషయంలో సజ్జల నిజం చెబుతున్నారో లేదో తెలియాలంటే అప్పటి కాల్ డేటా రికార్డు పరిశీలిస్తే తేలిపోతుంది. తాను పరామర్శకు మాత్రమే సునీత ఇంటికి వెళ్లానని, అప్పుడు తండ్రి హత్యకు గురయ్యారన్న బాధ ఆమెలో తనకు పెద్దగా కనిపించలేదని కూడా సజ్జల నింద వేశారు. తండ్రిని దారుణంగా చంపడాన్ని ఆమె తేలికగా తీసుకొని ఉండివుంటే ఇన్ని వ్యయ ప్రయాసలకు ఓర్చి హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని, ఇంత సుదీర్ఘ పోరాటం ఎందుకు చేసి ఉండేవారు? హత్య చేసిన వాళ్లకే 40 కోట్లు ఇవ్వజూపిన వారు డాక్టర్ సునీత నోరు మూయించడానికి ప్రయత్నించకుండా ఉంటారా? అవినాశ్ అమాయకుడు అని చెబుతూ అతడిని రక్షించడానికి సర్వ శక్తులూ ఒడ్డిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దంపతులు, డాక్టర్ సునీత ఏమి కోరుకుంటే అది ఇచ్చి ఉండేవారు కదా? ఏ విధంగా చూసినా డాక్టర్ సునీతతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి దంపతులు గానీ, ఎంపీ అవినాశ్ రెడ్డి గానీ బలవంతులే.. అయినా సీబీఐ ఎస్పీ రాంసింగ్‌ను సునీత మేనేజ్ చేశారంటే నమ్మగలమా? ప్రలోభాలకు లొంగే మనస్తత్వం కాకపోవడం వల్లే రాంసింగ్.. జగన్ అండ్ కోకు టార్గెట్ కావడం నిజం కాదా? రాంసింగ్‌పై రాష్ట్ర పోలీసులు కేసు పెట్టారంటే ముఖ్యమంత్రి జగన్ అనుమతి లేకుండా సాధ్యమా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత సీబీఐ విచారణ చెత్తగా ఉందని సజ్జల చెబితే నమ్మవచ్చు. దివంగత రాజశేఖర రెడ్డి దూరం పెట్టిన అవినాశ్ రెడ్డి కుటుంబం.. జగన్‌రెడ్డి దంపతులకు అంత ముఖ్యం ఎలా అయిందో కూడా చెప్పాలి. పనిలో పనిగా సజ్జల నన్ను కూడా విమర్శించారు. వివేకానంద రెడ్డి వ్యక్తిత్వ హననానికి మేమెప్పుడూ ప్రయత్నించలేదు. ఆయన గురించి చెత్త రాతలు రాసింది జగన్ మీడియా మాత్రమే. ఆస్తుల గొడవ అని కలరింగ్ ఇచ్చి అసలు నిందితులను తప్పించే ప్రయత్నం చేయడం నిజం కాదా? డాక్టర్ సునీతకు నేను సలహాదారుగా మారానని కూడా సజ్జల నిందించారు. పూర్వాశ్రమంలో తానొక జర్నలిస్టునని సజ్జల మరచిపోయి ఉండవచ్చు గానీ, జర్నలిస్టుగా ఉండటానికే నేను ఇష్టపడతాను. ఈ క్రమంలో నేను ఎంతో మందితో మాట్లాడతాను. అన్యాయానికి గురవుతున్నవారికి అండగా ఉండటానికి ప్రయత్నం చేస్తాను. నాకెందుకులే అనుకుంటే జగన్ అండ్ కోతో నేను సఖ్యతగా ఉండవచ్చు కదా? ఇవాళ రాజశేఖర రెడ్డి కుటుంబానికి ‘ఆంధ్రజ్యోతి’ మాత్రమే అండగా ఉందంటే మా నిబద్ధత ఏమిటో తెలుస్తుంది. రాజశేఖర రెడ్డి కుటుంబంలోని జగన్ బాధితులు మా సహాయం కోరుతున్నారంటే మేము న్యాయం వైపు నిలబడతామన్న నమ్మకం వారిలో ఉన్నట్టే కదా? భవిష్యత్తులో సజ్జల వంటి వారు అధికారం కోల్పోయి అన్యాయానికి గురైతే అప్పుడు మళ్లీ మేమే దిక్కవుతాము. వివేకా కేసులో అవాకులు చవాకులు మాట్లాడుతున్న వారు తమ అంతరాత్మకైనా సమాధానం చెప్పుకొంటే మంచిది.
కోరింది జరగలేదని..
ఇక కోడి కత్తి విషయానికి వద్దాం. 2019 ఎన్నికలకు ముందు విశాఖ విమానాశ్రయంలో జరిగిన ఈ సంఘటనను జగన్ అండ్ కో గరిష్ఠంగా రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంది. జగన్‌పై హత్యాయత్నం జరిగిందని, అదృష్టవశాత్తు జగన్ తప్పించుకున్నారని ప్రచారం చేశారు. ఈ హత్యాయత్నం వెనుక చంద్రబాబు ఉన్నారని కూడా నిందించారు. ఈ క్రమంలో విమానాశ్రయంలోని క్యాంటీన్ నిర్వాహకుడైన హర్ష కులాన్ని కూడా తెర మీదకు తెచ్చి చంద్రబాబుతో ముడిపెట్టారు. కోడి కత్తితో జగన్‌కు స్వల్ప గాయం చేసి రాజకీయంగా ఎంతో లబ్ధి చేకూర్చిన నిందితుడు శ్రీనివాస్ అప్పటి నుంచి జైల్లోనే మగ్గుతున్నాడు. ఈ కేసులో శిక్ష పడినా అతడికి ఇంతకంటే శిక్షాకాలం ఎక్కువ ఉండదేమో. ఇప్పుడు నాలుగున్నరేళ్ల తర్వాత ఎన్‌ఐఏ దర్యాప్తు పట్ల కూడా జగన్ అండ్ కో సంతృప్తి వ్యక్తం చేయడంలేదు. నిందితుడు శ్రీనివాస్ వెనుక చంద్రబాబు ఉన్నారని ఎన్‌ఐఏ చెప్పి ఉంటే జగన్ అండ్ కో సంతసించి ఉండేవారు. అలా జరగలేదు కనుక చంద్రబాబు హస్తం ఉందని చెప్పేవరకు కుట్ర కోణం సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తూనే ఉంటారు. వివేకా కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, కోడి కత్తి కేసును దర్యాప్తు చేసిన ఎన్‌ఐఏ.. కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నవే కదా! జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో నేరుగా భాగస్వామ్య పక్షం కాకపోయినా, నరేంద్ర మోదీ ప్రభుత్వానికి పార్లమెంటులో సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. తాజాగా ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును కూడా జగన్ పార్టీ సమర్థించింది. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తోంది. అయినా విచారణ సరిగా జరగలేదని జగన్ అండ్ కో అంటున్నారంటే వారి ఉద్దేశాలను, నిజ స్వరూపాలను గుర్తించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇక న్యాయ వ్యవస్థ గురించి జగన్ అండ్ కో చేస్తున్న ప్రచారం విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థపై ముప్పేట దాడి చేసింది ఎవరు? న్యాయమూర్తులను మానసికంగా హింసిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారు జగన్ మద్దతుదారులు కారా? ఆ కేసులో అరెస్టు అయినవారు ఎవరు? తెలుగువాడు అయినప్పటికీ జస్టిస్ ఎన్వీ రమణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించరాదంటూ ఆయనపై ఫిర్యాదులు చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా? అదే జగన్మోహన్ రెడ్డి, అదే జస్టిస్ రమణ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన తర్వాత సతీసమేతంగా వెళ్లి దర్శించుకోలేదా? జస్టిస్ ఎన్వీ రమణ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైనప్పటికీ తనపై దాఖలైన సీబీఐ చార్జిషీటు విచారణకు నోచుకోకుండా కట్టడి చేయాల్సిన వాళ్లను కట్టడి చేయించిన జగన్మోహన్ రెడ్డి ఏ వ్యవస్థలను మేనేజ్ చేశారో చెప్పాలి.
అరాచకాలకు పాల్పడుతూనే..
ఇపుడు ప్రజల విషయానికి వద్దాం. రాష్ట్ర భవిష్యత్తుతో పాటు తమ పిల్లల భవిష్యత్తుపై ఆలోచన ఉన్న వారు జగన్‌రెడ్డి విధ్వంసకర పాలనను వ్యతిరేకించి తీరుతారు కనుక వారందరినీ ఆయన పెత్తందార్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. తాత్కాలిక సంతోషాన్ని మాత్రమే కలిగించే సంక్షేమ పథకాలు పొందుతున్న వారి అమాయకత్వాన్ని అడ్డుపెట్టుకొని అరాచకాలకు తెగబడుతున్నది నిజం కాదా? జగన్మోహన్ రెడ్డి తప్ప అధికారాన్ని అడ్డుపెట్టుకొని సంపద పోగేసుకున్న నాయకుడు ఈ దేశ చరిత్రలోనే మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. అయినా తాను పేదల ప్రతినిధినని అంటే నమ్మాలంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎంత అధికారం ఉన్నప్పటికీ, వెనకాల ఎంత డబ్బు ఉన్నప్పటికీ, ఢిల్లీలో పరపతి అరచేతి మందాన ఉన్నప్పటికీ ప్రలోభాలకు లొంగకుండా నిబద్ధతతో పనిచేసే వ్యక్తులు వ్యవస్థలలో మిగిలే ఉన్నారు. అందుకే జగన్ అండ్ కో ఆయా వ్యవస్థలపై అక్కసు వెళ్లగక్కుతోంది. తన అధీనంలోని సీఐడీ మాదిరిగా.. ప్రశ్నించేవారిపై, గిట్టనివారిపై తప్పుడు కేసులు పెట్టి హింసించాలని అన్ని వ్యవస్థల నుంచీ జగన్ అండ్ కో ఆశిస్తున్నట్టుగా ఉంది. ఈ నాలుగేళ్లలో సీఐడీ విభాగం ఎంత మందిపై ఎన్ని కేసులు పెట్టిందో లెక్కలేదు. అయితే ఒక్క కేసులో కూడా విచారణ చేసి చార్జిషీటు దాఖలు చేయలేదు. చార్జిషీటు దాఖలు చేస్తే కేసులోని డొల్లతనం బయటపడుతుందిగా! దీన్నిబట్టి సీఐడీ విభాగాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంతగా దిగజార్చారో స్పష్టమవుతోంది. కేంద్ర ఏజెన్సీలతో పాటు న్యాయ వ్యవస్థ కూడా అలాగే పతనమై జగన్ అండ్ కోను సంతోషపెట్టాలన్నది వారి అభిమతం. జగన్ దీర్ఘకాలం అధికారంలో కొనసాగితే న్యాయం చేయగల వ్యవస్థలలోని మిగిలి ఉన్న వ్యక్తులు కూడా కనుమరుగు కావొచ్చు. వ్యవస్థలన్నీ తమకు అనుకూలంగా పనిచేయాలని, ప్రజలందరూ తనకే ఓటు వేయాలని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటూ ఉండవచ్చును గానీ అది ఎన్నటికీ జరగదు. రాజకీయాలు చెడిపోయాయని కూడా జగన్ అంటుంటారు. అంటే తాను ఏం చేసినా ఇతర పక్షాలు చప్పట్లు కొట్టాలి. అలా జరగదు కనుక రాజకీయాలు చెడిపోయాయని ఆయన చిరాకు పడతారు. జగన్ మెప్పు పొందాలంటే.. దర్యాప్తు సంస్థలన్నీ జగన్ రాసిచ్చిన స్ర్కిప్ట్‌నే చార్జిషీట్లుగా రూపొందించాలి. న్యాయస్థానాలు అనుకూలంగా తీర్పులివ్వాలి. ప్రజలు కూడా ఆయన సొంత పత్రిక మాత్రమే చదవాలి– సొంత చానల్ మాత్రమే చూడాలి. భారతీ సిమెంట్స్ ఉత్పత్తి చేసే సిమెంటునే వినియోగించాలి. వ్యాపారాలు అన్నింటిలో జగన్‌కు వాటాలు ఉండాలి. అప్పుడే ఆయనకు సంతృప్తి కలుగుతుంది. అయితే అది ఎలా సాధ్యం అని ప్రశ్నించుకోరు.
పొత్తుల తకరారు!
జగన్‌రెడ్డి తీరు అలా ఉంచి, తెలుగునాట రాజకీయాల విషయానికి వద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షాలన్నీ ప్రస్తుతానికి ఒక్క తాటిపైకి వచ్చాయి. ‘ఇండియా’ పేరిట కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. గతంలో ఇలాంటి కూటముల ఏర్పాటు సత్ఫలితాలను ఇచ్చినప్పటికీ ఎక్కువ కాలం ఐక్యంగా ఉండలేకపోయాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఇండియా కూటమిలో ఎవరూ చేరలేదు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ ప్రధాని మోదీతో అంటకాగుతున్నది. ఎన్డీఏ భాగస్వామిగా లేకపోయినా పార్లమెంటులో పూర్తి మద్దతిస్తున్నది. తాజాగా ఇండియా కూటమి ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించాలని, ఢిల్లీ ఆర్డినెన్స్‌కు మద్దతివ్వాలని జగన్‌రెడ్డి నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చాయి. వివిధ కేసుల నేపథ్యంలో ఆయనకు మరో ప్రత్యామ్నాయం ఉండి ఉండకపోవచ్చు. తెలుగుదేశం పార్టీది కూడా ఇంచుమించుగా ఇదే పరిస్థితి. రానున్న ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు ఆ పార్టీ సుముఖంగా లేకపోయినప్పటికీ బీజేపీని కాదనలేని పరిస్థితి. జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాను కలిసినప్పుడు పొత్తుల వ్యవహారం చర్చకు రాగా తెలుగుదేశం పార్టీని కలుపుకొని వెళ్లాలని తాము కూడా ఆలోచిస్తున్నామని షా స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే ముఖ్యమంత్రి జగన్‌కు అన్నివిధాలా మద్దతు ఇస్తున్న నేపథ్యంలో బీజేపీతో చేతులు కలపడం వల్ల నష్టపోతామని తెలుగుదేశం పార్టీలో అంతర్మథనం కొనసాగుతోంది. పొత్తు అనేది ఉభయకుశలోపరిగా ఉండాలన్నది తెలుగుదేశం పార్టీ అభిప్రాయం. కేసుల విషయంలో జగన్‌కు అండగా నిలవడంతో పాటు నిబంధనలతో నిమిత్తం లేకుండా అప్పులు మంజూరు చేస్తున్న బీజేపీని నమ్మడం ఎలా? అని తెలుగుదేశం నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకోని పక్షంలో ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ తమకే మద్దతు ఇస్తుందని గ్యారెంటీ ఏమిటి? అని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ కారణంగా రెండు పార్టీల మధ్య పరస్పర అపనమ్మకం ఏర్పడింది. ఫలితంగా పొత్తుల వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఎన్నికల తేదీ సమీపించిన తర్వాత ఈ విషయంలో స్పష్టత ఏర్పడే అవకాశం ఉంది. పార్లమెంటులో పూర్తి మద్దతు ఇవ్వడం ద్వారా బీజేపీకి మరింత సన్నిహితం కావడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు. ప్రధాని మోదీ దృష్టిలో జగన్ నమ్మకమైన, విశ్వాసపాత్రుడైన మిత్రుడు అని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎన్నికల కమిషన్ నుంచి సహాయ సహకారాలు అందకుండా అడ్డుకోవడం కోసం జగన్ పావులు కదుపుతున్నారట. జనసేనాని పవన్ కల్యాణ్ మాత్రం తెలుగుదేశం–జనసేన–బీజేపీ కలిసే పోటీ చేస్తాయనే నమ్మకంతో ఉన్నారు. ఏ కారణం వల్లనైనా తెలుగుదేశం–బీజేపీ మధ్య అవగాహన ఏర్పడని పక్షంలో జనసేన పాత్ర ఎలా ఉండబోతున్నదన్న విషయమై స్పష్టత రావాల్సి ఉంది. పొత్తుల తకరారు తేలడానికి ఇంకో ఆరు నెలలకు పైగా సమయం ఉన్నందున ప్రస్తుతానికి ఏ పార్టీ వైఖరి ఎలా ఉంటుందో తెలియదు. పొత్తులు కుదరకూడదన్న జగన్ కోరిక ఫలిస్తుందో లేదో స్పష్టం కావాలన్నా వేచి చూడాల్సిందే. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఎన్నికలకు ఇంకో మూడు నెలల వ్యవధి ఉన్నప్పటికీ రాజకీయ సమీకరణాల విషయమై స్పష్టత ఏర్పడటం లేదు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కమ్యూనిస్టులను పిలిచి భోజనం పెట్టి మద్దతు పొందిన కేసీఆర్, ఆ తర్వాత వారి ముఖం కూడా చూడటంలేదు. దీంతో కమ్యూనిస్టులు గుర్రుగా ఉంటున్నారు. అదే సమయంలో బీజేపీని ఎదిరించే విషయంలో కేసీఆర్ నిబద్ధతపై కమ్యూనిస్టులలో అనుమానాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో కేసీఆర్ చేరకపోవడమే ఇందుకు కారణమని వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపే విషయమై తెలంగాణలోని కమ్యూనిస్టులు ఆలోచిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్‌ను కలిసి సీట్ల కేటాయింపుపై స్పష్టత తెచ్చుకోవాలని తాము ఆశించామని, అయితే ఆయన ఇంతవరకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని ఒక కమ్యూనిస్టు నాయకుడు చెప్పుకొచ్చారు. ఈ కారణంగా కాంగ్రెస్ పార్టీతో కలసి పోటీ చేసే విషయమై ఆలోచన చేస్తున్నామని ఆయన తెలిపారు. కమ్యూనిస్టుల బలం గురించి బీఆర్‌ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీకి పెద్దగా అంచనాలు లేకపోయినా పోటీ తీవ్రంగా ఉన్న పక్షంలో కమ్యూనిస్టుల బలం గెలుపునకు తులసిదళంలా పనిచేస్తుందని మరో కమ్యూనిస్టు నేత విశ్లేషించారు. మునుగోడు అవసరం తీరింది కనుక తమను కేసీఆర్ లెక్కచేయడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదే కారణం కాకపోయినా బీఆర్‌ఎస్–బీజేపీ మధ్య ఏదో రహస్య అవగాహన కుదిరిందన్న అనుమానం తమకు కూడా ఉందని కమ్యూనిస్టులు చెబుతున్నారు. దక్షిణ తెలంగాణలో, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టుల బలాన్ని కొట్టిపారేయలేము. కమ్యూనిస్టుల ఆలోచనల్లో వచ్చిన మార్పును గమనించిన కాంగ్రెస్ పార్టీ కూడా వారిని తమవైపు తిప్పుకోవడానికి పావులు కదుపుతున్నది. కమ్యూనిస్టులు ముందుకొస్తే వారితో పొత్తులకు ప్రయత్నించవలసిందిగా రాష్ట్ర నాయకత్వానికి ఆ పార్టీ అధిష్ఠానం నుంచి ఆదేశాలు కూడా అందాయి. అయితే వచ్చే ఎన్నికల తర్వాతనైనా శాసనసభలో ప్రాతినిధ్యం ఉండాలని కమ్యూనిస్టులు బలంగా కోరుతున్నారు. ఈ కారణంగానే వారు పొత్తు విషయమై ఆచితూచి వ్యవహరించాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్‌ను నైతికంగా దెబ్బతీయడం కోసం కేసీఆర్ పావులు కదుపుతున్నట్టు వార్తలు వస్తున్నందున ఆ పార్టీ నుంచి ఎవరెవరు వలస పోతున్నారో స్పష్టమయ్యే వరకు వేచి చూసే ధోరణి కమ్యూనిస్టు పార్టీలో కనిపిస్తున్నది. ఆగస్టు నెలలో కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లోకి కొంత మంది కీలక నేతలు వలస వెళతారని వార్తలు వస్తున్నందున ఎన్నికల షెడ్యూలు వెలువడే నాటికి కాంగ్రెస్ బలంపై ఒక అంచనాకు వచ్చి, ఆ తర్వాత పొత్తుపై ఆలోచిస్తామని ఒక సీనియర్ కమ్యూనిస్టు నేత చెప్పారు. అయితే తమకు కనీస గౌరవం ఇవ్వని కేసీఆర్‌తో కలసి వెళ్లడానికి ఉభయ కమ్యూనిస్టు పార్టీలలోని క్షేత్ర స్థాయి నాయకులు విముఖంగా ఉన్నారు. ప్రజాక్షేత్రంలో కేసీఆర్‌పై వ్యతిరేకత ఉన్నందున బీఆర్‌ఎస్‌తో జతకడితే నష్టపోతామని రెండు పార్టీలకు చెందిన కార్యదర్శి వర్గ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ర్టాలలో రాజకీయ సమీకరణాల విషయమై స్పష్టత రావడానికి మరికొంత కాలం వేచి చూడక తప్పదు!
ఆర్కే