Tenth paper leak: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీకి కారణాలివే?

ABN , First Publish Date - 2023-04-05T10:51:55+05:30 IST

పదో తరగతి పరీక్షల్లో (Tenth Class Exam) వరుసగా రెండో రోజు ప్రశ్నపత్రం పరీక్ష కేంద్రం నుంచి బయటికి వచ్చింది. తొలిరోజు చోటుచేసుకున్న పరిణామంతో

Tenth paper leak: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీకి కారణాలివే?
Tenth paper leak

ఫలితాల ఒత్తిడి.. ప్రైవేట్‌ కక్కుర్తి!

గతంలోనూ ఇదే తరహాలో మాస్‌ కాపీయింగ్‌

ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలపై తీవ్ర ఒత్తిడి

ఫలితాల శాతం తగ్గితే ఉపాధ్యాయులపై చర్యలు

పేపర్లను అందుకే లీక్‌ చేస్తున్నారనే ఆరోపణలు

ఉన్నతాధికారుల ఉదాసీన వైఖరి కూడా కారణం?

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల్లో (Tenth Class Exam) వరుసగా రెండో రోజు ప్రశ్నపత్రం పరీక్ష కేంద్రం నుంచి బయటికి వచ్చింది. తొలిరోజు చోటుచేసుకున్న పరిణామంతో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు పడినా, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరించినా మార్పు రాలేదు. మళ్లీ అదే పునరావృతమైంది. దీంతో ఈ పరిణామంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం ఒకకారణమైతే.. ఫలితాల శాతాన్ని పెంచాలనే ఒత్తిడి, ప్రైవేట్‌ స్కూళ్ల కక్కుర్తి వంటి మరో కారణం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి టెన్త్‌ ఫలితాలను పెంచడంపై చాలా ఏళ్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయులపై ఒత్తిడి ఉంటోంది. జీరో ఫలితాలు వస్తే.. సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, టీచర్లపై చర్యలు తీసుకుంటున్నారు. తమ పాఠశాల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో కొంతమంది ఉపాధ్యాయులు మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారనే విమర్శలు గతంలోనూ వచ్చాయి. ప్రైవేట్‌ స్కూళ్ల యాజమాన్యాలు కూడా మెరుగైన ఫలితాల కోసం పేపర్‌ లీకేజీ, మాస్‌ కాపీయింగ్‌ వంటి చర్యలకు పాల్పడుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. టెన్త్‌ పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను జంబ్లింగ్‌ విధానంలో కేటాయిస్తున్నారు. ఒకే స్కూల్‌ విద్యార్థులు ఒకే హాల్‌లో పరీక్షలను రాసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో పరీక్ష హాల్‌లో తమ విద్యార్థులున్న స్కూళ్లకు చెందిన ప్రతినిధులు ఒక బృందంగామాస్‌ కాపీయింగ్‌కు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పరీక్ష హాల్‌లోని ఇన్విజిలేటర్లు, ఎగ్జామ్‌ అధికారులతో చేతులు కలుపుతున్నారనే ఆరోపణలున్నాయి.

ముందస్తు ప్రణాళిక ప్రకారమే..!

సాధారణంగా పేపర్‌ లీక్‌ (Paper leak) అంటే.. పరీక్ష ప్రారంభం కావడానికి ముందే ప్రశ్నపత్రం బయటికి వస్తుంది. ప్రస్తుతం పరీక్ష కేంద్రంలోని విద్యార్థులకు ప్రశ్నపత్రాలు ఇచ్చిన తర్వాత బయటకు వస్తోంది. పరీక్ష కేంద్రంలోని సిబ్బంది ద్వారానే ఇది బయటకు వస్తోంది. దీనినిబట్టి ఈ వ్యవహారం పూర్తిగా ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. పరీక్ష కేంద్రంలోకి సెల్‌ ఫోన్లను అనుమతించకూడదని స్పష్టమైన నిబంధన ఉన్నా.. అనేక కేంద్రాల్లోకి ఫోన్లను అనుమతిస్తున్నారు. సెల్‌ఫోన్‌ల ద్వారానే పేపర్లు బయటకు వస్తున్నాయి. జిల్లాల వారీగా ప్రత్యేక పరిశీలకులను ఏర్పాటు చేసి, పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తే దీనిని కొంతమేరకు నియంత్రించవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టెన్త్‌ పరీక్షల నిర్వహణలో విద్యాశాఖ అధికారులు మొదటి నుంచి కొంత ఉదాసీనత వైఖరితోనే ఉన్నారన్న విమర్శలు వస్తున్నాయి.

రెండో రోజు 99.63% హాజరు

పదో తరగతి పరీక్షల్లో భాగంగా రెండో రోజు మంగళవారం నిర్వహించిన సెకండ్‌ లాంగ్వేజ్‌ పరీక్షకు 99.63 శాతం విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,85,669 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, ఇందులో 4,83,860 మంది విద్యార్థులు హాజరయ్యారు. మరో 1809 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.

Updated Date - 2023-04-05T10:51:55+05:30 IST