Russia-Ukraine: ప్రజలు చనిపోతున్నారు, చర్చలతో ఈ యుద్ధాన్ని ఆపండి.. బెలారస్ అధ్యక్షుడు సూచన
ABN , First Publish Date - 2023-10-29T17:05:26+05:30 IST
ప్రస్తుతం హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న తరుణంలో రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల గురించి పట్టించుకోవడం మానేశారు కానీ.. ఆ రెండు దేశాల మధ్య ఇప్పటికీ భీకర పోరు కొనసాగుతోంది...
ప్రస్తుతం హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న తరుణంలో రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల గురించి పట్టించుకోవడం మానేశారు కానీ.. ఆ రెండు దేశాల మధ్య ఇప్పటికీ భీకర పోరు కొనసాగుతోంది. ‘ప్రత్యేక సైనిక చర్య’ పేరిట కొన్ని నెలలుగా రష్యా దాడులు చేస్తుండగా.. అందుకు ధీటుగానే ఉక్రెయిన్ బదులిస్తోంది. నిజానికి.. మొదట్లో ఈ యుద్ధంలో రష్యా ఆధిపత్యం చెలాయించింది. కానీ.. పాశ్చాత్త దేశాల సహకారంతో ఉక్రెయిన్ మెల్లగా పుంజుకుని, ధీటుగా పోరాటడం మొదలుపెట్టింది. తన భూభాగంలో రష్యా ఆక్రమించిన ప్రాంతాల్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతమున్న పరిస్థితుల నేపథ్యంలో.. ఈ యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. దీంతో.. చర్చల ద్వారా ఈ యుద్ధానికి స్వస్తి పలకాలని పిలుపులు వస్తున్నాయి.
తాజాగా బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ యుద్ధానికి ఇప్పుడప్పుడే ముగింపు ఉండదన్న ఆయన.. ఈ యుద్ధంలో ఏ దేశానికీ విజయం దక్కదని తేల్చి చెప్పారు. కొన్ని నెలలుగా జరుగుతున్న ఈ యుద్ధంలో ఫలితం తేలని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఈ యుద్ధం కారణంగా ఆరు దేశాలూ తీవ్ర నష్టాల్ని చవిచూస్తున్నాయని, ఎన్నో సమస్యలు తలెత్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఆ రెండు దేశాలు హోరాహోరీగా తలపడుతూనే ఉన్నాయన్నారు. దీని వల్ల ఎంతోమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ఈ యుద్ధ ఫలితంపై ప్రతిష్టంభన నెలకొందని.. ఎవరూ పూర్తి స్థాయిలో పుంజుకోలేరని తెలిపారు. కాబట్టి.. రెండు దేశాలు కాస్త వెనక్కు తగ్గి, చర్చల ద్వారా రాజీ ఒప్పందం కుదుర్చుకోవాలని లుకషెంకో పిలుపునిచ్చారు. మరి.. అది సాధ్యమవుతుందా?
ఇదిలావుండగా.. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు దిగిన సమయంలో, బెలారస్ మీదుగానే రష్యా దళాలు వెళ్లాయి. అప్పుడు బెలారస్‌కు ఉక్రెయిన్ ఓ అభ్యర్థన చేసింది. ఆ సమయంలో తమ సరిహద్దుల నుంచి రష్యా బలగాలను వెనక్కి పంపించేయాలని కోరింది. ఈ విషయాన్ని స్వయంగా లుకషెంకోని తెలిపారు. ఈ అంశంపై కూడా తాము చర్చిస్తామని, ఈ చర్చలకు ఎలాంటి ముందస్తు షరతులు అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ యుద్ధంలో ఎవరూ చనిపోకుండా ఉండాలంటే.. ఉక్రెయిన్ భూభాగం నుంచి రష్యా వెనక్కు వెళ్లాలన్న డిమాండ్‌పై చర్చల ద్వారా పరిష్కరించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.