Education: చదువు మూరేడు.. హోంవర్కు బండెడు! ప్రైవేట్‌ స్కూల్స్‌ నయా ట్రెండ్!

ABN , First Publish Date - 2023-08-02T12:58:15+05:30 IST

ఫీజు బారెడు, చదువు మూరేడు, హోంవర్కు బండెడు.. అనేది నేటి ప్రైవేట్‌ స్కూల్స్‌ సిద్ధాంతంగా మారింది. ఎంత ఎక్కువ ఫీజు వసూలు చేస్తే, ఎంత ఎక్కువ హోంవర్క్‌ ఇస్తే అంత ఆ స్కూల్‌ గ్రేట్‌ అన్న సిద్ధాంతం నేడు కొనసాగుతోంది. ఫలితంగా ఆ భారం విద్యార్థులపై పడుతోంది. విద్యావిధానం మార్పు పేరుతో హద్దుమీరిన హోంవర్క్‌ నేడు విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఈ హోంవర్క్‌ కారణంగా విద్యార్థులు మానసిక ఆందోళనలో ఉన్నారు.

Education: చదువు మూరేడు.. హోంవర్కు బండెడు! ప్రైవేట్‌ స్కూల్స్‌ నయా ట్రెండ్!

తల్లిదండ్రులకు అదనపు భారం.. ఒత్తిడి

ప్రైవేట్‌ స్కూల్స్‌ యాజమాన్యాల తీరుపై పలువురు అభిప్రాయాలు

విద్యార్థుల్లో మానసిక ఆందోళన

ఫీజు బారెడు, చదువు మూరేడు, హోంవర్కు బండెడు.. అనేది నేటి ప్రైవేట్‌ స్కూల్స్‌ సిద్ధాంతంగా మారింది. ఎంత ఎక్కువ ఫీజు వసూలు చేస్తే, ఎంత ఎక్కువ హోంవర్క్‌ ఇస్తే అంత ఆ స్కూల్‌ గ్రేట్‌ అన్న సిద్ధాంతం నేడు కొనసాగుతోంది. ఫలితంగా ఆ భారం విద్యార్థులపై పడుతోంది. విద్యావిధానం మార్పు పేరుతో హద్దుమీరిన హోంవర్క్‌ నేడు విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఈ హోంవర్క్‌ కారణంగా విద్యార్థులు మానసిక ఆందోళనలో ఉన్నారు.

హైదరాబాద్, నార్సింగ్‌, ఆగస్టు 1 (ఆంద్రజ్యోతి): పలు ప్రైవేట్‌ స్కూల్స్‌ వారు తరగతి గదిలో చెప్పింది 20 శాతం అయితే ఆ ఆరోజు ఇంటికి ఇచ్చే హోంవర్క్‌ 80 శాతం. ఉదయం లేచిన విద్యార్థి పాఠశాలకు వెళ్లి వచ్చిన వెంటనే ఆ హోంవర్క్‌పై పడిపోతున్నారు. రాత్రి 10 గంటలు దాటినా కొందరు విద్యార్థులు హోంవర్క్‌లోనే మునిగిపోతున్నారు. తల్లి చదువుకున్నవారై, గృహాణి అయితే ఆ విద్యార్థికి హోంవర్క్‌లో సాయం చేస్తుంది. ఇక లేదంటే ఆ విద్యార్థి ట్యూషన్‌లకు పరిగెడుతున్నాడు. అసలు విద్యార్థికి 40శాతం చదువు, 20 శాతం హోంవర్క్‌, మరో 40 శాతం ఆటలు, పాటలు ఉండాలన్నది విద్యావిధానం సూత్రం. కానీ ఇక్కడ 80 శాతం హోంవర్క్‌ నెత్తిన కూర్చుంటోంది.

వారానికో ప్రాజెక్టు వర్క్‌

ఇక నేడు వారానికి ఒక ప్రాజెక్టు వర్క్‌ అన్నది ఫ్యాషన్‌గా మారింది. ఇదో కొత్తరకం హోంవర్క్‌. ఇది కూడా ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు విద్యార్థులకు ఉన్న సమస్య. ఒక వారం వంటల చార్ట్‌లు అంటించుకుని వెళితే, మరోవారం ఇంట్లో పనికిరాని సిడీలతో ఏదో ఒక వస్తువు తయారు చేసుకుని వెళ్లాలి. మరో వారం కాలేజీ థీమ్‌ అంటూ కళాశాలు ఎలా ఉంటుందో అని ఒక ప్రాజెక్టు తయారు చేసుకుని వెళ్లాలి. ఇలా ప్రతివారం ఒక ప్రాజెక్టు. ప్రాథమిక పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు కళాశాల ఎలా ఉంటుందో ఏం తెలుస్తుంది? మరికొన్ని కళాశాలలో రకరకాల చిత్రాలు, ఫలానా కళాకారుడి పెయింటింగ్స్‌ తెమ్మని, వాటిని అంటించి ఆ పెయింటింగ్‌ కోసం రాయమంటున్నారు. మరి విద్యార్థులకు ఆ కెపాసిటీ ఉందో లేదో వారే చెప్పాలి. ఇవన్నీ విద్యార్థులు చేయలేరు. కాబట్టి ఆ పనంతా పేరెంట్స్‌కు పడుతోంది. కొన్ని పాఠశాలు ఈ ప్రాజెక్టులు నేరుగా చెబుతుండగా, మరికొన్ని ఈమెయిల్స్‌ ద్వారా శనివారం పంపుతున్నారు. ఈమెయిల్స్‌ లేని తల్లిదండ్రుల గతి అధోగతే....!

healf.jpg

అడిగితే పాపం..

ఈ అధిక భారమైన విద్యార్థికి ఇంతభారమైన హోంవర్క్‌ అవసరమా అని పేరేంట్స్‌ అడిగితే ఆ పేరెంట్స్‌ ఆ స్కూల్‌కు, ఆ టీచర్‌కు శత్రువులే. దీంతో చాలా మంది పేరెంట్స్‌ నోరుమూసుకుంటున్నారు. ఇక్కడ విద్యార్థి భవిష్యత్‌పై దెబ్బ పడుతుందో అన్న భయం వారిని నోరుమూసుకునేలా చేస్తోంది. ఇటీవల ఓ సీబీఎ్‌సఈ స్కూల్‌ టీచర్‌ను తల్లితండ్రులు చదువు సరిగ్గా చెప్పడంలేదని ఊరికే రాయిస్తున్నారని ప్రశిస్తేనే ‘మీ కొడుకు క్లాస్‌రూంలో శ్రద్ధగా ఉండడు. అటు ఇటు చూస్తుంటాడు. ఎలా చెప్పమంటారు’ అని ఎదురు ప్రశ్నించిందట. ‘మీరు ఆసక్తిగా చెప్పకుంటే విద్యార్థి అటు ఇటు చూస్తాడు. మీరెందుకు ఆసక్తిగా చెప్పడం లేదు’ అని విద్యార్థి తల్లిదండ్రులు ఎదురు ప్రశ్నించడంతో సరే ఇప్పటి నుంచి ఆసక్తిగా చెప్తానని చెప్పింది. మరుసటి రోజు నుంచి ఆ విద్యార్థిని సెపరేట్‌ చైర్‌పై ఇతర విద్యార్థులకు దూరంగా కూర్చొబెట్టింది. తిగిరి గట్టిగా అడిగితే మళ్లీ మామూలుగా కూర్చొబెట్టిందా టీచర్‌’ అని తల్లిదండ్రులు వాపోయారు. అడిగితే ఈ రకంగా విద్యార్థులను మానసకింగా వేధించడం తప్పించి యాజమాన్యాలు, ఉపాధ్యాయులు వారి ప్రవర్తనలో మార్పులు చేసుకోకపోవడం, హోంవర్కు పేరుతో రుద్దడం, చేస్తుండడం జరుగుతున్నాయి. ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇలాంటి అనేక ఘటనలు ఉన్నాయి. ఏ తరగతి విద్యార్థికి రోజూ ఎంత హోంవర్క్‌ ఇవ్వాలి, ఎంత వారు చేయగలుగుతారు, ఆ కెపాసిటీ ఉందా లేదా అన్నది ఏ పాఠశాలకు లెక్క, తీరుతెన్ను, నిబంధనల లేకపోవడం శోచనీయం. దీంతో ఒకటి నుంచి పదోతరగతి విద్యార్థి వరకు ఈ హోంవర్క్‌ భారం మోస్తున్న వారే...

హోంవర్క్‌ కోసమే.. ట్యూషన్‌లకు

నేడు చాలామంది విద్యార్థులు సాయంత్రం ట్యూషన్‌లకు వెళుతున్నారు. ట్యూషన్‌లకు ఇంత డిమాండ్‌ పెరగడానికి సూత్రం ఈ హోంవర్క్‌లే. చాలా మంది ఈ హోంవర్క్‌లకు భయపడి ట్యూషన్లలో జాయిన్‌ చేస్తున్నారు. ఆ ట్యూషన్‌లో వారు ఏం చెప్పకున్నా పర్వాలేదు, మా వాడితో హోంవర్క్‌ చేయించడండి చాలంటూ జాయిన్‌ చేస్తూ వేలకు వేలు ట్యూషన్‌లకు తగలేస్తున్నారు. ఇది ఇంకో రకమైన భారం.

విద్యార్థులపై ఒత్తిడి ఉండకూడదు

కేంద్రీయ విద్యాలయాల్లో బయిట పాఠశాలలకన్నా విద్యార్థులకు బోధన భిన్నంగా ఉంటుంది. కేవలం రెండు రోజులు మాత్రమే విద్యార్థులకు హోంవర్కు ఉంటుంది. మిగతా రోజులన్నీ విద్యాబోధనతోపాటు ఇతర రంగాలైన సాంస్కృతిక, క్రీడా రంగాల వైపు తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నాం. 20 శాతం మాత్రమే విద్యార్థులకు హోంవర్క్‌ ఉంటుంది. మిగతా 80 శాతం పాఠశాల్లోనే విద్యార్థులను తీర్చిదిద్దుతాం. విద్యార్థులపై ఒత్తిడి ఉండకూడదన్నది మా అభిప్రాయం.

- డి.బాలాత్రిపురేశ్వరి, గృహణి, నార్సింగ్‌

మానసికంగా పిల్లలు..

ఏ పాఠశాలైనా హోంవర్క్‌ తగ్గించాల్సిందే. ఇంత హోంవర్క్‌ ఇవ్వడం వల్ల పిల్లలు మానసికంగా ఎదుగలేకపోతున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. సరిగ్గా తినలేకపోతున్నారు. ఇంత దారుణంగా తయారైంది విద్యావ్యవస్థ. ఈ హోంవర్క్‌ విధానంపై మేధావులు, విద్యావేతలు, ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. చైల్డ్‌ వెల్ఫేర్‌ బోర్డు వారు కూడా ఈ విషయంపై చర్చించాలి. తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే యాజమాన్యం, ప్రిన్సిపాల్‌ వారిపై కక్ష కట్టకుండా ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించాలి.

- బుర్ర శివజ్యోతి, మహిళా మండలి ప్రతినిధి, బండ్లగూడ

నిద్రలో కలవరిస్తున్నారు

మమ్మీ హోంవర్క్‌ చేయలేదు.. ఆ సబ్జెక్ట్‌ ఉండిపోయింది. టీచర్‌ తిడుతుంది. అందరిముందు ఇన్సల్ట్‌ చేస్తుంది’ అంటూ పిల్లలు నిద్రలో కలవరిస్తున్నారు. ఈ హోంవర్క్‌ భూతం ఇంతలా భయపెడుతోంది అనే ఫిర్యాదులు ఈ మధ్య చాలా వింటున్నాం. ఇతర తల్లిదండ్రులు ఈ అంశాలపై డిస్కస్‌ చేస్తున్నారు. ఇలాంటి హోంవర్క్‌ ‘మేము ఎప్పుడూ చూడలేదు. పిల్లల్ని హోంవర్క్‌ పేరుతో వేధిస్తున్నారు. పిల్లలందరూ భారం మోస్తున్నారు. టీచర్ల పనికూడూ పిల్లలతో చేయిస్తున్నారు. చదువు తక్కువ, హోంవర్క్‌ ఎక్కువ చేయిస్తూ ఫీజులు బాగా గుంజుతున్నారు. బాధేస్తుంది.

- పొన్న సంధ్య, గృహిణి, మంచిరేవుల

ఇష్టమైన చదువును చెప్పించండి

తల్లిదండ్రుల ఆశలను పిల్లలపై రుద్దుతూ వారిని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారు. ఉన్నత చదువులకోసం ఇప్పటి నుంచే పునాది అంటూ పిల్లలపై ఒత్తిడి పెంచుతూ వారిని మానసికంగా కుంగ దీస్తున్నారు. ఇప్పటికైనా చదువు విషయంలో తమ పిల్లలు ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నారో తెలుసుకోవడం, వారికి ఇష్టమైన చదువును అందించడం తల్లిదండ్రుల బాధ్యత. భారమైన చదువును, ఒత్తిడిని తట్టుకోలేక తల్లిదండ్రుల కోర్కెలను నెరవేర్చలేక చివరకు ఆత్మహత్యకు పాల్పడుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. పిల్లలపై ఆశలు పెంచుకొని, విదేశాలకు పంపి డాలర్సు సంపాదించాలన్న ఉద్దేశం ఉన్న తల్లిదండ్రులు తమ మనస్సు మార్చుకోవాలి. రిజల్డ్‌ ఓరియంటెడ్‌గా పోకుండా విద్యార్థి మంచి తెలివిపరుడుగా అన్ని రంగాల్లో రాణించే తీర్చిదిద్దగల విద్యను చెప్పించాలి.

-డాక్టర్‌ వసంత్‌రావు చౌహాన్‌, కౌన్సిలర్‌, మణికొండ

Updated Date - 2023-08-02T13:00:10+05:30 IST