AP Education: ప్రశ్నపత్రాలకు డబ్బుల్లేవ్‌! వాట్సాప్‌లో పంపుతున్నట్లు వెల్లడి

ABN , First Publish Date - 2023-10-03T10:24:31+05:30 IST

ఉద్యోగుల జీతాలకు నిధుల్లేకపోవడం, సీఎం సభలకు డబ్బుల్లేకపోవడమే ఇప్పటివరకూ చూశాం. ఇప్పుడు పాఠశాల విద్యార్థుల పరీక్షల నిర్వహణకూ పైసల్లేవని రాష్ట్ర ప్రభుత్వం తేల్చేసింది. మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌-2 పరీక్షలకు ప్రశ్నపత్రాలు ముద్రించబోమని

AP Education: ప్రశ్నపత్రాలకు డబ్బుల్లేవ్‌! వాట్సాప్‌లో పంపుతున్నట్లు వెల్లడి

  • వాట్సా్‌ప్‌లో పేపర్లు.. బోర్డులపై రాతలు

  • వాటిని చూస్తూ జవాబులు రాసే దుస్థితి

  • విద్యార్థికి రూ.150 ఖర్చు చేయలేని ప్రభుత్వం

  • దీన స్థితిలో పాఠశాల విద్యాశాఖ పరీక్షలు

  • గతేడాది వాట్సా్‌పలో లీకైన ప్రశ్నపత్రాలు

  • పాఠశాలల్లో టీచర్లు, విద్యార్థులకు తిప్పలు

  • అయినా తీరు మార్చుకోని జగన్‌ సర్కారు

  • విద్యకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ప్రచారం

  • ప్రశ్నపత్రాలు ముద్రించలేని ధైన్యం

(అమరావతి - ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల జీతాలకు నిధుల్లేకపోవడం, సీఎం సభలకు డబ్బుల్లేకపోవడమే ఇప్పటివరకూ చూశాం. ఇప్పుడు పాఠశాల విద్యార్థుల పరీక్షల నిర్వహణకూ పైసల్లేవని రాష్ట్ర ప్రభుత్వం తేల్చేసింది. మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌-2 పరీక్షలకు ప్రశ్నపత్రాలు ముద్రించబోమని పాఠశాల విద్యాశాఖ కరాఖండిగా చెప్పేసింది. ప్రశ్నపత్రాలను వాట్సా్‌పలో పంపుతామని, వాటిని టీచర్లు బోర్డుపై రాయాలని సూచించింది. అలా రాసినవి చూస్తూ ప్రశ్నలు, సమాధానాలు రాయాలని విద్యార్థులకు అదనపు పనిపెట్టింది. ఇంతకాలం విద్యారంగంపై వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చామని ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వంప్రశ్నపత్రాలు ముద్రించలేదా.? అని టీచర్లు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పరీక్షల నిర్వహణ ఇంత దయనీయంగా మారుతుందనుకోలేదని టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అందరికీ వాట్సా్‌పలోనే

ఎఫ్‌ఏ-2 పరీక్షలకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్‌సీఈఆర్‌టీ) ఇటీవల షెడ్యూల్‌ విడుదల చేసింది. మంగళవారం నుంచి ఈ నెల 6 వరకు పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. అయితే ప్రశ్నపత్రాలు ఎప్పుడిస్తారని టీచర్లు ప్రశ్నించగా.. అలాంటివేమీ ఉండవని, సాఫ్ట్‌ కాపీని వాట్సా్‌పలో షేర్‌ చేస్తామని ఉన్నతాధికారులు బదులిచ్చారు. ప్రతి పరీక్షకూ ముందు రోజు రాత్రి లేదా పరీక్ష రోజు ఉదయం ప్రశ్నపత్రాలను వాట్సా్‌పలో ప్రధానోపాధ్యాయులకు పంపుతారు. హెచ్‌ఎంలు వాటిని సంబంధిత సబ్జెక్టు టీచర్లకు పంపి, బోర్డుపై రాయాలని సూచిస్తారు. గత విద్యా సంవత్సరంలో ఎఫ్‌ఏ-2, 4 పరీక్షలకు కూడా ఇదే విధానం అమలుచేశారు. అయితే ఇదంతా కష్టంగా ఉందని, ముద్రించిన పత్రాలు ఇవ్వాలని టీచర్లు కోరారు. అయినా ఈ ఏడాది కూడా వాట్సా్‌పలోనే పంపిస్తాయని, ముద్రించిన పత్రాలు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతేడాది ప్రైవేటు పాఠశాలలకు మాత్రం ముద్రించిన ప్రశ్నపత్రాలనే పంపించారు. దీనికోసం సగటున విద్యార్థికి రూ.150 చొప్పున ప్రైవేటు యాజమాన్యాలు చెల్లించాయి. అయితే తమకూ వాట్సా్‌పలోనే ఇవ్వాలని ప్రైవేటు యాజమాన్యాలు కోరడంతో, ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలలకు కూడా వాట్సా్‌పలోనే పంపుతున్నారు.

ఖర్చు తక్కువే అయినా..

ప్రభుత్వ పాఠశాలల్లో 39 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రైవేటు పాఠశాలల నుంచి ఎక్కువ నగదు వసూలు చేసినా, ప్రభుత్వ పాఠశాలలకు ప్రింటింగ్‌ ఖర్చులు ఎక్కువేమీ కాదు. అయినా పాఠశాల విద్యాశాఖ డబ్బులు ఆదా చేసుకునే లక్ష్యంతో ప్రశ్నపత్రాల్లేని పరీక్షలు మొదలుపెట్టింది. ఫలితంగా పరీక్షల నిర్వహణ టీచర్లకు తలనొప్పిగా మారింది. బోర్డులపై ప్రశ్నలు రాసేందుకు ఉదయం గంట ముందే పాఠశాలలకు చేరుకోవాలి. అలా వచ్చినా కొన్ని ప్రశ్నపత్రాలకు బోర్డులు సరిపోవడం లేదు. చిన్న అక్షరాలు రాస్తే చివర్లో ఉన్న విద్యార్థులకు కనిపించదు. దీంతో చాలా చోట్ల ఈ తలనొప్పులు భరించలేక హెచ్‌ఎంలు సొంత డబ్బుతో ప్రశ్నపత్రాలు ముద్రించి ఇస్తున్నారు. ఇక సింగిల్‌ టీచర్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కష్టాలు వర్ణనాతీతం. ఉదయాన్నే వచ్చి రోజువారీ ఫొటోలు, హాజరు నమోదు వంటి పనులు పూర్తిచేసుకుని పరీక్షలు నిర్వహించడం ఇబ్బందిగా మారింది. కాగా, ముందే ప్రశ్నపత్రాలు వాట్సా్‌పలో పంపడం వల్ల లీకులు పెరిగిపోయాయి. గతేడాది కూడా ముందు రోజే సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి.

ఖర్చు తగ్గించే పద్ధతి ఇదేనా..?

ప్రశ్నపత్రాల ప్రింటింగ్‌పై వెనకడుగేసిన ఎస్‌సీఈఆర్‌టీ అన్ని సమావేశాలనూ ప్రైవేటు హోటళ్లలోనే నిర్వహిస్తోంది. ఎస్‌సీఈఆర్‌టీ నిర్వహించే టీచర్ల శిక్షణ, ఇతరత్రా కార్యక్రమాలకు ప్రైవేటు హోటళ్లే కేంద్రంగా మారుతున్నాయి. ఉన్నత విద్యామండలి, ఇంటర్మీడియట్‌ విద్యామండలి, కళాశాల విద్యాశాఖల కార్యక్రమాలు వారి కార్యాలయాల్లోనే నిర్వహిస్తుండగా.. ఎస్‌సీఈఆర్‌టీ మాత్రం ప్రతిదానికీ ప్రైవేటు హోటళ్లనే ఎంపిక చేస్తోంది. ఇలా ప్రభుత్వ సొమ్ము వృథా చేస్తున్న ఎస్‌సీఈఆర్‌టీ ప్రశ్నపత్రాల ముద్రణపై చేతులెత్తేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులకు అవసరమైన ప్రశ్నపత్రాల ప్రింటింగ్‌ ఖర్చుని తగ్గించే బదులు వృథా ఖర్చులు తగ్గించుకోవచ్చు కదా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Updated Date - 2023-10-03T10:39:16+05:30 IST