Share News

Education: ‘దీవెన’ కాదు.. దగా! విద్యార్థులను ముంచిన సర్కార్‌

ABN , First Publish Date - 2023-11-17T10:55:12+05:30 IST

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంపై ప్రయోగం చేసి పేద విద్యార్థుల జీవితాలతో జగన్‌ ప్రభుత్వం (Ycp Government) ఆడుకుంటోంది. కళాశాలలకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న రీయింబర్స్‌మెంట్‌ వ్యవహారాన్ని

Education: ‘దీవెన’ కాదు.. దగా! విద్యార్థులను ముంచిన సర్కార్‌

  • వసతి దీవెన ఏటా ఒక విడత ఎగవేత

  • రీయింబర్స్‌మెంట్‌ పెండింగ్‌ 1,600 కోట్లు

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంపై ప్రయోగం చేసి పేద విద్యార్థుల జీవితాలతో జగన్‌ ప్రభుత్వం (Ycp Government) ఆడుకుంటోంది. కళాశాలలకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న రీయింబర్స్‌మెంట్‌ వ్యవహారాన్ని విద్యార్థుల తల్లులు, ప్రభుత్వం మధ్య వ్యవహారంగా మార్చడంతో సమస్యలు తలెత్తాయి. ప్రభుత్వం సకాలంలో నిధులు జమచేయకపోవడంతో విద్యార్థులు ఫీజు చెల్లించలేకపోతున్నారు. ఫీజు చెల్లిస్తే గానీ యాజమాన్యాలు పరీక్షలకు అనుమతించడం లేదు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు సైతం ట్యూషన్‌ ఫీజు చెల్లిస్తేనే అనుమతిస్తామని నిబంధన పెట్టారు. దీంతో తల్లిదండ్రులపై ఫీజుల భారంపడుతోంది. ఏటా మూడు విడతల రీయింబర్స్‌మెంట్‌ బకాయిలుండటంతో ముఖ్యంగా ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతేడాది ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులకు కోర్సు పూర్తయి ఈ ఏడాది మేలో బయటకు వెళ్లే సమయానికి రెండు విడతల బకాయిలున్నాయి. వాటిలో ఒక విడతను విడుదల చేసిన ప్రభుత్వం.. మరో విడతను ఈ నెల 28న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థుల పరిస్థితీ ఇలాగే ఉంది. ఈ అకడమిక్‌ ఇయర్‌లో ఇప్పటికే ఫస్ట్‌ సెమిస్టర్‌ నాటికి రెండు విడతల రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు జమచేయాల్సి ఉండగా ఒక్కటి కూడా ఇవ్వలేదు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి కోర్సు కూడా పూర్తవుతుంది. అప్పటికి మొత్తం రీయింబర్స్‌మెంట్‌ చెల్లించాల్సి ఉండగా ఆ పరిస్థితులులేవు. 28న విడుదల చేసే నిధులు గతేడాదివి కావడంతో ఈ ఏడాదికి రీయింబర్స్‌మెంట్‌ ఎప్పుడని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. 2024 ఫిబ్రవరిలో ఓ విడత మాత్రమే విడుదలచేసే అవకాశముంది.

అంటే మొత్తంగా ఈ ఏడాదికి సంబంధించి ఒక విడత మాత్రమే రీయింబర్స్‌మెంట్‌ జమ కానుంది. ఇంకా 3 విడతలు చెల్లించాలి. గతంలో ప్రభుత్వం ఒక విడత బకాయిపెట్టింది. అంటే ఒక ఏడాది రీయింబర్స్‌మెంట్‌ను విద్యార్థులు భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రీయింబర్స్‌మెంట్‌ విషయంలో విద్యార్థులను ప్రభుత్వం నట్టేట ముంచిందని విమర్శిస్తున్నారు. జగన్‌ ప్రభుత్వం కళాశాలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నేరుగా చెల్లించకుండా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు తల్లుల ఖాతాల్లో జమ చేస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఈ నెల విడుదల చేసే నిధులకు తల్లితో పాటు విద్యార్థి/విద్యార్థిని కూడా జాయింట్‌ అకౌంట్‌ తెరవాలని నిబంధన పెట్టారు. కాగా, ఇంజనీరింగ్‌ విద్యార్థులు సెమిస్టర్‌ పరీక్షలు రాయాలంటే ఒక్క పైసా బకాయి లేకుండా చెల్లించాలని ఇంజనీరింగ్‌ కళాశాలలు తేల్చిచెప్పాయి. ఫైనల్‌ ఇయర్‌ ఫస్ట్‌ సెమిస్టర్‌ పరీక్షలకు ఫీజు చెల్లించడానికి ఈ నెల 10గడువు తేదీగా ఖరారు చేశాయి. దీంతో థర్డ్‌ ఇయర్‌లో ఒక విడత బకాయితో పాటు ఫస్ట్‌ ఇయర్‌లో నిలిపేసిన రీయింబర్స్‌మెంట్‌ కలిపి మొత్తం రెండు విడతలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేకపోతే విద్యార్థులను పరీక్షలకు అనుమతించబోమని తేల్చిచెప్తున్నారు. దీంతో ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల ఫీజుల కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.

వసతి దీవెన ఒక విడతే

ఇంజనీరింగ్‌ విద్యార్థుల హాస్టల్‌ ఖర్చులకు ఏటా రూ.20వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15వేలు, ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు జమచేస్తామంటూ వసతి దీవెన అమల్లోకి తెచ్చారు. రెండు విడతలుగా తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రకటించారు. విద్యార్థులకు కేంద్రం విడుదల చేసిన పోస్టుమెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ నిధులనూ సర్కారు వాడేస్తోం ది. ఏ సంవత్సరం కూడా ఇచ్చిన హామీ మేరకు వసతి దీవెన అమలు చేయడం లేదు. ఏటా ఒక విడత మాత్రమే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వసతి దీవెన జమవుతోంది. ఇంజనీరింగ్‌ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.7,500, ఐటీఐ విద్యార్థులకు రూ.5వేలు జమ చేస్తున్నారు.

నిజాలు దాచి గొప్పలు

‘చంద్రబాబు ప్రభుత్వం రూ.1,778 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను పెండింగ్‌లో పెట్టింది. ఆ బకాయిలను కూడా చెల్లించడంతో పాటు అదనంగా రూ.15 వేల కోట్ల వ్యయంతో విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన వంటి పథకాలకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందిస్తున్నాం’.

- ‘ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే’బ్రోచర్‌లో ప్రభుత్వం చెప్పిన మాట ఇది.

ఇదీ వాస్తవం

విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సకాలంలో రీయింబర్స్‌మెంట్‌ జమ చేయడం లేదు. 1,650 కోట్లు బకాయిలు ఉన్నాయి. గతేడాది కోర్సు పూర్తయిన విద్యార్థులకు ఇప్పటికీ ఓ విడత చెల్లించలేదు. ఈ ఏడాది ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థుల పరిస్థితీ అంతే! ఫీజులు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతిస్తామని కాలేజీలు ఒత్తిడి చేయడంతో తల్లిదండ్రులు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వసతి దీవెన ఏటా ఒక విడత ఎగ్గొడుతున్నారు. ఇక పీజీ విద్యార్థులకైతే పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎగ్గొట్టారు.

Updated Date - 2023-11-17T10:55:36+05:30 IST