Telangana Hostels: ఇదేం భోజనం..! అడిగితే వీపు మోతే!
ABN , First Publish Date - 2023-02-20T13:42:42+05:30 IST
ఇది కేవలం ఒక్క మధిర గురుకుల పాఠశాలకే పరిమితమైనది కాదు. ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తం (Telangana)గా నిత్యకృత్యమైపోయాయి. కొన్ని విషయాలు బయటకు పొక్కుతుండగా.. మరికొన్నింటిని బయటకు రాకుండా
నాసిరకం చికెన్, మటన్, గుడ్లు..
హాస్టళ్లు, గురుకులాల్లో ఇదే ఆహారం
తరచుగా విద్యార్థులకు అస్వస్థత.. కడుపునొప్పి, ఆయాసం
చదువుపై దృష్టి పెట్టలేని స్థితి.. గోడలపై బోర్డులకే మెనూ పరిమితం
సిబ్బంది బెదిరింపు.. మధిరలో విద్యార్థినులను కొట్టిన ప్రిన్సిపాల్
ఘటనలపై పట్టించుకోని ప్రభుత్వం.. ఇష్టారాజ్యంగా సిబ్బంది తీరు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్):
ఖమ్మం జిల్లా (Khammam District) మధిరలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల బాలికల వసతిగృహం (Madira BC Gurukula Girls Hostel)లో భోజనం రుచిగా ఉండటంలేదని, నెల రోజులుగా కూరలు మంచిగా వండటంలేదని బాలికలు ఫిర్యాదు చేసిన పాపానికి.. 20 మంది విద్యార్థినులను ప్రిన్సిపాల్ (Principal) ఒంటిపై వాతలు పడేలా కొట్టారు. హాస్టల్ (Hostel) విషయాలకు బయటకు చెబితే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ కూడా ఇచ్చారు.
...ఇది కేవలం ఒక్క మధిర గురుకుల పాఠశాలకే పరిమితమైనది కాదు. ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తం (Telangana)గా నిత్యకృత్యమైపోయాయి. కొన్ని విషయాలు బయటకు పొక్కుతుండగా.. మరికొన్నింటిని బయటకు రాకుండా ఆయా సంక్షేమ హాస్టళ్ల అధికారులు, సిబ్బంది జాగ్రత్త పడుతున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఇలాంటి దుర్ఘటనలకు అవకాశం ఉండదని తెలిసినా.. అధికారులు ఆ విషయం తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. హాస్టళ్లలో సన్నబియ్యంతో భోజనం పెడుతున్నామని రాష్ట్రప్రభుత్వం గొప్పగా చెబుతుండగా.. క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటున్నాయి. విద్యార్థులకు నీళ్ల చారు, ఉడికీ ఉడకని అన్నం, కుళ్లిన కూరగాయలతో వండిన, పాచిపోయిన కూరలు పెడుతున్నారు. వీటిని తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. ఆయాసం, నిద్రలేమి, కడుపునొప్పి సమస్యలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. తరగతి గదుల్లోనూ చదువుపై సరిగా దృష్టి పెట్టలేకపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,750 సంక్షేమ వసతి గృహాలుండగా.. వీటిలో 650 పోస్టు మెట్రిక్, 1100 ప్రీ మెట్రిక్ హాస్టళ్లు ఉన్నాయి. సుమారు 2.50లక్షల మంది విద్యార్థులు ఈ హాస్టళ్లలో ఉంటూ స్థానికంగా ఉన్న పాఠశాలల్లో చదువుకుంటున్నారు.
కొన్నిచోట్ల హాస్టళ్లకు ప్రభుత్వ భవనాలున్నా, ఎక్కువ చోట్ల అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వీటిలోని చాలీచాలని మౌలిక వసతులతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరికి ప్రభుత్వం చెల్లించే మెస్ చార్జీలు (Mess charges) కూడా అంతంతమాత్రమే. 3-7వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.950 చెల్లిస్తున్న ప్రభుత్వం.. 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు రూ.1,100, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు రూ.1,500 చొప్పున చెల్లిస్తోంది. అయితే మెస్ బిల్లులు పెండింగ్‌లో ఉండటం, కొందరు వార్డెన్లు చేతివాటం ప్రదర్శిస్తుండటం, కొందరు ప్రిన్సిపాళ్లతో సహా వార్డెన్లు, సిబ్బంది కుమ్మక్కై విద్యార్థులకు నాణ్యతలేని భోజనం, కూరలు పెడుతున్నారన్న ఆరోపణలున్నాయి.
మెనూ నిబంధనలకు నీళ్లు..
వాస్తవానికి హాస్టల్ విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలి. నెలలో నాలుగుసార్లు చికెన్ (Chicken), రెండుసార్లు మటన్‌తో భోజనం పెట్టాలి. రోజూ ఒక కోడిగుడ్డు ఇవ్వాలి. కానీ, ఈ మెనూ.. గోడలపై బోర్డులకే పరిమితమవుతోంవది. మాంసాహారం పెట్టినపుడు కోడిగుడ్లు ఇవ్వటంలేదు. నాణ్యతలేని కూరలు, నీళ్ల చారు, పురుగులతో కూడిన దొడ్డు బియ్యం, నూకలతో కూడిన నాణ్యతలేని అన్నమే ఎక్కువగా పెడుతున్నారు. నాసిరకం కోడిగుడ్లు, చికెన్ కొనితెచ్చి పెడుతున్నారు. కొన్ని హాస్టళ్లలో రాత్రి వండిన అన్నం, కూరలను మరుసటి రోజు వడ్డించడం, మధ్యాహ్నం వండిన వాటిని రాత్రి కూరల్లో కలుపుతున్నారు. వీటిని తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవుతున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. విద్యార్థులను ఆస్పత్రికి పంపడం, తోచిన వైద్యం చేయించడం మినహా.. బాధ్యులపై చర్యలు తీసుకోవడంలేదు. అక్కడక్కడ ఒకరిద్దరు వార్డెన్లను, ప్రిన్సిపాళ్లను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించినా.. అది తాత్కాలికమే అవుతోంది.
నిబంధనల ప్రకారం.. ప్రతి గురుకులంలో మెస్ కమిటీలు ఏర్పాటు చేయాలి. టీచర్లు (Teachers), విద్యార్థులతో కలిసి ఉండే ఈ కమిటీలు.. ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించాలి. వారితోపాటు ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు రుచి చూసిన తర్వాత.. విద్యార్థులకు వడ్డించాలనే నిబంధన కూడా ఉంది. ఇది కూడా అమలు కావడంలేదు. ఎక్కడ కూడా మెస్ కమిటీల ఉనికే లేదు. వార్డెన్లు, ప్రిన్సిపాళ్ల పెత్తనమే అంతటా నడుస్తోంది. స్టోర్ రూమ్‌లు, వంటపాత్రలు, సామగ్రి కూడా అపరిశుభ్రంగా ఉన్నవే వినియోగిస్తున్నారు. ఉన్నతాధికారులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా హాస్టళ్ల వైపు తొంగిచూడటంలేదు. ఎమ్మెల్యేలు (MLAs) కూడా పెద్దగా పట్టించుకోవడంలేదు. దీంతో ఆ హాస్టళ్ల ప్రిన్సిపాళ్లు, టీచర్లు వార్డెన్లు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
ఆందోళన కలిగిస్తున్న వరుస సంఘటనలు
సంక్షేమ హాస్టళ్లలో తరచుగా జరుగుతున్న సంఘటనలు విద్యార్థులను, తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కొద్దికాలంగా చోటుచేసుకున్న కొన్ని సంఘటనల్ని పరిశీలిస్తే..
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలోని మారేడుపల్లి కస్తూర్బాగాంధీ బాలికల గురుకులంలో గత ఏడాది నవంబరులో కలుషిత ఆహారం తిని 11 మంది విద్యార్థినులు వాంతులు, కడుపునొప్పితో ఆస్పత్రి పాలయ్యారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో కొద్దినెలల క్రితం ఒకరోజు వండిన చికెన్‌ను మరోరోజు వండిన వంకాయ కూరతో కలిపి విద్యార్థినులకు వడ్డించారు. దాంతో 128 మంది అస్వస్థతకు గురయ్యారు. రెండు, మూడు రోజుల తర్వాత విద్యార్థినులు కోలుకున్నారు.
నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో గత ఏడాది జూలైలో కోడిగుడ్డు కూర వికటించడంతో 500 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 20 మంది విద్యార్థుల పరిస్థితి విషమించడంతో నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని పడమట నర్సాపురం గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో గత ఏడాది డిసెంబరులో కలుషిత ఆహారం తిని 200 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 14న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో నాణ్యతలేని ఆహారం పెట్టడంతో 18 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లోని కస్తూర్బా బాలికల పాఠశాలలో నాలుగు నెలల క్రితం కలుషితమైన ఆహారం తిని 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ కేజీబీవీ పిన్సిపాల్ను సస్పెండ్ చేశారు.
మహబూబాబాద్‌లోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల లో కొద్దినెలలక్రితం 9మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. పాలకూరలో వానపాములు ఉన్నప్పటికీ.. అలాగే కూర వండటంతో అది తిన్న విద్యార్థినులు అనారోగ్యానికి గురయ్యారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం మొగడ్ దగడ్ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు పురుగుల అన్నం పెట్టడంతో అస్వస్థతకు గురయ్యారు.
యాదాద్రి జిల్లా వలిగొండ మండలం లోతుకుంటలోని ఆదర్శ పాఠశాల వసతిగృహంలో గత ఏడాది డిసెంబరు 21న కలుషిత ఆహారం తిని 13 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం చేసిన అనంతరం వారు వాంతు లు చేసుకోవడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
హనుమకొండ జిల్లా కమలాపూర్, మహబూబ్‌నగర్ జిల్లా బోయపల్లి జడ్పీ హైస్కూల్లో 12 మంది, కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో 10 మంది, నిర్మల్ జిల్లా భైంసాలోని కేజీబీవీలో 9 మంది విద్యార్థులు, జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని బాలికల గురుకులంలో 100 మంది కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన సంఘటనలు చోటుచేసుకున్నాయి.
నల్లగొండ జిల్లా దామరచర్ల గిరిజన పాఠశాలలో 26 మంది, మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సిరోల్ ఏకలవ్య గురుకులంలో 40 మంది, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లోని సాంఘిక సంక్షేమ వసతిగృహంలో 15 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు, ఖమ్మం జిల్లా తనికెళ్లలోని గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో 100 మంది విద్యార్థినులు కూడా కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన ఉదంతాలున్నాయి.
నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు విద్యార్థినుల మృతి
నిజామాబాద్ జిల్లాలో రెండు చోట్ల కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఇద్దరు విద్యార్థినులు అస్వస్థతకు గురై మృతి చెందారు. ఉట్నూర్ కేజీబీవీలో చదువుకుంటున్న 10వ తరగతి విద్యార్థిని ఆత్రం కవిత తీవ్ర అనారోగ్యానికి గురై.. వైద్యం ఆలస్యం కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. అలాగే కుంటాల ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న రాథోడ్ భాగ్యశ్రీ అనారోగ్య బారిన పడి ఇచ్చోడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ రెండు ఘటనల్లో అధికారుల నిర్లక్ష్యమే ఎక్కువగా కనిపిస్తోంది.