TS TET Result: తెలంగాణ టెట్ ఫలితాలు వచ్చేశాయోచ్!
ABN , First Publish Date - 2023-09-27T10:39:25+05:30 IST
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబరు 15న 2,052 కేంద్రాల్లో జరిగిన టెట్ పేపర్-1 పరీక్షకు 84.12 శాతం.. మధ్యాహ్నం నిర్వహించిన పేపర్ -2 పరీక్షకు 91.11 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET) 2023 ఫలితాలు (TS TET Results) విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఫలితాలను అధికారులు విడుదల చేశారు. టెట్‌కు హాజరైన అభ్యర్థులు తుది ‘కీ’ తో పాటు ఫలితాలను కూడా చెక్ చేసుకోవచ్చు. సెప్టెంబరు 20న టెట్ ప్రాథమిక కీ విడుదల చేశారు. అభ్యర్థుల నుంచి సెప్టెంబరు 23 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. సెప్టెంబరు 27న తుది ఆన్సర్ కీతో పాటు ఫలితాలను కూడా విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబరు 15న 2,052 కేంద్రాల్లో జరిగిన టెట్ పేపర్-1 పరీక్షకు 84.12 శాతం.. మధ్యాహ్నం నిర్వహించిన పేపర్ -2 పరీక్షకు 91.11 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. పేపర్-1 పరీక్షకు 2,69,557 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,26,744 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక బీఈడీ విద్యార్థులకే అర్హత ఉన్న పేపర్-2 పరీక్షకు 2,08,498 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 1,89,963 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
ఇదిలా ఉంటే డీఎస్పీ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. నవంబర్ 20 నుంచి 30 వరకు నియామక పరీక్షలు జరగనున్నాయి.