School toilets: 500 మందికి మూడే మరుగుదొడ్లు.. భాగ్యనగరంలో దారుణ పరిస్థితులు!
ABN , First Publish Date - 2023-03-10T12:17:08+05:30 IST
గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad)లోని ప్రభుత్వ కళాశాలల్లో కనీస సదుపాయాలు కరువయ్యాయి. ఏళ్ల క్రితం నిర్మించిన తరగతి గదుల్లో సరైన వెలుతురు, గాలి బెంచీలు లేక ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల తాగునీటి
కాచిగూడ కళాశాలలో ఇదీ దుస్థితి
పలు చోట్ల కాలేజీ, హైస్కూళ్లకు కలిపి ఒక్కటే..
‘సరూర్‌నగర్’ కాలేజీ సమస్యపై హైకోర్టు సీరియస్
స్పందించని యంత్రాంగం..
కాచిగూడ జూనియర్ కళాశాలలో (Kachiguda Junior College) ఇంటర్, హైస్కూల్‌కు చెందిన విద్యార్థినులు సుమారు 500 మంది ఉన్నారు. వీరందరికీ కలిపి మూడు మరుగుదొడ్లు, నాలుగు టాయిలెట్లు (Toilets) మాత్రమే ఉన్నాయి. ఇంటర్వెల్ సమయంలో అక్కడ బాలికలు క్యూ కట్టాల్సి వస్తోంది.
ఇక్కడే కాదు.. నగరంలోని చాలా కళాశాలల్లో ఇవే పరిస్థితులు ఉన్నాయి. తమ కాలేజీలో 700 మంది విద్యార్థులకు ఒకే టాయిలెట్ ఉందంటూ కొన్ని రోజుల క్రితం సరూర్‌నగర్ కళాశాల విద్యార్థులు రోడ్డెక్కాల్సి వచ్చింది. ఈ సమస్యను ఓ వ్యక్తి లేఖ ద్వారా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సుమోటోగా స్వీకరించిన కోర్టు సమస్యను సీరియ్‌సగా పరిగణించాలని సర్కారుకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నగర పరిధిలోని ప్రభుత్వ కాలేజీల్లో టాయిలెట్ల సదుపాయంపై ‘ఆంధ్రజ్యోతి’ క్షేత్రస్థాయిలో పరిశీలించగా సమస్యలు వెలుగులోకి వచ్చాయి.
హైదరాబాద్ సిటీ/న్యూస్ నెట్‌వర్క్, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad)లోని ప్రభుత్వ కళాశాలల్లో కనీస సదుపాయాలు కరువయ్యాయి. ఏళ్ల క్రితం నిర్మించిన తరగతి గదుల్లో సరైన వెలుతురు, గాలి బెంచీలు లేక ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల తాగునీటి సమస్య వేధిస్తుండగా, మరికొన్ని చోట్ల మరుగుదొడ్ల కొరతతో విద్యార్థులు సతమతమవుతున్నారు. ఉదయం కాలేజీకి వస్తే.. తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్లిన తర్వాతనే మల, మూత్ర విసర్జన చేయాల్సిన దుస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో టాయిలెట్ల నిర్వహణ బాగానే ఉన్నప్పటికీ మరికొన్ని చోట్ల నిర్వహణ సరిగ్గా లేక మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. దీంతో మల, మూత్ర విసర్జనకు అబ్బాయిలు దూర ప్రాంతాలకు వెళ్తుండగా, అమ్మాయిలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ కాలేజీలో 700 మంది విద్యార్థులకు ఒకే టాయిలెట్ ఉందంటూ కొన్ని రోజుల క్రితం సరూర్‌నగర్ కళాశాల విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. దీనిపై ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’ నగర పరిధిలోని ప్రభుత్వ కాలేజీల్లో టాయిలెట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రభుత్వ కళాశాలల్లో అధ్వానంగా..
గ్రేటర్‌లోని హైదరాబాద్ జిల్లాలో 32 ప్రభుత్వ, 285 ప్రైవేట్ కాలేజీలు నడుస్తుండగా, మొత్తం 1,71,146 మంది చదువుతున్నారు. ఇందులో ఫస్టియర్, సెకండియర్‌లో కలిపి 71,865 మంది ప్రభుత్వ విద్యార్థులున్నారు. రంగారెడ్డి జిల్లాలో 18 ప్రభుత్వ, 180 ప్రైవేట్ కాలేజీలు ఉండగా, 1,27,656 మంది చదువుతున్నారు. ఇందులో ప్రభుత్వ విద్యార్థులు 68,957 మంది ఉన్నారు. మేడ్చల్‌లో 6 ప్రభుత్వ, 126 ప్రైవేట్ కాలేజీల్లో 1,18,935 మంది చదువుతున్నారు. ఇందులో ప్రభుత్వ కాలేజీల్లో 22,450 మంది విద్యాభ్యాసం చేస్తున్నట్లు గణంకాలు చెబుతున్నాయి. ప్రైవేట్ డే స్కాలర్, రెసిడెన్షియల్ కాలేజీల్లో విద్యార్థులకు మెరుగైన సదుపాయాలుండగా, ప్రభుత్వ కళాశాలల్లో పరిస్థితి అధ్వానంగా ఉంది. దీంతో రోజు వారీగా కళాశాలలకు వెళ్తున్న విద్యార్థులు ఇంటర్వెల్, మధ్యాహ్న భోజన విరామ సమయంలో మూత్ర విసర్జన చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రుతు సమయంలో ఇంటి వద్దనే..
పాఠశాలలు, కళాశాలలను గతానికి భిన్నంగా తీర్చిదిద్దుతున్నామని గొప్పలు చెబుతున్న పాలకులు ఆచరణలో విఫలమవుతున్నారు. విద్యా రంగానికి ఏటా బడ్జెట్‌లో కనీస నిధులు కేటాయించకపోవడంతో విద్యార్థులు నిత్యం అవస్థలు పడుతున్నారు. దీంతో పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల నుంచి కాలేజీ స్టూడెంట్స్ వరకు వివిధ సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రధానంగా కాలేజీల్లో టాయిలెట్లు లేకపోవడం, ఉన్న వాటి నిర్వహణను పట్టించుకోకపోవడం, ఒకే ప్రదేశంలో కాలేజీ, హైస్కూల్ తరగతులను నిర్వహిస్తుండడంతో పడరాని పాట్లు పడుతున్నారు. రుతు సమయంలో విద్యార్థినులు, ఉపాధ్యాయులు, లెక్చరర్లు పాఠశాలలకు వెళ్లకుండా ఇంటివద్దనే ఉంటున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీల్లో బాలబాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు ఉండగా, ప్రభుత్వ కళాశాలలో దాదాపు 200 మందికి ఒక మరుగుదొడ్డి ఉండగా, ప్రైవేట్‌లో దాదాపు 50మందికి ఒకటి చొప్పున ఉంది. పలు ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్వెల్ సమయంలో టాయిలెట్ల వద్ద విద్యార్థులు బారులు తీరుతున్నారంటే టాయిలెట్లు ఎన్ని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
పలు ప్రాంతాల్లో పరిస్థితి ఇలా..
కూకట్‌పల్లి కళాశాలలో బాల, బాలికలకు వేర్వేరు టాయిలెట్లు ఉన్నప్పటికీ నీటి సదుపాయం సక్రమంగా లేకపోవడంతో అపరిశుభ్రంగా మారాయి.
సీతాఫల్‌మండి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో కొనసాగుతున్న హైస్కూల్, జూనియర్, డిగ్రీ కాలేజీలకు నాలుగు కామన్ టాయిలెట్లు ఉన్నాయి. నీటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
సికింద్రాబాద్ వైఎంసీఏ బాలుర జూనియర్ కాలేజీలో 760 మందికి నాలుగు మరుగుదొడ్లు ఉన్నాయి. నిర్వహణను ఎవరూ పట్టించుకోకపోవడంతో అపరిశుభ్రంగా మారాయి. డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు తెలిపారు.
కోర్టులో సరూర్‌నగర్ కాలేజీ సమస్య
కళాశాలలో కనీస సదుపాయాలు లేవని కొద్ది రోజుల క్రితం సరూర్‌నగర్ ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. 700 మంది బాలబాలికలకు ఒకే టాయిలెట్ ఉందని, రుతు సమయంలో ట్యాబ్‌లెట్లు వేసుకుంటున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, దీనిపై న్యాయవిద్యార్థి మణిదీప్ హైకోర్టులో పిటిషన్ వేయగా, సుమోటోగా స్వీకరించిన న్యాయస్థానం విద్యాశాఖ ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. దీంతో అక్కడ తాత్కాలిక టాయిలెట్లను ఏర్పాటు చేయడంతో విద్యార్థులకు కాస్త ఉపశమనం లభించింది.
టాయిలెట్ల సమస్యను పరిష్కరించాలి
గ్రేటర్‌లోని పలు ప్రభుత్వ కాలేజీలలో తాగునీరు, టాయిలెట్లు లేకపోవడంతో నిరుపేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కళ్లెదుటే సమస్యలు కనిపిస్తున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరం. విద్యాశాఖ మంత్రి తక్షణమే స్పందించి కళాశాలల్లో కనీస సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి.
- శ్రీహరి, ఏబీవీపీ సెంట్రల్ కమిటీ మెంబర్