TSPSC: పేపర్ ఎలా లీక్ అయిందంటే..!

ABN , First Publish Date - 2023-03-16T12:06:17+05:30 IST

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకైన (TSPSC paper leak) విషయాన్ని తామే పసిగట్టామని కమిషన్‌ అధికారులు చెబుతున్నది నిజం కాదా? ఈ కేసులో నిందితుడైన ఓ వ్యక్తి

TSPSC: పేపర్ ఎలా లీక్ అయిందంటే..!
TSPSC paper leak

సమాచారం ఇచ్చింది నిందితుడే!

ప్రశ్నపత్రం లీకేజీపై పోలీసులకు నీలేశ్‌ ఫోన్‌

డబ్బు విషయంలో రేణుకతో గొడవ వల్లే

డయల్‌ 100కు ఫోన్‌ చేసి చెప్పిన నీలేశ్‌

60 మంది మహిళలతో ప్రవీణ్‌కు కాంటాక్టులు

అందరినీ సిట్‌ విచారణకు పిలిచే అవకాశం!

మహబూబ్‌నగర్‌/హైదరాబాద్‌ సిటీ, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకైన (TSPSC paper leak) విషయాన్ని తామే పసిగట్టామని కమిషన్‌ అధికారులు చెబుతున్నది నిజం కాదా? ఈ కేసులో నిందితుడైన ఓ వ్యక్తి పోలీసులకు ఇచ్చిన సమాచారం వల్లే ఈ విషయం వెలుగులోకి వచ్చిందా? అంటే అవుననే తెలుస్తోంది. ఈ నెల 5న నిర్వహించిన అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పరీక్ష ప్రశ్నపత్రం లీకైన ఘటనలో డబ్బు చెల్లింపునకు సంబంధించి నిందితుల మధ్య గొడవ జరిగినట్లు, దాంతో ఈ విషయం పోలీసులకు చేరినట్లు సమాచారం. మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండలానికి చెందిన ఉపాధ్యాయురాలు రేణుక.. తన తమ్ముడు రాజేశ్‌నాయక్‌ కోసం టీఎస్‌పీఎస్సీ(TSPSC)లో పనిచేసే ప్రవీణ్‌ (Praveen) ద్వారా ప్రశ్నపత్రాన్ని సంపాదించినట్లు వెల్లడైన విషయం తెలిసిందే. కాగా, ఈ ప్రశ్నపత్రాన్ని తమ తండాకే చెందిన నీలేశ్‌, శ్రీను, రాజేందర్‌నాయక్‌లకు ఇచ్చినందుకు రూ.10 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు పరీక్షకు ముందురోజు వీరందరినీ వనపర్తిలోని తన ఇంటికి పిలిపించుకొని అక్కడే వారితో ప్రశ్నలకు జవాబులను ప్రాక్టీస్‌ చేయించింది. పరీక్ష రోజు తన కారులోనే వారిని హైదరాబాద్‌కు తీసుకెళ్లి పరీక్ష రాయించుకొని వచ్చింది.

కాగా, ఒప్పందం ప్రకారం పరీక్షకు ముందు ఒక్కొక్కరు రేణుకకు రూ.2లక్షల చొప్పున చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని పరీక్ష పూర్తయ్యాక ఇస్తామని చెప్పారు. దీంతో పరీక్ష ముగిసిన రోజు రాత్రి వనపర్తిలో రేణుక ఇంట్లో జరిగిన డిన్నర్‌ తర్వాత మిగిలిన మొత్తం ఇవ్వాలని అడిగింది. అయితే తమ వద్ద డబ్బులేదని, ఇవ్వలేమని వారు చేతులెత్తేశారు. దీంతో రేణుకకు, వారికి తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. ఆ సమయంలో ఆవేశానికి లోనైన నీలేశ్‌నాయక్‌.. డయల్‌ 100కు ఫోన్‌ చేసి విషయం చెప్పేశాడు. పోలీసులు వెంటనే స్పందించి రేణుకతోపాటు ఆమె సోదరుడిని, నీలేశ్‌ని, మిగిలిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

ప్రవీణ్‌తో రేణుక పరిచయం అలా..

రేణుక ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా చేరిన తర్వాత ఆమె నియామక పత్రంలో పేరులో ఒక అక్షరం పొరపాటుగా పడిందని, దానిని సరిచేసుకోవడానికి ఆమె టీఎ్‌సపీఎస్సీని సంప్రదించి, పలుమార్లు హైదరాబాద్‌లోకి కార్యాలయానికి వెళ్లారని ఆ క్రమంలోనే ఆమెకు ప్రవీణ్‌తో పరిచయం ఏర్పడిందని చెబుతున్నారు. వారి పరిచయం కాస్తా స్నేహంగా మారి, ఆపై సాన్నిహిత్యం పెరిగి ఇంతటి అక్రమానికి దారితీసిందని స్థానికంగా చర్చ జరుగుతోంది. అంతేకాదు.. ప్రవీణ్‌కు ఎక్కువ మంది మహిళలతోనే మొబైల్‌ కాంటాక్టులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్‌ మొబైల్‌ ఫోన్‌ను పరిశీలించిన పోలీసులు.. అతడు మహిళలతో సన్నిహితంగా మాట్లాడిన చాటింగ్‌లు, నగ్న చిత్రాలు ఉన్నట్లు గుర్తించారు.

ప్రవీణ్‌తో రెగ్యులర్‌గా కాంటాక్టులు, చాటింగ్‌లు చేస్తున్న వారిలో ఎక్కువగా మహిళలే ఉన్నట్లు సమాచారం. సుమారు 60 మంది మహిళలతో ప్రవీణ్‌కు కాంటాక్టులు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసును విచారిస్తుస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఆ 60 మందినీ విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా 2017 నుంచి ప్రవీణ్‌ మొబైల్‌ ఫోన్‌ డేటాను పోలీసులు రికవరీ చేయనున్నట్లు తెలిసింది. 2017 నుంచి టీఎ్‌సపీఎస్సీ ఆధ్వర్యంలో ఎన్ని పబ్లిక్‌ పరీక్షలు జరిగాయి? ఆ సమయంలో ప్రవీణ్‌ ఏవైనా అక్రమాలకు పాల్పడ్డాడా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు.

రాజేశేఖర్‌రెడ్డి బీజేపీ మనిషిగా ప్రచారం

టీఎ్‌సపీఎస్సీ పేపర్‌ లీకేజీలో కేసులో అరెస్టయిన ఏ2 నిందితుడు, నెట్‌వర్క్‌ అడ్మిన్‌గా పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి ఆట్ల రాజశేఖర్‌రెడ్డి అలియాజ్‌ రాజు బీజేపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వ్యక్తిగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ప్రిపేరవుతున్న యువతను తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, రాజును అడ్డం పెట్టుకొని పేపర్‌ లీకేజీకి పక్కాగా ప్లాన్‌ చేసిందని సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి అనుకూలంగా రాజవేఖర్‌రెడ్డి పెట్టిన పోస్టులను, బీజేపీ నాయకులతో రాజు దిగిన ఫొటోలను ట్విటర్‌లో పోస్టు చేస్తూ వైరల్‌ చేస్తున్నారు.

Updated Date - 2023-03-16T12:06:17+05:30 IST