తొలి ప్రయత్నంలోనే ఆశ్రిత్‌ ఐఏఎస్‌కు ఎలా ఎంపికయ్యాడంటే..!

ABN , First Publish Date - 2023-06-01T12:29:56+05:30 IST

పిన్న వయస్సులోనే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టేయడమంటే ఇదే. మన దేశంలో అత్యున్నత స్థాయి పరీక్ష యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్‌. అందులో మొదటి యత్నంలోనే ఐఎఎస్‌కు ఎంపికయ్యేందుకు

తొలి ప్రయత్నంలోనే ఆశ్రిత్‌ ఐఏఎస్‌కు ఎలా ఎంపికయ్యాడంటే..!
IAS

పిన్న వయస్సులోనే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టేయడమంటే ఇదే. మన దేశంలో అత్యున్నత స్థాయి పరీక్ష యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్‌. అందులో మొదటి యత్నంలోనే ఐఎఎస్‌కు ఎంపికయ్యేందుకు అవసరమైన ర్యాంక్‌ సాధించడం ఏమంత చిన్న విషయం ఏమీ కాదు. అయితే ఆ లక్ష్యాన్ని జస్ట్‌ ఇరవై రెండేళ్ళకే సాధించిన ఆశ్రిత్‌ మన తెలుగబ్బాయి. అంతేకాదు ఇతను 2000 సంవత్సరం తరువాత పుట్టి సివిల్స్‌ సాధించిన తొలి యువకుడు కావచ్చు. అలాగే అదృష్టం కలిస్తే ఉద్యోగంలో కూడా అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశాలు ఎక్కువ. నల్లేరుపై బండి నడకలా సాగిన ఈ కుర్రాడి సివిల్స్‌ జర్నీ వివరాలు అతని మాటల్లోనే....

బిట్స్‌ పిలానీ క్యాంప్‌సలో బీటెక్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌ చేశాను. సివిల్స్‌ నా లక్ష్యం కావడంతో క్యాంపస్‌ ఇంటర్వ్యూలకు అస్సలు కూర్చోలేదు.

డిగ్రీ అందుకోగానే సివిల్స్‌ కోసం ఢిల్లీకి చెందిన ఓ సంస్థలో ఆన్‌లైన్‌ కోచింగ్‌లో చేరాను. అప్పట్లో కొవిడ్‌ మహమ్మారి విజృంభిస్తుండటంతో నేరుగా తరగతులకు హాజరయ్యే పరిస్థితి లేదు.

ట్రయల్‌ అండ్‌ ఎర్రర్‌

ముందుగా అనుకుని ప్రిపరేషన్‌కు ఒక పద్ధతి అంటూ నిర్ణయించుకోలేదు. అంతా ట్రయల్‌ అండ్‌ ఎర్రర్‌ పద్ధతిలో జరిగింది. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూ అని దేనికది కాకుండా సమగ్ర విధానానికి తొలి నుంచీ ప్రాధాన్యం ఇచ్చాను. దేనికదిగా పరీక్షకు ముందు మాత్రం దానిపై దృష్టి కేంద్రీకరించాను. ఆప్షనల్‌ సబ్జెక్టు ఆంత్రోపాలజీ సహా అన్ని పేపర్లలో ముఖ్యమైన ఇష్యూలను ఆసాంతం మొదట తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఆ తరవాత ఏ విషయాలు అవసరం, మరేవి అనవసరం అన్నది విడదీసుకున్నాను. యావరేజ్‌ నాలెడ్జ్‌ ఏర్పడ్డాక ప్రశ్నల ప్రయారిటైజేషన్‌ చేసుకున్నాను. ఉదాహరణకు పాలిటీ, ఎకానమీ, అగ్రికల్చర్‌పై ప్రశ్నలు ఎక్కువ వస్తాయి. వాటిని విస్తృతంగా తెలుసుకున్నాను.

రాసే స్కిల్స్‌ పెంచుకున్నా

నాకు వేగంగా రాసే అలవాటు ఉంది. సివిల్స్‌ మెయిన్స్‌లో ఏ పరీక్షలో అయినా ఇరవై వరకు సమాధానాలు రాయాలి. నిజానికి పరీక్ష మొత్తం రాయగలిగితే సగం విజయం సాధించినట్లే. ఏ ప్రశ్నా విడిచిపెట్టకుండా రాయడం ఒక ఎత్తు. అన్నింటినీ బ్యాలెన్స్‌ చేసుకుంటూ, ప్రశ్నకు అనువుగా సమాధానాలు రాయడం మరొక ఎత్తు. అవసరమైన చోట డేటా, మ్యాప్స్‌ జత చేయాలి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాయాలని ఒక లక్ష్యంగా పెట్టుకోవడం కాదు, ఆ దిశగా గట్టి ప్రయత్నమే చేశాను.

  • మాక్‌ టెస్టులు మూడు గంటలు అని కాకుండా మొదట ఒక గంటకు కుదించికుని రాశాను. ఆ సమయంలో పర్ఫెక్ట్‌గా అయిదు ప్రశ్నలకు తగ్గకుండా సమాధానాలు రాసేవాడిని. నిజానికి నాకుగా నేను అనుసరించిన ఒక టెక్నిక్‌ ఇది. అక్కడే మరొకటి లేదా రెండు ప్రశ్నలకు జవాబులు రాయడానికి కృషి చేశాను. ఆ క్రమంలో వేగం పెరిగింది. మూడు గంటలకు లోపే అన్ని ప్రశ్నలకు సమాధానం రాయడమే కాదు, రివిజన్‌కు కొద్దిపాటి సమయాన్ని మిగుల్చుకోగలిగాను. ఏవైనా అరకొర ఉంటే వాటిని పూర్తి చేసుకున్నాను. అసలు ఎగ్జామ్‌లో ఒక్కో సబ్జెక్టులో 50 పేజీలు నింపాలి. నా ప్రాక్టీస్‌ దానికి అనుగుణంగా ఒక పద్ధతిలో ఆరంభించి, వేగంగా పూర్తి చేసే స్థితికి చేరుకున్నాను.

స్నేహితుల విశ్లేషణలు భేష్‌

అన్నింటికీ మించి ఈ విషయంలో నా స్నేహితుల సహాయం మరువలేనిది. నేను రాసిన వాటిని చదివి, నిష్పక్షపాతం గా, నిష్కర్షగా చెప్పేవారు. నువ్వు తోపురా అని ఒక్కనాడు కూడా అనలేదు. లోపాలనే ఎక్కువగా తెలిపేవారు. దరిద్రంగా ఉన్నాయిరా నీ సమాధానాలు అని కూడా చెప్పేవారు. అంత పక్కాగా ఉండేది వాళ్ళ విశ్లేషణ. అవన్నీ సవరించుకుని మళ్ళీ మరో మాక్‌ టెస్ట్‌ రాసేవాడిని. హిందూ దినపత్రికను సివిల్స్‌ యాస్పిరెంట్స్‌ అందరూ చదువుతారు. ప్రతి రోజూ అదెలా చదవాలో చెప్పే పద్ధతులు ఇప్పుడు యూట్యూబ్‌లో వస్తున్నాయి. గుర్తుంచుకోవాల్సిన విషయాలు, పాయింట్స్‌ కూడా వాటిలో చెబుతున్నారు. అయితే అవి కొన్నాళ్ళే ఫాలో అయ్యాను. స్పూన్‌ఫీడింగ్‌లా అనిపించింది. అందుకని తదుపరి రోజుల్లో నాకు నేనే నిర్ణయించుకుని చదువుకునేవాడిని.

ఎంత సేపు చదివాం కాదు.. ఎంత బుర్రకు ఎక్కిందే లెక్క

ఎంత సేపు చదివాం అన్నది కాదు, ఎంత బుర్రకు ఎక్కించుకున్నాం అన్న మాటను ప్రతి ఒక్కరూ చెబుతారు. నావరకు ఒకటే మాట చెబుతాను. ఈ ట్రయల్‌ అండ్‌ ఎర్రర్‌ పద్ధతిలో నేను తెలుసుకున్నది కూడా ఒకటే. రోజుకు ఎనిమిది గంటలు చదవాలి. పది రోజుల తరవాత విరామం ఇచ్చుకోవాలి. ఒక రోజు సెలవు తరవాత మళ్ళీ ప్రిపరేషన్‌ మొదలుపెట్టాలి. అలా ఏడాదిన్నర కృషి చేసి ఈ విజయం అందుకున్నాను. వాస్తవానికి ఇది ఆచరణలో పెట్టాలంటే గట్టి ప్రయత్నమే చేయాలి. సివిల్స్‌ ప్రిపరేషన్‌లో భాగంగా ఇది నేను నేర్చుకున్న పాఠం.

  • తెలుగు పాటలు వినడం నాకు హాబీ. అలాగే కంప్యూటర్‌ గేమ్స్‌ అంటే నాకు ఇష్టం. అయితే ఇప్పుడు ఆడటం తగ్గింది. ఈ రోజు ఎగ్జామ్‌ లేకున్నప్పటికీ దినపత్రికను చదవడం మాత్రం ఒక అలవాటుగా మారింది.

ఎన్ని రోజుల్లో నీ పుట్టిన రోజు..

నిజం. ఈ ప్రశ్న సివిల్స్‌ ఇంటర్వూలో ఎదురైంది. సాధారణంగా ఎవరైనా నీ పుట్టిన రోజు ఎప్పుడు అంటారు. ఇలాంటి ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పగలం. ఈ రోజు నుంచి నీ పుట్టిన రోజు రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? అంటే లెక్కలు వేసుకోవాలి కదా. అందుకు కొంత సమయం, ఇంకొంత గణిత పరిజ్ఞానం అవసరమవుతుంది. అదృష్టవశాత్తు పుట్టిన రోజు రావడానికి ఎన్ని గంటలు ఉంది అని అడగలేదు(నవ్వులు)... సమాధానం చెప్పడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టేది. రజాకార్లపై అడిగిన ప్రశ్నకు సరైన జవాబు చెప్పలేకపోయాను.

యూపీఎస్సీ చైర్మన్‌ మనోజ్‌ సోనీ బోర్డు నన్ను ఇంటర్వ్యూ చేసింది. అలాగే నా పేరు కూడా చాలా పెద్దగా ఉంది. దాంతో అంతా పలికి, స్నేహితులు నిన్ను ఏమని పిలుస్తారని అడిగారు. అశ్రిత్‌ అని చెప్పాను. అక్కడినుంచి వాళ్ళు కూడా అశ్రిత్‌ అంటూ ప్రశ్నించారు. న్యూఢిల్లీని ఇంతకుముందు సందర్శించావా అంటూ మొదలుపెట్టారు. అమృత్‌కాల్‌ను ప్రస్తావిస్తూ, నీతి ఆయోగ్‌ హెడ్‌వైతే ఏ అయిదు ఏరియాలపై దృష్టిపెడతానో చెప్పండన్నారు. పెన్ను - పేపర్‌ అడిగాను. కాదు, లిస్ట్‌ చదవమన్నారు. ఎడ్యుకేషన్‌, హెల్త్‌ కేర్‌ తదితరాలను చెప్పాను. ఒక్కటే అంటే ఎడ్యుకేషన్‌ అన్నాను. కొత్త విద్యావిధానం - క్రిటికల్‌ థింకింగ్‌ అవసరం తదితరాలు విడమర్చాను. రాబోయే రోజుల్లో ప్రపంచంలో పోటీపడాలంటే విద్యపరంగా ఎందుకు, ఎలా ముందుకు వెళ్ళాలో చెప్పాను. 1976లో 42వ రాజ్యాంగ సవరణతో సోషలిస్ట్‌, సెక్యులర్‌, ఇంటెగ్రిటీని కలిపారు కదా. ఆ మూడు పదాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా నేను చదివిన బిట్స్‌ పిలానీకి సంబంధించి ఒక విలక్షణతను చెప్పమన్నారు. నూతన విద్యా విధానంలో పొందుపరిచిన చాయిస్‌ బేస్డ్‌ సిస్టమ్‌ను తాను చదివిన బిట్స్‌ పిలానీ ఎన్నడో ప్రవేశపెట్టిందని, అసలు ఆ సంస్థే అది తీసుకురావడంలో ప్రథమురాలని వివరించాను. ఇంకా చాలా చెప్పబోతుంటే ఆపారు. మన దేశంలో పన్నుల విధానంపై కొంత సేపు చర్చ జరిగింది. వ్యక్తిగత పన్నుతో బేరీజు వేసి, కార్పొరేట్‌ పన్ను తగ్గింపుతో కలిగే ప్రయోజనాలను కూడా వివరించాను. మరో ప్రశ్నకు జవాబుగా జనాభా ప్రాతిపదికన 2026లో సీట్ల కేటాయింపు జరిగితే అభివృద్ధి చెందిన దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయాన్ని ముందు వివరించాను. డెమోగ్రఫీ(ప్రజా సమూహాల స్థితి గతులను అధ్యయనం చేసే శాస్త్రం. జనన మరణాలు, వ్యాధుల సంక్రమణ ప్రాతిపదికన ఇది జరుగుతుంది.)కి కూడా కనీసం పది శాతం విలువ ఇచ్చి సీట్ల కేటాయింపు జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా చూడొచ్చని కూలంకషంగా తెలిపాను. అలా చివరి వరకు సాఫీగా నా ఇంటర్వ్యూ కొనసాగింది.

AKDK.jpg

Updated Date - 2023-06-01T12:29:56+05:30 IST