Tenth Paper leak: అలా చేస్తే చంపుతానని బెదిరించాడు..!

ABN , First Publish Date - 2023-04-07T12:37:12+05:30 IST

పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ (Tenth Hindi Question Paper Leakage) లో తనకు ఎలాంటి పాత్ర లేకున్నా.. తనను ఐదేళ్లపాటు డిబార్‌ చేసి తన జీవితాన్ని

Tenth Paper leak: అలా చేస్తే చంపుతానని బెదిరించాడు..!
Tenth Paper leak

లీకేజీలో నా పాత్రేమీ లేదు

నన్ను బలిపశువును చేయొద్దు

బెదిరించి ప్రశ్నపత్రం లాక్కున్నాడు

డిబార్‌ రద్దు చేసి పరీక్ష రాయనివ్వండి

పేపర్‌ లీకేజీలో బాధిత విద్యార్థి హరీశ్‌

కమలాపూర్‌, ఏప్రిల్‌ 6: పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ (Tenth Hindi Question Paper Leakage) లో తనకు ఎలాంటి పాత్ర లేకున్నా.. తనను ఐదేళ్లపాటు డిబార్‌ చేసి తన జీవితాన్ని నాశనం చేశారని బాధిత విద్యార్థి దండబోయిన హరీశ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఏ తప్పూ చేయలేదని, తనను బలిపశువును చేయొద్దని వేడుకున్నాడు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లోని జడ్పీ హైస్కూల్‌లో గురువారం ఇంగ్లిష్‌ పరీక్ష రాసేందుకు రాగా, అధికారులు అడ్డుకొని అతడిని బయటకు పంపించారు. దీంతో బాలుడు తన తల్లి లలితతో కలిసి మీడియాతో మాట్లాడాడు. ‘నేను కమలాపూర్‌లోని ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి చవుతున్నాను. ఈ నెల 4న కమలాపూర్‌లోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఫస్ట్‌ ఫ్లోర్‌లో కిటికీ పక్కన కూర్చొని హిందీ పరీక్ష రాస్తుండగా.. ఓ గుర్తుతెలియని వ్యక్తి వచ్చాడు. అతడిని చూసి షాక్‌ అయ్యాను. కిటికీ వద్ద నిలబడి ‘ప్రశ్నపత్రం ఇవ్వు తమ్మీ..’ అని అడిగాడు. నేను ఇవ్వనని చెప్పాను.

ఇన్విజిలేటర్‌ మేడమ్‌కు చెబుతానని బదులిచ్చాను. ‘అలా చేస్తే చంపుతా’ అని బెదిరించాడు. కిటికీలోంచి నా ప్రశ్నపత్రం లాక్కున్నాడు. వెంటనే సెల్‌ఫోన్‌లో ఫొటో తీసుకొని ప్రశ్నపత్రాన్ని తిరిగి నాపైకి విసిరేసి వెళ్లిపోయాడు. ఇదంతా నిమిషాల వ్యవధిలో జరిగింది’ అని హరీశ్‌ తెలిపాడు. కాగా, గురువారం ఇంగ్లిష్‌ పరీక్ష రాసేందుకు కమలాపూర్‌ జడ్పీ హైస్కూల్‌కు రాగా.. డీఈవో తనను స్టాఫ్‌ రూమ్‌కు పిలిపించుకొని ‘నిన్ను డిబార్‌ చేశాం..’ అని తెలిపి సంతకం చేయించుకొని, హాల్‌టికెట్‌ తీసుకొని బయటకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని, డిబార్‌ను రద్దు చేసి.. మిగతా పరీక్షలకు అనుమతించాలని కోరాడు. కాగా, హరీశ్‌ స్వస్థలం హనుమకొండ జిల్లా దామెర మండలంలోని సీతారాంపూర్‌. తండ్రి రాజు ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, తల్లి లలిత కూలికి వెళ్తుంటుంది. విద్యార్థి హరీశ్‌ను ఐదేళ్ల పాటు డిబార్‌ చేశామని ఎంఈవో రాంకిషన్‌ రాజు తెలిపారు.

నా కొడుకు జీవితాన్ని ఆగం చేయకండి

ఎవరో చేసిన పనికి తన కొడుకు జీవితాన్ని ఆగం చేయవద్దని విద్యార్థి హరీశ్‌ తల్లి లలిత కన్నీరు మున్నీరుగా విలపించారు. తన కొడుకును కష్టపడి చదివించుకుంటున్నామని తెలిపారు. పరీక్ష రాస్తుంటే బయట నుంచి వచ్చిన ఓ వ్యక్తి.. పరీక్ష పేపర్‌ గుంజుకొని ఫొటో తీసుకున్నాడని తెలిపారు. ఎవరికైనా చెబితే బయటకు వచ్చాక పొడిచి వేస్తానని బెదిరించడంతో తన కొడుకు భయపడ్డాడని ఆమె కన్నీటి పర్వంతమైంది. మిగతా పరీక్షలు రాసేందుకు అనుమతించాలని వేడుకుంది.

Updated Date - 2023-04-07T12:37:12+05:30 IST