TSPSC paper leak: ప్రవీణ్‌ ఓఎంఆర్‌ షీట్‌పై ఎలాంటి చర్చ జరుగుతోంది అంటే..!

ABN , First Publish Date - 2023-03-16T11:31:00+05:30 IST

ప్రశ్నపత్రం లీకేజీ కేసు (TSPSC paper leak) లో ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కు గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో 103 మార్కులు రావడంపై రాష్ట్రవ్యాప్తంగా

TSPSC paper leak: ప్రవీణ్‌ ఓఎంఆర్‌ షీట్‌పై ఎలాంటి చర్చ జరుగుతోంది అంటే..!
OMR sheet

మార్కుల వెనుక మతలబేంటి?

సెలవు పెట్టక.. కోచింగ్‌కు వెళ్లక 103 మార్కులెలా సాధ్యం?

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో ప్రవీణ్‌కు వచ్చిన మార్కులపై సందేహలు

లీకైన పేపర్‌ను మరెవరికైనా ఇచ్చాడా అనే కోణంలోనూ చర్చ

హైదరాబాద్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ప్రశ్నపత్రం లీకేజీ కేసు (TSPSC paper leak) లో ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కు గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో 103 మార్కులు రావడంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిజానికి పరీక్ష రాసే సమయంలో ప్రవీణ్‌ (Praveen) తన ఓఎంఆర్‌ షీట్‌ (OMR sheet)పై బుక్‌లెట్‌ నంబరును తప్పుగా బబ్లింగ్‌ చేయడంతో అతడి పేపర్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. అతణ్ని డిస్‌క్వాలిఫై చేశారు. అయితే, లీకేజీ వ్యవహారం బయటకు రావడంతో అతడికి ఎన్ని మార్కులు వచ్చాయనే ఆసక్తి నెలకొంది. ‘కీ’ పరిశీలించగా 103 మార్కులు వచ్చినట్టు తేలడంతో అంతా విస్తుపోతున్నారు. సాధారణంగా గ్రూప్‌-1 పోస్టులకు సిద్ధమయ్యే అభ్యర్థులు చాలా సీరియ్‌సగా చదువుతారు. నిరుద్యోగ అభ్యర్థులైతే.. ఆర్నెల్ల నుంచి దాదాపు ఏడాదిపాటు కోచింగ్‌ (Coaching) తీసుకుంటారు. ఇతర పనులను పక్కనపెట్టి ఇదే పనిలో ఉంటారు. అప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారైతే ఈ పరీక్షకు సన్నద్ధం కావడం కోసం కొంతకాలంపాటు సెలవు పెట్టి మరీ చదువుకుంటారు.

ఇంతగా కష్టపడ్డ చాలా మందికి ఈ పరీక్షల్లో 70-80 మార్కులే వచ్చాయి. మరింత సీరియ్‌సగా చదివినవారికి సైతం 100 మార్కులు దాటలేదని అభ్యర్థులు పేర్కొంటున్నారు. అలాంటిది.. ఒక్కరోజు కూడా ఉద్యోగానికి సెలవు పెట్టకుండా, ఎలాంటి కోచింగూ తీసుకోకుండా పరీక్ష రాసిన ప్రవీణ్‌కు ఇన్ని మార్కులు రావడానికి కారణం పేపర్‌ లీకేజీనే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా.. ఈ పేపర్‌ ఆధారంగా ప్రవీణ్‌ తానొక్కడే చదివి పరీక్ష రాశాడా? లేక లీకైన పేపర్‌ను మరింకెవరికైనా అందించాడా అనే కోణంలో కూడా అభ్యర్థుల్లో చర్చలు జరుగుతున్నాయి. దీనిపై పోలీసులు సమగ్ర దర్యాప్తు జరపాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

lea.jpg

Updated Date - 2023-03-16T11:32:56+05:30 IST