TSPSC paper leak: అదే జరిగితే వాళ్ల పరిస్థితి ఏంటి?

ABN , First Publish Date - 2023-03-15T11:39:53+05:30 IST

టీఎస్‌పీఎస్సీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ (TSPSC paper leak) వ్యవహారం తీవ్రరూపం దాలుస్తోంది. లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుతో కూడిన అంశం కావడంతో దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్‌ గ్రూప్‌-1 పరీక్ష రాయడం, అందులో

TSPSC paper leak: అదే జరిగితే వాళ్ల పరిస్థితి ఏంటి?
మహిళలతో చాటింగ్‌.. నగ్న ఫొటోలు గుర్తింపు

కుదిపేస్తున్న లీకేజీలు

అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన.. విచారణకు సిట్‌

ప్రిలిమ్స్‌ రాసిన ప్రవీణ్‌.. 103 మార్కులు

బుక్‌లెట్‌ కోడ్‌ రాంగ్‌ బబ్లింగ్‌తో డిస్‌ క్వాలిఫై

గ్రూప్‌-1 పేపర్‌ లీక్‌పైనా అనుమానాలు

ప్రవీణ్‌ ఫోన్‌లో లీకైన ఏఈ పరీక్ష పేపర్లు

టౌన్‌ ప్లానింగ్‌ ఓవర్‌సీర్‌ పేపర్లూ లభ్యం

మహిళలతో చాటింగ్‌.. నగ్న ఫొటోలు గుర్తింపు

దరఖాస్తుల వెరిఫికేషన్‌ పేరుతో పరిచయాలు

రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్న పోలీసులు

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి రాజు నేరాంగీకారం!

టీఎస్‌పీఎస్సీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ (TSPSC paper leak) వ్యవహారం తీవ్రరూపం దాలుస్తోంది. లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుతో కూడిన అంశం కావడంతో దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్‌ గ్రూప్‌-1 పరీక్ష రాయడం, అందులో అతనికి 103 మార్కులు రావడంతో ఈ పేపర్‌ కూడా లీకైందన్న అనుమానాలు వస్తున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. బీజేవైఎం, యువజన కాంగ్రెస్‌, టీజేఎస్‌, బీఎస్పీ కార్యకర్తలు మంగళవారం టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. లీకేజీ వెనుక ప్రభుత్వ పెద్ద హస్తం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆరోపించగా, టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో ఇప్పటిదాకా జరిగిన పరీక్షల పేపర్లన్నీ లీకయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay) ఆరోపించారు. కాగా, నమ్మినవారే మోసం చేశారంటూ టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి వాపోయారు. అయితే గ్రూప్‌-1 పరీక్షపై మాత్రం అపోహలు, ఆందోళన వద్దని అభ్యర్థులకు సూచించారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్పందించారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి 48 గంటల్లోగా సమగ్ర నివేదిక అందజేయాలని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శిని ఆదేశించారు. మరోవైపు ఈ కేసును విచారించేందుకు పోలీసుశాఖ సిట్‌ను ఏర్పాటు చేసింది.

హైదరాబాద్‌ సిటీ, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): టీఎస్‌పీఎస్సీ (TSPSC)పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారం మరిన్ని కొత్త మలుపులు తిరుగుతోంది. అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పరీక్ష ప్రశ్నపత్రాన్ని లీక్‌ చేసిన టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి పులిదిండి ప్రవీణ్‌కుమార్‌ (Praveen Kumar) గ్రూప్‌-1 పరీక్ష రాయడం, ఇందులో అతనికి 103 మార్కులు రావడంతో ఈ పరీక్ష పేపర్‌ కూడా లీకైందా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ప్రవీణ్‌ ఉన్నతాధికారుల అనుమతి తీసుకొని పరీక్ష రాశాడు. ఈ పరీక్షలో మొత్తం 150 మార్కులకుగాను ప్రవీణ్‌కు 103 మార్కులు వచ్చాయి. అతని బుక్‌లెట్‌ కోడ్‌ ఆధారంగా పోలీసులు కీ పేపర్‌ను పరిశీలించగా ఈ విషయం వెల్లడైనట్లు తేలింది. ఇన్ని మార్కులు వచ్చినా మెయిన్స్‌కు అతడు డిస్‌క్వాలిఫై అయ్యాడు. ప్రాథమిక సమాచారం (బుక్‌లెట్‌ కోడ్‌, హాల్‌టికెట్‌ నంబర్‌) నింపే క్రమంలో బబ్లింగ్‌ సరిగా చేయకపోవడంతో అతని ఓఎంఆర్‌ షీట్‌ డిస్‌క్వాలిఫై అయినట్లు తేలింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నలు, సమాధానాలు తదితర సమాచారం ప్రవీణ్‌ మొబైల్‌ ఫోన్‌లో దొరికినట్లు తెలిసింది. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పేపర్‌ లీకైందన్న అనుమానాలకు ఇదే కారణమవుతోంది.

మొబైల్‌ ఫోన్‌లో మహిళల నగ్నచిత్రాలు..

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు (TSPSC paper leak)లో అరెస్టయిన ప్రధాన నిందితుడు ప్రవీణ్‌ పోలీసుల విచారణలో నోరు విప్పలేదని తెలిసింది. అయితే రాజశేఖర్‌రెడ్డి అలియాస్‌ రాజు మాత్రం పోలీసులకు పూర్తిగా సహకరించినట్లు సమాచారం. ప్రవీణ్‌ సూచన మేరకు అతడు ఇచ్చిన యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఆధారంగా ప్రశ్నపత్రాలను డౌన్‌లోడ్‌ చేసి పెన్‌డ్రైవ్‌లో కాపీ చేసి ఇచ్చానని రాజు వెల్లడించినట్లు తెలిసింది. ప్రవీణ్‌ సహకరించకపోవడంతో అతని మొబైల్‌ ఫోన్‌, కాల్‌డేటా, వాట్సాప్‌ చాటింగ్‌లు ఇతర కాంటాక్టులపై దృష్టి సారించారు. ప్రవీణ్‌ మొబైల్‌లో మహిళల నగ్న చిత్రాలు ఉన్నట్లు గుర్తించారు. 2017 నుంచి టీఎస్‌పీఎస్సీ లో పనిచేస్తున్న ప్రవీణ్‌ మొదట వెరిఫికేషన్‌ సెక్షన్‌లో పనిచేసేవాడు. నాలుగేళ్లపాటు అక్కడే పనిచేయడంతో వెరిఫికేషన్‌, ఇతర సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం వచ్చే మహిళల ఫోన్‌ నంబర్‌లను ప్రవీణ్‌ తీసుకునేవాడు. వారితో కాంటాక్టులో ఉండేవాడు. వాట్సాప్‌ చాటింగ్‌లు చేస్తూ సాన్నిహిత్యం పెంచుకునేవాడు. ఈ మేరకు అతని మొబైల్‌లో చాటింగ్‌లతో పాటు కొందరు మహిళల నగ్న చిత్రాలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రేణుకతో అయిన పరిచయంతోనే ఏఈ పరీక్షా పత్రాన్ని లీక్‌ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు గుర్తించారు.

ddd.jpg

మొబైల్‌లో ప్రశ్నపత్రాల నకళ్లు..

9 మంది నిందితుల రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పలు కీలక అంశాలను పేర్కొన్నారు. ఈ నెల 5న జరిగిన ఏఈ పరీక్ష పశ్న పత్రాలు లీకైనట్లు ఆధారాలు లభించాయని, మొత్తం 24 పేజీల ప్రశ్నపత్రాల నకళ్లు లభ్యమయ్యాయని తెలిపారు. వీటితోపాటు ఈ నెల 12న నిర్వహించాలనుకున్న టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌పరీక్షకు సంబంధించి 25 పేజీల ప్రశ్నపత్రాలు కూడా లభించినట్లు వెల్లడించారు. ఏ2 రాజశేఖర్‌రెడ్డి వెల్లడించిన సమాచారం ప్రకారం.. కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌లో పనిచేస్తున్న సెక్షన్‌ ఆఫీసర్‌ శంకర్‌లక్ష్మి సిస్టమ్‌ రిపేర్‌కు వచ్చింది. దానిని మరమ్మతు చేసేందుకు రాజశేఖర్‌రెడ్డి వెళ్లాడు. అప్పటికే ఆమె నోట్‌బుక్‌ నుంచి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ తస్కరించిన ప్రవీణ్‌ అక్కడికి చేరుకున్నాడు. శంకర్‌లక్ష్మి పని నిమిత్తం టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి రూమ్‌కు వెళ్లింది.

ఇదే అదనుగా భావించిన ప్రవీణ్‌.. ఆమె సిస్టమ్‌ నుంచి రాజశేఖర్‌రెడ్డి సహకారంతో ఏఈ ప్రశ్నపత్రాలతోపాటు టౌన్‌ప్లానింగ్‌ ఓవర్సీర్‌ ప్రశ్నపత్రాలను పెన్‌డ్రైవ్‌లో కాపీ చేయించి తీసుకున్నాడు. వాటిని ప్రింట్‌ తీసుకున్న ప్రవీణ్‌.. ఈ నెల 2న రేణుకకు వాటిని అందజేశాడు. ఆమె 5 లక్షలిచ్చి ప్రశ్నపత్రాలను తీసుకొని వెళ్లింది. భర్త ఢాక్యాతో కలిసి.. మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీనివా్‌సను సంప్రదించి పేపర్‌ అమ్మాలని చూశారు. అతను తన స్నేహితులు నీలేశ్‌, గోపాల్‌లకు సమాచారం ఇచ్చి వాటిని కొనుగోలు చేయించాడు. 14లక్షలకు బేరం కుదుర్చుకున్న నిందితులు 4 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించారు. ప్రవీణ్‌ మొబైల్‌, ల్యాప్‌ట్యాప్‌ను పోలీసులు ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపారు. ఆ రిపోర్టు వస్తే అనేక అంశాలపై స్పష్టత వస్తుందని తెలిపారు.

raj.jpg

తండ్రి మృతి చెందడంతో.. ప్రవీణ్‌ కారుణ్య నియామకం

సరూర్‌నగర్‌, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): టీఎస్‌పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్‌కుమార్‌ది బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ 19వ డివిజన్‌లోని మల్లికార్జుననగర్‌ కాలనీ. అతని తండ్రి హరిశ్చంద్రరావు ప్రభుత్వ ముద్రణాలయంలో అడిషనల్‌ ఎస్పీగా పనిచేస్తూ విధినిర్వహణలో మరణించారు. దాంతో ఆయన ఇద్దరు కుమారుల్లో చిన్నవాడైన ప్రవీణ్‌కు ముద్రణాలయంలోనే కారుణ్య నియామకం కింద ప్రభుత్వం ఉద్యోగ అవకాశం కల్పించింది. కొంతకాలం అక్కడ పనిచేసిన తర్వాత 2017లో టీఎస్‌పీఎస్సీ కి బదిలీ అయ్యాడు. జూనియర్‌ అసిస్టెంట్‌గా నాలుగేళ్లపాటు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో పనిచేసిన ప్రవీణ్‌.. ఏడాది క్రితం సెక్షన్‌ ఆఫీసర్‌గా పదోన్నతి పొంది కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడిగా ఎదిగాడు.

2.jpg

Updated Date - 2023-03-15T11:39:53+05:30 IST