Education Act: పేదల విద్యపై ఇదేం నిర్లక్ష్యం! మళ్లీ కోర్టుకెళ్లిన...!

ABN , First Publish Date - 2023-03-13T14:08:06+05:30 IST

రాష్ట్రం (Andhra Pradesh)లో విద్యాహక్కు చట్టం అమలుపై అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో పేరుకు విద్యాహక్కు (ఆర్టీఈ)ను అమలుచేసినట్లు చెబుతున్నా అతి కొద్ది మందికి మాత్రమే

Education Act: పేదల విద్యపై ఇదేం నిర్లక్ష్యం! మళ్లీ కోర్టుకెళ్లిన...!
మళ్లీ కోర్టుకెళ్లిన...!

ఇదేం విద్యా హక్కు?

ఫీజుల ఖరారుపై అధ్యయనం లేదు

అమ్మఒడితో ఫీజుల చెల్లింపు లింకు!..

ఫీజులపై యాజమాన్యాల అసంతృప్తి

లోపాలు సరిదిద్దకుండా కొత్త నోటిఫికేషన్‌..

మళ్లీ కోర్టుకెళ్లిన ప్రైవేటు స్కూళ్లు

ఇలాగైతే చట్టం అమలవుతుందా?..

ఆర్టీఈలో రిజిస్టర్‌కాని ప్రైవేటు బడులు

పేదల విద్యపై ప్రభుత్వ నిర్లక్ష్యం..

ఎక్కడా కనిపించని ముందస్తు కసరత్తు

(అమరావతి - ఆంధ్రజ్యోతి): రాష్ట్రం (Andhra Pradesh)లో విద్యాహక్కు చట్టం అమలుపై అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో పేరుకు విద్యాహక్కు (ఆర్టీఈ)ను అమలుచేసినట్లు చెబుతున్నా అతి కొద్ది మందికి మాత్రమే ఈ చట్టం కింద సీట్లు లభించాయి. విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఆలస్యంగా ఆర్టీఈ అడ్మిషన్లు ప్రారంభించడం, ఫీజులు ఖరారు చేయకపోవడం లాంటి కారణాలతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరానికి పాఠశాల విద్యాశాఖ ఇటీవల ఆర్టీఈ నోటిఫికేషన్‌ (RTE Notification) విడుదల చేసింది. ఆర్టీఈ అమలుపై ప్రభుత్వ లోపాలను పట్టుకుని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు వెంటనే న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీనిపై ప్రభుత్వం కౌంటర్‌ దాఖలుచేయాలి. అయితే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఆర్టీఈ ఇలా గందరగోళంగా మారుతోందన్న విమర్శలు వస్తున్నాయి. పూర్తిస్థాయి కసరత్తు చేసి నోటిఫికేషన్‌ జారీచేస్తే ఈ సమస్యలు ఉత్పన్నం కావనే వాదన వినిపిస్తోంది.

ఎలా నిర్ణయించారు?

వచ్చే విద్యా సంవత్సరానికి ఆర్టీఈ కింద ప్రవేశాలకు ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్‌ ఇచ్చింది. పట్టణాల్లో రూ.8 వేలు, గ్రామాల్లో రూ.6,500, గిరిజన, ఎస్సీ ప్రాంతాల్లో రూ.5,100గా ఫీజులు నిర్ణయించింది. అన్ని తరగతులకూ ఇవే ఫీజులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. అయితే ఈ ఫీజుల నిర్ణయంలో ఆర్టీఈ నిబంధనలు పాటించలేదని ప్రైవేటు స్కూళ్లు న్యాయస్థానానికి వెళ్లాయి. ఈ ఏడాది ఫీజుల ఖరారుకు కమిటీని నియమించారని, వచ్చే సంవత్సరానికి కమిటీ లేకుండా ఎలా నిర్ణయించారని యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. ఆర్టీఈ చట్టం ప్రకారం రాష్ట్రం మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఎంత వెచ్చిస్తున్నారనేది అధ్యయనం చేయాలని చెబుతున్నాయి. అందులో సగటును ప్రామాణికంగా తీసుకుని, ఆ సగటు లేదా ప్రస్తుతం ఆయా పాఠశాలల్లో ఉన్న ఫీజు.. రెండింటిలో ఏది తక్కువైతే దాన్ని ఫీజుగా నిర్ణయించాలని చట్టం చెబుతోందని వివరిస్తున్నాయి. ఇవేమీ లేకుండానే అతి తక్కువ ఫీజులు నిర్ణయించారని, ఏ ప్రాతిపదికన ఇలా ఖరారు చేశారని ప్రశ్నిస్తున్నాయి.

అమ్మఒడితో ముడి

ఆర్టీఈ కింద అడ్మిషన్లు పొందే విద్యార్థుల తల్లిదండ్రులు అమ్మఒడి (Amma odi) నగదును ఫీజుగా చెల్లించుకోవాలని ప్రభుత్వం తాజా నోటిఫికేషన్‌లో సూచించింది. కానీ ఆర్టీఈ చట్టం ప్రకారం ప్రభుత్వమే ఏడాదిలో రెండు విడతలుగా ఫీజులు చెల్లించాలి. దీనిపై కూడా యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. ఏటా సెప్టెంబరు, జనవరి నెలల్లో ప్రభుత్వం ఫీజు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఆర్టీఈ కింద సీట్లు కేటాయించి అమ్మఒడి నగదు వచ్చాక వాటిని రాబట్టుకోవాలంటే అది తమకు సాధ్యం కాదని, ప్రభుత్వమే ఫీజులు చెల్లించాలని అంటున్నాయి. అందుకే సుమారు 9,530 స్కూళ్లకు గాను ఇప్పటివరకూ కేవలం 809 పాఠశాలలే ఆర్టీఈ కింద సీట్లు ఇచ్చేందుకు పాఠశాల విద్య వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకున్నాయి. ఈ నెల 16 వరకు గడువు ఉన్నప్పటికీ చాలా మంది దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు.

కనిపించని చిత్తశుద్ధి

విద్యాహక్కు చట్టం అమలులో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్న దాఖలాలు కనిపించడం లేదు. అందుకే పాఠశాల విద్యాశాఖ చేస్తున్న పొరపాట్లు ప్రైవేటు పాఠశాలలకు అనుకూలంగా మారుతున్నాయి. గతేడాది కూడా ఫీజులపై ఇలాగే కోర్టులను ఆశ్రయుంచాయి. చాలా పాఠశాలల్లో ఆర్టీఈ అమలు చేయకపోయినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. కనీసం వచ్చే ఏడాదికైనా ఎలాంటి లోపాలు లేకుండా నోటిఫికేషన్‌ ఇచ్చి ఉంటే ప్రైవేటు పాఠశాలలకు కోర్టుకు వెళ్లే అవకాశం ఉండేది కాదు. మరోవైపు సీబీఎ్‌సఈ సిలబస్‌ అందిస్తున్న పాఠశాలలు కూడా కోర్టును ఆశ్రయించాయి. సీబీఎ్‌సఈ విద్యా సంవత్సరం ముందే ప్రారంభమవుతుందని, అప్పుడు ఆర్టీఈకి 25శాతం సీట్లు రిజర్వ్‌ చేసి పెడితే, తర్వాత అవి పూర్తికాకపోతే వాటిని ఏంచేయాలని ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు ఆర్టీఈ కింద ఇచ్చే సీట్లకు అమ్మఒడి నగదు చెల్లించుకోవాలని సూచించడంతో తల్లిదండ్రులు కూడా అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. అమ్మఒడి నగదు కట్టేలా అయితే ఆర్టీఈతో పనేంటని ప్రశ్నిస్తున్నారు. నేరుగా వెళ్లి బడిలో సీటు తీసుకుంటే కోరుకున్న చోట సీటు వస్తుందని, ఆర్టీఈలో అడిగిన చోట వస్తుందని గ్యారెంటీ లేదని అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2023-03-13T14:08:06+05:30 IST