Telangana: ఆమోదిస్తే విద్యార్థులకు ఉపశమనమే!
ABN , First Publish Date - 2023-03-02T11:44:29+05:30 IST
రాష్ట్రం (Telangana) లోని సంక్షేమ వసతి గృహాల్లోని (Hostels) విద్యార్థుల మెస్ (డైట్) బిల్లుల (Mess bills) పెంపునకు రంగం సిద్ధమైంది. మెస్
మెస్ బిల్లులు 25% పెంపు?
మంత్రులు, అధికారులతో హరీశ్ భేటీ
సీఎం కేసీఆర్ వద్దకు ప్రతిపాదనలు
ఆమోదిస్తే అమల్లోకి కొత్త చార్జీలు
ఖజనాపై 302 కోట్ల అదనపు భారం
ప్రస్తావనకు రాని కాస్మెటిక్ చార్జీలు
హైదరాబాద్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం (Telangana) లోని సంక్షేమ వసతి గృహాల్లోని (Hostels) విద్యార్థుల మెస్ (డైట్) బిల్లుల (Mess bills) పెంపునకు రంగం సిద్ధమైంది. మెస్ బిల్లులను 25 శాతం మేర పెంచాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు (Harish Rao) నేతృత్వంలోని మంత్రుల బృందం ప్రతిపాదించింది. ఈ మేరకు ముఖ్యమంత్రికి కేసీఆర్‌కు (CM KCR) ఓ నివేదికను పంపింది. ఆ ప్రతిపాదనలకు సీఎం ఆమోదముద్ర పడితే కొత్త చార్జీలు అమలులోకి వస్తాయి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2017లో చివరిగా రాష్ట్రంలో మెస్ చార్జీలను పెంచారు. పెరిగిన నిత్యావసరాల ధరలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం మెస్ చార్జీల పెంపునకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో బుధవారం కీలక సమావేశం జరిగింది. గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం మెస్ బిల్లుగా ఇస్తున్న మొత్తాన్ని 25 శాతం పెంచాలని ప్రతిపాదించారు. ఈ మేరకు 3 నుంచి 7వ తరగతి విద్యార్ధులకిచ్చే మెస్ బిల్లును రూ.1,200 చేయాలని, 8 నుంచి 10వ తరగతి విద్యార్ధులకు రూ.1,400, ఇంటర్, పీజీ విద్యార్ధులకు రూ.1,875 చొప్పున ఇవ్వాలని ప్రతిపాదిస్తూ సీఎం కేసీఆర్‌కు నివేదిక పంపారు. మెస్ బిల్లుల పెంపుతో ప్రభుత్వంపై ఏటా రూ.,302 కోట్ల అదనపు భారం పడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రతి నెలా చెల్లిస్తున్న మెస్ బిల్లులు మొత్తం ఏడాదికి రూ.1,053.84 కోట్లు ఉండగా, 25 శాతం పెంపుతో అది రూ.1,329 కోట్లకు చేరుతుందని, ప్రతి నెలా రూ.27.50కోట్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని నివేదించారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల హాస్టళ్లు కలిపి మొత్తం 3,214 ఉండగా వీటిలో 8,59,959 మంది విద్యార్థులు ఉన్నారు.
కాస్మోటిక్, డే స్కాలర్ చార్జీల ఊసే లేదు..
వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల మెస్ బిల్లుల పెంపుపై నిర్ణయం తీసుకున్న మంత్రుల బృందం.. కాస్మోటిక్ చార్జీలు, కాలేజీలకు వెళ్లే డే స్కాలర్ విద్యార్ధులకు ఇస్తోన్న సాయం పెంపుపై చర్చించలేదు. దీంతో ఈ రెండు అంశాల పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది. నిత్యావసరాలతో పాటు కాస్మోటిక్ చార్జీలు కూడా పెరిగిన నేపథ్యంలో వీటి ధరలను కూడా పెంచాలని విద్యార్థుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. కాగా, ప్రస్తుతం కాస్మోటిక్ చార్జీల కింద బాలికలకు రూ.150, బాలురకు రూ.100 చొప్పున అందిస్తున్నారు. వీరు సుమారు 4 నుంచి 5 లక్షల మంది ఉన్నారు. ఇక హాస్టళ్లలో సీటు దొరకని ఇంటర్, పీజీ విద్యార్థులకు ప్రభుత్వం ప్రస్తుతం రూ.600 అందిస్తోంది. ప్రస్తుతం ఇంటర్ ఆ పైన చదువుతున్న విద్యార్థులు తెలంగాణ ఈ-పాస్ లో నమోదైనవారే సుమారు 12 లక్షల మంది ఉన్నారు. వీళ్లలో డేస్కాలర్లు సుమారు 5 లక్షల మంది ఉంటారని అంచనా. ఈ మొత్తాలను కూడా పెంచాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
స్వాగతిస్తున్నాం కానీ...
హాస్టళ్లు, గురుకులాల్లోని విద్యార్థులకు మెస్ బిల్లుల పెంపుపై ప్రభుత్వ ప్రతిపాదనను స్వాగతిస్తున్నాం. కానీ పెంచిన ధరలు నామమాత్రంగానే ఉన్నాయి. ఈ అంశంపై మంత్రులు మరోసారి చర్చించాలి. కాస్మోటిక్ చార్జీలు, హాస్టళ్లలో సీట్లు దొరకక, బయట ఉండి చదువుకుంటున్న వారికి అందించే సాయాన్ని కూడా పెంచాలి.
- తాళ్ల.నాగరాజు, కార్యదర్శి, ఎస్‌ఎఫ్‌ఐ.
హాస్టళ్లలో ఎప్పటికప్పుడు తనిఖీలు..
అధికారులకు మంత్రి హరీశ్ ఆదేశాలు
రాష్ట్రంలో మెస్ బిల్లులు పెంచి ఐదేండ్లు అవుతున్న నేపథ్యంలో మరోసారి డైట్ చార్జీలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రులతో జరిగిన సమావేశంలో హరీశ్‌రావు అన్నారు. జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులు ఎప్పటికప్పుడు హాస్టళ్లను తనిఖీ చేయాలని ఆదేశించారు. అధికారులు విద్యార్థులతో కలిసి భోజనం చేయడంతోపాటు వసతి గృహంలో నిద్రించి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. కాగా, పది మంది కంటే తక్కువ సంఖ్యలో విద్యార్థులు కలిగిన హాస్టళ్లను వాటికి సమీపంలో అదే శాఖ నిర్వహిస్తోన్న గురుకులాల్లో కలిపే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు స్పష్టం చేశారు.