Imran Khan: పీటీఐని నిషేధిస్తే ఇమ్రాన్ ఖాన్ తదుపరి ప్లాన్ ఇదే..!

ABN , First Publish Date - 2023-07-15T17:01:28+05:30 IST

పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌ స్థాపించిన పాకిస్థాన్ తెహ్రిక్ ఏ ఇన్సాఫ్‌ను ఏ క్షణంలోనైనా రద్దుచేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఇమ్రాన్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, పీటీఐని రద్దు చేస్తే కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తానని, రాబోయే సార్వత్రిక ఎన్నికలను ఆ పార్టీ పేరుతోనే ఎదుర్కొని గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.

Imran Khan: పీటీఐని నిషేధిస్తే ఇమ్రాన్ ఖాన్ తదుపరి ప్లాన్ ఇదే..!

ఇస్లామాబాద్: పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌ (Imran Khan) స్థాపించిన పాకిస్థాన్ తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ (PTI)ను ఏ క్షణంలోనైనా రద్దుచేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పీటీఐ రద్దుకు అధికార పార్టీ నుంచి డిమాండ్లు సైతం పెరుగుతున్నాయి. గత మే 9న ఇమ్రాన్ ఖాన్ అరెస్టు అనంతరం దేశవ్యాప్తంగా అల్లర్లు జరగడం, ఆయనపై పలు కేసులు నమోదు కావడం, ఐటీ దాడులు వంటి వరుస పరిణామాల నేపథ్యంలో ఈ ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇమ్రాన్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, పీటీఐని రద్దు చేస్తే కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తానని, రాబోయే సార్వత్రిక ఎన్నికలను ఆ పార్టీ పేరుతోనే ఎదుర్కొని గెలిచి తీరుతామని నిక్కీ ఏసియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నట్టు 'డాన్' పత్రిక తెలిపింది.


పాకిస్థాన్‌లో సాధారణ పరిస్థితి నెలకొనాలంటే పీటీఐని రద్దు చేయడమే ఏకైక మార్గమని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రానా సనావుల్లా ఇటీవల తెలిపారు. పీటీఐను రద్దు చేసేందుకు ఆలోచన చేస్తున్నామని, పీపీపీ చైర్మన్, విదేశాంగ మంత్రి బిలావల్ భుట్లో జర్దారీ సైతం పీటీఐపై నిషేధానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారని రక్షణ మంత్రి ఖ్వాజీ అసిఫ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో పీటీఐ రద్దుపై నిక్కీ ఏసియా ఇమ్రాన్‌ను ప్రశ్నించగా, పార్టీని రద్దు చేసిన పక్షంలో కొత్త పార్టీ ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళ్తామని, అప్పుడు కూడా తామే గెలుస్తామని ఆయన సమాధానమిచ్చారు. తనను అనర్హునిగా ప్రకటించి, జైలులోకి నెట్టినా సరే తన పార్టీ ఎన్నికల్లో గెలుస్తుందన్నారు. తనకు చెక్కుచెదరని మద్దతుదారులు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. పీటీఐపై ప్రభుత్వం దాడులు కొనసాగిస్తుండటాన్ని ప్రస్తావిస్తూ, బెదిరింపులు ద్వారా పార్టీని దెబ్బతీయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.

Updated Date - 2023-07-15T17:01:28+05:30 IST