Almonds: బాదాములతో స్నాక్స్.. గుండెపోటుకు చెక్!
ABN , First Publish Date - 2023-03-07T19:23:25+05:30 IST
ప్రస్తుతం ఎక్కడ చూసినా గుండెపోటు(Heart Attack) మరణాల వార్తలే. వయసుతో
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఎక్కడ చూసినా గుండెపోటు(Heart Attack) మరణాల వార్తలే. వయసుతో సంబంధం లేకుండా కుప్పకూలి మరణిస్తున్నారు. గుండెపోటు మరణాలకు కారణాలు ఏవైనా.. కొద్దిపాటి వ్యాయామం, గుండెకు బలాన్నిచ్చే ఆహారం తీసుకోవడం ద్వారా హార్ట్ ఎటాక్‌లను నివారించవచ్చంటున్నారు వైద్యులు. నిజానికి ప్రతిరోజూ నోరూరించే ఎన్నో వంటకాలను తినేస్తుంటాం. రుచుల ఆస్వాదనలో ఎంత తింటున్నామో తెలియకుండానే తినేస్తుండడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పుతోపాటు బాదాము(Almonds)లను ఆహారంలో చేర్చడం ద్వారా గుండె సంబంధిత సమస్యల నుంచి బయటపడొచ్చంటున్నారు వైద్య నిపుణులు.
పోషకాల గని
బాదాముల్లో 15కు పైగా పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఇందులో విటమిన్-ఇ, ప్రొటీన్స్, రిబోఫ్లావిన్, మాంగనీస్, ఫోలేట్, ఫాలీఫెనాల్స్ తదితర 15కు పైగా పోషకాలు ఉన్నాయి. సంవత్సరాల తరబడి శాస్త్రీయంగా జరిగిన అధ్యయనాల ప్రకారం.. క్రమం తప్పకుండా బాదాములు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడడంతోపాటు, చర్మం కాంతిమంతమవుతుంది. మధుమేహాన్ని బాదాములు(Almonds) నియంత్రిస్తాయి. బరువును కూడా ఇవి నియంత్రిస్తాయి.
చర్మ సౌందర్యం మెరగవుతుంది
బాదాముల వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలపై మెడికల్ డైరెక్టర్, కాస్మెటాలజిస్ట్ డాక్టర్ గీతిక మిట్టల్ మాట్లాడుతూ.. బాదాములను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచుకోవచ్చన్నారు. బాదాముల్లో ఉండే విటమిన్లు, పోషకాలు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయన్నారు. లినోలిక్ యాసిడ్, అత్యవసర ఫ్యాటీ యాసిడ్ వంటివి బాదములలో ఉండటం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుందన్నారు.
బాదాములు(Almonds) చర్మంతోపాటు గుండెకు కూడా మేలు చేస్తాయని, రోగ నిరోధక శక్తిని పెంచుతాయని న్యూట్రిషన్, వెల్‌నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి అన్నారు. ఇటీవలి అధ్యయనాల ప్రకారం బాదాములను ఆహారంగా తీసుకోవడం వల్ల బ్యూట్రైట్ ఉత్పత్తి పెరుగుతుందని, దీనివల్ల పేగుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందన్నారు.
ప్రముఖ ఫిట్‌నెస్, సెలబ్రిటీ ఇన్‌స్ట్రక్టర్ యాస్మిర్ కరాచీవాలా మాట్లాడుతూ.. బాదాములలో ప్రోటీన్ అధికంగా ఉంటుందని, ఇది ఎదుగుదల, మజిల్‌మాస్ నిర్వహణలో తోడ్పడుతుందన్నారు. బాదాములను తరచూ తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు చర్మ ఆరోగ్యం కూడా మెరుగవుతుందన్నారు. నీరసం తగ్గించడంతో పాటు రికవరీ సమయంలో కండరాలు నష్టపోకుండా బాదాములు కాపాడబడతాయని ఇటీవల జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడైనట్టు చెప్పారు.