Fact Check : ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌పై ఫేక్ డాక్యుమెంట్ వైరల్
ABN , First Publish Date - 2023-05-12T19:15:31+05:30 IST
పాకిస్థాన్ (Pakistan) ప్రభుత్వానికి, మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు అరెస్ట్ విషయంలో ఓ ఒప్పందం కుదిరిందని చెప్తూ ఓ ఫేక్
న్యూఢిల్లీ : పాకిస్థాన్ (Pakistan) ప్రభుత్వానికి, మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు అరెస్ట్ విషయంలో ఓ ఒప్పందం కుదిరిందని చెప్తూ ఓ ఫేక్ డాక్యుమెంట్ (Fake Document) సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆయనపై అత్యాచారం చేయకుండా, నగ్నంగా ఉంచకుండా దర్యాప్తు జరపాలని ఈ ఒప్పందంలో ఉందని ఈ డాక్యుమెంట్ చెప్తోంది. కానీ ఇదంతా బూటకమని నిర్థరణ అయింది. ఇటువంటి ఒప్పందం కుదరలేదని, ఈ డాక్యుమెంట్ నకిలీదని తేలింది.
ఇమ్రాన్ ఖాన్‌పై అనేక కేసులు ఉన్నాయి. అవినీతి, రాజద్రోహం, ఉగ్రవాదం, దైవ దూషణ వంటి నేరారోపణలు విచారణలో ఉన్నాయి. అల్ కదిర్ ట్రస్ట్ కేసులో ఆయన ఇస్లామాబాద్ హైకోర్టుకు హాజరైనపుడు ఆయనను నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB) అధికారులు మే 9న అరెస్ట్ చేశారు. ఆయన అరెస్టు చెల్లదని, తక్షణమే విడుదల చేయాలని పాకిస్థాన్ సుప్రీంకోర్టు (Supreme Court) గురువారం ఆదేశించింది. ఇస్లామాబాద్ హైకోర్టు ఆయనకు శుక్రవారం రెండు వారాలపాటు బెయిలు మంజూరు చేసింది.
ఈ నేపథ్యంలో వైరల్ అవుతున్న నకిలీ డాక్యుమెంట్‌ను పరిశీలించినపుడు, ఇమ్రాన్ నేతృత్వంలోని పార్టీ పీటీఐ లెటర్‌హెడ్‌ను దీని కోసం వాడినట్లు కనిపిస్తోంది. దీనిపైన ఇమ్రాన్ ఖాన్, అమెరికా రాయబారి డొనాల్డ్ బ్లోమ్, పాకిస్థాన్ మంత్రి యూసుఫ్ నసీం ఖోఖర్ సంతకాలు చేసినట్లు కనిపిస్తోంది. ఈ ఒప్పదం మే 8న కుదిరినట్లు రాశారు. ఇమ్రాన్‌ను అరెస్టు చేసిన తర్వాత ఆయనపై అత్యాచారం చేయకుండా, నగ్నంగా ఉంచకుండా దర్యాప్తు చేయడానికి ఒప్పందం కుదిరినట్లు దీనిలో రాశారు.
ఈ డాక్యుమెంట్‌లో ఏముందంటే..
1. దర్యాప్తు చేసేటపుడు నగ్నంగా ఉండాలని ఇమ్రాన్‌ను నిర్బంధించరాదు.
2. ఇమ్రాన్ పైల్స్ వ్యాధిగ్రస్థుడు కావడంతో ఆయనపై అత్యాచారం చేయడానికి ఎవరికీ అవకాశం ఇవ్వరాదు.
3. ఇమ్రాన్‌ను ఊచలు, కర్రలు వంటివాటితో హింసించరాదు.
ఈ డాక్యుమెంట్ ఫొటోను ట్విటర్‌లో షేర్ చేశారు. ‘‘పాకిస్థాన్ సైన్యం ఇమ్రాన్‌పై అత్యాచారం చేయడానికి ప్రణాళిక రచిస్తోంది. ఐఎస్ఐ కామదాహం నుంచి మాజీ ప్రధాన మంత్రికి సైతం రక్షణ లేదు’’ అని ట్వీట్ చేశారు.
అయితే ఇది ఫేక్ డాక్యుమెంట్ అని వెల్లడైంది. ఈ డాక్యుమెంట్‌లో చెప్పిన ఒప్పందం కుదరలేదని తెలిసింది. ఇంటీరియర్ సెక్రటరీ యూసుఫ్ నసీం ఖోఖర్ ఈ డాక్యుమెంట్ మీద సంతకం చేసినట్లు కనిపిస్తోంది. అయితే ఆయన 2023 మార్చి 7న పదవీ విరమణ చేశారు. ఈ ఒప్పందం మే 8న కుదిరినట్లు చూపిస్తున్నారు. అంటే ఆయన రిటైర్ అయిన రెండు నెలల తర్వాత ఈ ఒప్పందం కుదరినట్లు చెప్పడం బూటకం. మరోవైపు ఆయన పేరు కూడా తప్పుగా రాశారు. యూసఫ్ (Yousaf)కు బదులుగా యూసుఫ్ (Yousuf) అని రాశారు.
పీటీఐ పార్టీ తరచూ విడుదల చేసే నోటిఫికేషన్లతో ఈ ఒప్పందం డాక్యుమెంట్‌ను పోల్చినపుడు, కొంత అపసవ్యత కనిపించింది. పీటీఐ సంవత్సరాన్ని తెలిపేటపుడు నాలుగు అంకెల్లో (2023) రాస్తుంది. ఈ డాక్యుమెంట్‌లో రెండు అంకెల్లోనే (23) తెలిపారు.
మరోవైపు పాకిస్థాన్ అధికారులు కూడా ఇది ఫేక్ డాక్యుమెంట్ అని స్పష్టం చేశారు. ఇమ్రాన్, అమెరికన్ అంబాసిడర్‌లతో ఇటువంటి ఒప్పందం కుదరలేదని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Rajasthan: గెహ్లాట్‌కు ఆర్‍ఎస్ఎస్ ఫోబియా...బీజేపీ చీఫ్ ఫైర్..!
Karnataka election : ‘కింగ్‌మేకర్’ జేడీఎస్ సిద్ధం.. బీజేపీ, కాంగ్రెస్‌లకు సైగలు..