Jaishankar Bilawal: భారత్-పాక్ విదేశాంగ మంత్రుల సమావేశం అనుమానమే!

ABN , First Publish Date - 2023-04-26T18:01:35+05:30 IST

బిలావల్ భుట్టో జర్దారీతో భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌ సమావేశం కాకపోవచ్చని తెలుస్తోంది.

Jaishankar Bilawal: భారత్-పాక్ విదేశాంగ మంత్రుల సమావేశం అనుమానమే!
Jaishankar Bilawal

న్యూఢిల్లీ: పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీతో (Pakistan Foreign Minister Bilawal Bhutto Zardari) భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌ (Indian Foreign Minister S Jaishankar) సమావేశం కాకపోవచ్చని తెలుస్తోంది. వారం క్రితమే పూంఛ్‌లో (Poonch) భారత జవాన్లపై దాడి జరగడం ఒక కారణమని సమాచారం. దీంతో పాటు రెండ్రోజుల క్రితం జై శంకర్ పాక్ విధానాలను తూర్పారపట్టారు. ఉగ్రవాదానికి ఊతమిచ్చే పొరుగుదేశాలతో సత్సంబంధాలు బహుకష్టమని జై శంకర్ పనామాలో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బిలావల్ భుట్టోతో జై శంకర్ సమావేశం జరగకపోవచ్చని సమాచారం.

వాస్తవానికి బిలావల్‌ భుట్టో జర్దారీ వచ్చే నెలలో భారతదేశంలో పర్యటించనున్నారు. మే 4-5 తేదీల్లో గోవాలో(Goa) జరగనున్న షాంఘై సహకార సంస్థ విదేశీమంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఇక్కడకు రానున్నారు. 9 ఏళ్ల తర్వాత ఓ పాక్‌ మంత్రి భారత్‌కు రానున్నారు. చివరిసారిగా 2014లో అప్పటి పాక్‌ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ భారతదేశంలో పర్యటించారు. 2019 తర్వాత ఇరు దేశాల మధ్య సుహృద్భావ సంబంధాలు తీవ్రంగా చెడిన నేపథ్యంలో బిలావల్‌ భుట్టో భారత్‌లో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా, రెండు దశాబ్దాల క్రితం 8 దేశాలు కలసి తమ ఆర్థిక, రాజకీయ, సైనిక వ్యవహారాల పరిరక్షణ కోసం షాంఘై సహకార సంస్థను స్థాపించాయి. ఈ ఎనిమిది దేశాలు ప్రపంచంలోని 42 శాతం జనాభాను, అలాగే ప్రపంచ జీడీపీలో 25 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ ఏడాది సమావేశాలకు భారతదేశం అధ్యక్షత వహిస్తోంది. పాక్‌తో పాటు చైనాను కూడా ఇందులో పాల్గొనాల్సిందిగా భారత్‌ ఆహ్వానం పంపింది.

అయితే జమ్మూకశ్మీర్‌లోని (Jammu and Kashmir) పూంచ్‌ ప్రాంతంలో (Poonch) గత వారం రాష్ట్రీయ రైఫిల్స్‌ (Rashtriya Rifles) యూనిట్‌ జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కుపై లష్కరే తాయిబా అనుబంధ సంస్థ పీపుల్స్‌ యాంటీ-ఫాసిస్ట్‌ ఫ్రంట్‌ (People's Anti-Fascist Front ) దాడిలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. హవల్దార్ మందీప్ సింగ్, లాన్స్ నాయక్, లాన్స్ నాయక్ కుల్వంత్ సింగ్, సిపాయి హరికిషన్ సింగ్, సిపాయి సేవత్ సింగ్‌ ప్రాణాలు కోల్పోయారు. అమరులైన ఐదుగురు జవాన్లలో నలుగురు పంజాబ్‌కు చెందినవారు కాగా, దేవాశిష్ బస్వాల్ (Lance Naik Debashish) ఒడిశాకు (Odisha) చెందినవారు.

మరోవైపు జవాన్లపై దాడికి తమదే బాధ్యత అని పీఏఎఫ్ఎఫ్‌ ప్రకటించింది. సరిగ్గా.. 2021లో ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశంలోనే పీఏఎఫ్ఎఫ్‌ (PAFF) ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. 2019లో అల్‌ ఖైదా ప్రేరణతో పురుడుపోసుకున్న ఈ ఉగ్రసంస్థ.. జైషే మహమ్మద్‌కు అనుబంధంగా పనిచేస్తోంది. యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తూ రిక్రూట్‌మెంట్లకు పాల్పడుతోంది. జమ్మూకశ్మీర్‌లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో పీఏఎ్‌ఫఎఫ్‌ పాత్ర ఉండడం, దేశంలోని పలు ప్రాంతాల్లో విధ్వంసాలకు కుట్రలు పన్నడంతో కేంద్ర హోంశాఖ ఈ ఏడాది జనవరిలో ఈ సంస్థపై నిషేధం విధించింది. పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో భారత్‌ పర్యటన ఖరారైన కొన్ని గంటల్లోనే జమ్మూకశ్మీర్‌లో పాక్‌ ప్రేరేపిత ఉగ్రమూకలు దారుణానికి పాల్పడ్డాయి. వచ్చేనెలలో శ్రీనగర్‌లో జరగనున్న జీ-20 టూరిజం వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఘాతుకానికి పాల్పడ్డాయి.

Updated Date - 2023-04-26T18:01:40+05:30 IST