Telangana: ‘కేజీ నుంచి పీజీ దాకా’ సర్వం దోపిడీ!

ABN , First Publish Date - 2023-03-01T11:35:21+05:30 IST

దేశభవిష్యత్తు తరగతి గదులలోనే రూపుదిద్దుకొంటుందని రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ (Ambedkar) అన్నారు. కానీ, తెలంగాణ (Telangana) లోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో, గురుకులాల్లో నెలకొన్న దయనీయ పరిస్థితులను

Telangana: ‘కేజీ నుంచి పీజీ దాకా’ సర్వం దోపిడీ!
సర్వం దోపిడీ!

దేశభవిష్యత్తు తరగతి గదులలోనే రూపుదిద్దుకొంటుందని రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ (Ambedkar) అన్నారు. కానీ, తెలంగాణ (Telangana) లోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో, గురుకులాల్లో నెలకొన్న దయనీయ పరిస్థితులను చూస్తే తెలంగాణ భవిష్యత్తు ఎంత ఘోరంగా ఉండబోతోందో అర్థం అవుతుంది. రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ వ్యతిరేక విధానాలకు ముగింపు లభించిందని ఆశపడ్డ ఇక్కడి ప్రజలు గత ఎనిమిదేండ్లుగా ఇక్కడ నెలకొన్న దారుణ పరిస్థితులను చూసి తాము పెనంలోంచి పొయ్యిలోకి పడ్డామని గ్రహిస్తున్నారు.

రాష్ట్రం ఏర్పాటయినప్పుడు మనది మిగులు బడ్జెట్‌. తెలంగాణ ధనిక రాష్ట్రం అని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR) ప్రకటించిండు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలోనే టీఆర్‌ఎస్‌ పార్టీ ‘కేజీ నుంచి పీజీ’ వరకు అందరికీ ఉచితంగా విద్యను అందిస్తామని పేర్కొన్నది. ప్రజలు ఆ వాగ్దానాన్ని నమ్మి టీఆర్‌ఎస్‌కు (TRS) అధికారం అప్పజెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యాపారంగా మారిన ‘విద్య’ ఇకపై పేదలకు, సామాన్యులకు ఉచితంగా అందుబాటులోకి రాబోతున్నదని ఆశపడ్డారు. విద్యార్థుల మధ్య అంతరాలు పెంచే ప్రైవేటు విద్య తెలంగాణలో క్రమంగా కనుమరుగవుతుందని, అమెరికా, యూరప్‌ వంటి దేశాలలో మాదిరిగా ఇక్కడ అందరికీ ఒకేరకమైన విద్య అందుతుందని భావించారు. అయితే, ఈ ఎనిమిదేండ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో విద్యారంగంలో చోటు చేసుకొన్న మార్పులేమిటి?

మేనిఫెస్టోలో పెట్టిన ‘కేజీ నుంచి పీజీ’ వరకు ఉచిత విద్య హామీ ఏ గాలికి ఎటువైపు కొట్టుకుపోయిందో ఎవరికీ తెలియదు. తొలి ఏడాది ఈ హామీ సాధ్యం కాలేదని, మలి ఏడాది నుంచి అమలు చేస్తామని కేసీఆర్‌ నమ్మకంగా చెప్పారు. కానీ, ఎనిమిదేండ్లయినా ఆ హామీ ఊసు ఎత్తడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి విద్యా విధానం ఉండాలో నిర్ణయించడానికి విద్యావంతులు, మేధావులు, వైస్‌ఛాన్సలర్లు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు, టీచర్లు, తల్లిదండ్రులతో సెమినార్లు, చర్చలు నిర్వహిస్తామని కూడా కేసీఆర్ తమ 2014 పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నారు. కానీ, ఈ ఎనిమిదేండ్లలో ఆ దిశగా ఒక్క సెమినార్‌ అయినా నిర్వహిస్తే ఒట్టు. తెలంగాణ పితామహుడైన ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ తెలంగాణలో పేదరికాన్ని, వెనుకబాటుతనాన్ని పారద్రోలే చోదకశక్తి ‘విద్య’ అని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక విద్యాభివృద్ధిని ప్రభుత్వం ప్రాధాన్యతారంగంగా స్వీకరించాలని పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. జయశంకర్ చెప్పిన ఏ ఒక్క మాటను కేసీఆర్‌ అమలులో పెట్టలేదు. విద్యను ప్రాధాన్యతాంశంగా స్వీకరించకపోగా దానికి ఏ మాత్రం విలువనివ్వటం లేదు.

దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే విద్య, వైద్య రంగాలకు అతి తక్కువ నిధులు కేటాయిస్తున్నది తెలంగాణయే! ఢిల్లీ రాష్ట్రం విద్యారంగానికి తన బడ్జెట్‌లో అత్యధికంగా 25శాతం నిధులను కేటాయించగా వెనుకబడిన రాష్ట్రంగా చెప్పుకొనే బీహార్‌ తన బడ్జెట్‌లో విద్యకు 19శాతం నిధుల్ని కేటాయించింది. చివరకు జార్ఖండ్‌ కూడా తన బడ్జెట్‌లో 16శాతం నిధుల్ని కేటాయించింది. ఒక్క తెలంగాణ మినహా దాదాపుగా అన్ని రాష్ట్రాలు విద్యారంగానికి తమ బడ్జెట్‌లలో 10శాతం నుంచి 16శాతం నిధులు కేటాయించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పీఆర్‌ఎస్‌ ఇండియా అనే సంస్థ రూపొందించిన ‘స్టేట్‌ ఆఫ్‌ స్టేట్‌ ఫైనాన్సెస్‌’ (రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు) అనే నివేదికలో ఈ వాస్తవాలు వెల్లడి అయ్యాయి. 2014–15 బడ్జెట్‌లో 10.89శాతం నిధులను కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత క్రమంగా విద్యారంగానికి నిధులను తగ్గిస్తూ వస్తోంది. 2021–22లో రాష్ట్ర బడ్జెట్‌ పరిమాణం రూ.2 లక్షల 30 వేల కోట్లు. ఇందులో విద్యారంగానికి కేటాయించినది రూ.15,608 కోట్లు (6.78శాతం). 2022–23 రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి మరింత తగ్గించి 6.24శాతం నిధులను మాత్రమే కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరికి వచ్చేసరికి ఆ నిధులు కూడా పూర్తిగా ఖర్చు చేస్తారో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొంది.

బంగారు తెలంగాణ దిశగా అడుగులేస్తున్నామని చెప్పుకొంటున్న టీఆర్‌ఎస్‌ ఏలుబడిలో విద్యారంగం ఎట్లున్నది? తెలంగాణలో అక్షరాస్యత రేటు 71.08 శాతం. దేశంలో అక్షరాస్యత సగటు రేటు 77.7శాతం. అక్షరాస్యతలో దేశంలో తెలంగాణది 24వ స్థానం. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 281 బీసీ గురుకులాలు; 192 మైనార్టీ గురుకులాలు ఉండగా వీటిల్లో ఒక్కదానికి కూడా సొంత బిల్డింగ్‌ లేదు. 268 ఎస్సీ గురుకులాలు ఉండగా అందులో 150 ఇప్పటికీ కిరాయి భవనాల్లో ఉన్నాయి. 180 ఎస్టీ గురుకులాలు ఉండగా అందులో 30 ఇంకా అద్దె భవనాల్లో ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లు 1700కు పైగా ఉండగా అందులో 4 లక్షల మంది విద్యార్థులు చదువుకొంటున్నారు. ఈ భవనాల్లో అత్యధికం శిథిలావస్థకు చేరాయి. స్టూడెంట్ల సంఖ్యకు సరిపడా డార్మెటరీలు, డైనింగ్‌ హాల్స్‌, వాష్‌రూములు లేవు. బాత్‌రూములకు రోజూ నీరు రాదు. దాంతో 3, 4 రోజులకొకసారి మాత్రమే స్టూడెంట్లు స్నానం చేయగలుగుతున్నారు.

తెలంగాణలో వివిధ కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరగడం అందర్నీ ఆందోళనకు గురిచేస్తున్నది. నేషనల్‌ క్రైమ్ రికార్డ్‌ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) ప్రకారం 2014–2021 మధ్య కాలంలో తెలంగాణలో 3,600 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఒక్క 2020–21 సంవత్సరంలోనే 567 మంది విద్యార్థులు చనిపోయారు. ఫీజులు చెల్లించలేక, సరైన వసతులు లేక, ఉద్యోగాలు రావేమోనన్న భయంతో ఒత్తిడికి లోనయి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఆత్మహత్యల నివారణకు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. బాసర ఐఐఐటి వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో మౌలిక వసతుల కోసం విద్యార్థులు రోజుల తరబడి ఆందోళనబాట పడితే వారి సమస్యలపై స్పందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమయం లేదు.

ప్రభుత్వ బడుల్లో చదువు అధ్వాన్నంగా ఉండటంతో అప్పో సప్పో చేసి పేదవారు తమ పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారు. అయితే, కరోనా తర్వాత ప్రైవేటు స్కూళ్లు ఫీజుల్ని అమాంతం పెంచేశాయి. కరోనా వచ్చిన రెండేండ్లు ఫీజులు పెంచలేదు కనుక ఇప్పుడు పెంచామని స్కూళ్ల యాజమాన్యాలు బహిరంగంగానే చెబుతున్నాయి. కానీ, ప్రైవేటు దోపిడీని అరికట్టే దిశగా ప్రభుత్వం ఎటువంటి చర్యలూ చేపట్టడం లేదు.

ఆ మధ్య సభ్యసమాజాన్ని ద్రిగ్భాంతి పరిచిన డీఏవీ స్కూల్‌లో చిన్నారిపై జరిగిన అత్యాచారం ఘటనతో మేల్కొన్న విద్యాశాఖ అధికారులు జరిపిన దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఆ పాఠశాలలో అనుమతి లేకుండానే 6, 7 తరగతుల్ని నిర్వహిస్తున్నట్లు తేలింది. అనుమతులు లేకుండానే తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేటు బడులు రాష్ట్రవ్యాప్తంగా అనేకం ఉన్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారు. విద్యాశాఖలో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయన్నది బహిరంగ రహస్యం. ఇక, ఇంటర్‌ విద్యను పూర్తిగా ప్రైవేటీకరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 700 ఇంటర్‌ కాలేజీలు నడుస్తుండగా, వాటిల్లో లక్షన్నర మంది స్టూడెంట్లు చదువుతున్నట్లు అంచనా. గుర్తింపులేని కాలేజీలు, స్కూళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తుంటే, వాటిని ప్రశ్నించేవారే లేరు. ప్రైవేటు విద్యా సంస్థలు వసూలు చేస్తున్న ఫీజులపై నియంత్రణ లేదు. అడ్మిషన్లకు డొనేషన్లు పెద్ద మొత్తంలో ముక్కుపిండి వసూలు చేస్తున్నా అడిగేవారు లేరు.

ఇక, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి ఆమోదం లేకుండానే కొన్ని ప్రైవేటు యూనివర్సిటీలు కార్యకలాపాలు మొదలుపెట్టేశాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీలకు సంబంధించి 2018లో ఓ చట్టం తెచ్చి ఐదు ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతులను మంజూరు చేసింది. ఈ ఏడాది మరో ఐదు ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు అవసరమైన బిల్లును తెచ్చారు. ప్రభుత్వపరంగా ఇంకా అనుమతులు పొందని ప్రైవేటు యూనివర్సిటీలు ముందుగానే అడ్మిషన్లు మొదలుపెట్టాయి. భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. కానీ, వాటిని అడ్డుకునేవారు లేరు. కొన్ని కాలేజీలు యూనివర్సిటీలుగా అనుమతులు పొందినప్పటికీ అందుకు అనుగుణంగా తగిన మౌలిక సదుపాయాలు పెంచడం లేదు. ప్రతిష్టాత్మకమైన స్వయంప్రతిపత్తి గల ప్రభుత్వ యూనివర్సిటీలను కావాలని అలక్ష్యం చేస్తూ ప్రైవేటు యూనివర్సిటీలను రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నది.

మొత్తంగా చూస్తే తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో విద్యావ్యవస్థ ఆగం అయ్యింది. హాస్టళ్లల్లో పిల్లలు జ్వరాన పడితే వారికి ఇవ్వడానికి పారాసిటమల్‌ బిళ్లలు కూడా అందుబాటులో లేవంటే, రాష్ట్రంలో విద్యావ్యవస్థ ఏ దిశగా పయనిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. బంగారు తెలంగాణ పేరుతో ఈ ఎనిమిదేండ్లలో టీఆర్‌ఎస్‌ చేయగలిగినన్ని అక్రమాలూ చేసింది. తెలంగాణ ఇంకా టీఆర్‌ఎస్‌ చేతుల్లో ఉంటే రాష్ట్ర భవిష్యత్‌ ఏ విధంగా ఉంటుందో చెప్పడానికి విద్యారంగమే పెద్ద ఉదాహరణ.

-తూళ్ల వీరేందర్‌ గౌడ్‌

బీజేపీ రాష్ట్రశాఖ అధికార ప్రతినిధి

Updated Date - 2023-03-01T11:35:21+05:30 IST