Share News

China: చైనాలో మరో మహమ్మారి పుట్టుక.. మళ్లీ కరోనా తరహా విలయం తప్పదా..?

ABN , First Publish Date - 2023-11-23T11:07:02+05:30 IST

చైనాలో పుట్టిన మరో వ్యాధి ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తోంది. ఇప్పుడిప్పుడే చైనాలో పుట్టిన కరోనా మిగిల్చిన విషాదం నుంచి ప్రపంచ దేశాలు కోలుకుంటున్న్నాయి. ఇంతలోనే అక్కడి నుంచి మరో వ్యాధి పుట్టుకురావడం ప్రపంచాన్ని కలవరానికి గురి చేస్తోంది.

China: చైనాలో మరో మహమ్మారి పుట్టుక.. మళ్లీ కరోనా తరహా విలయం తప్పదా..?

బీజింగ్: చైనాలో పుట్టిన మరో వ్యాధి ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తోంది. ఇప్పుడిప్పుడే చైనాలో పుట్టిన కరోనా మిగిల్చిన విషాదం నుంచి ప్రపంచ దేశాలు కోలుకుంటున్న్నాయి. ఇంతలోనే అక్కడి నుంచి మరో వ్యాధి పుట్టుకురావడం ప్రపంచాన్ని కలవరానికి గురి చేస్తోంది. చైనాలోని పాఠశాల్లో అంతుచిక్కని న్యుమోనియా వ్యాధి విజృంభిస్తోంది. ఈ వ్యాధి ప్రధానంగా చిన్నారులపై ప్రభావం చూపిస్తుండడం కలవరపరుస్తోంది. దీని కారణంగా పిల్లలో శ్వాసకోశ సంబంధిత సమస్యలు, ఊపరితిత్తుతుల ఇన్‌ఫెక్షన్, జ్వరం వంటివి వ్యాపిస్తున్నాయి. దీంతో బీజింగ్, లియోనింగ్ నగరాల్లోని ఆసుపత్రులు బాధిత చిన్నారులతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో ఈ అంటువ్యాధి ప్రబలకుండా చైనాలోని స్కూళ్లకు తాత్కాలికంగా సెలవులు ప్రకటించారు. టీచర్లలో కూడా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తుండడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. చైనాలో కరోనా నియంత్రణ కోసం విధించిన ఆంక్షలు ఎత్తివేయడంతో ఇన్‌ప్లూఎంజా, మైకో ప్లాస్మా, న్యూమోనియా, శ్వాసకోశ సిన్సిటియల్ వైరస్ వంటి అంటువ్యాధులు ప్రబలుతున్నాయని, ఈ వ్యాధికారక వ్యాప్తికి చైనా అధికారుల నిర్లక్ష్యమే కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.


ఈ క్రమంలో దేశంలోని ఉత్తరాన వ్యాపిస్తున్న శ్వాసకోశ అనారోగ్యాలకు సంబధించిన మరింత సమాచారం ఇవ్వాలని చైనాను ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరింది. సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించడానికి చైనీయులు చర్యలు తీసుకోవాలని సూచించింది.. డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం గత మూడు సంవత్సరాల్లో ఇదే కాలంలో ఉత్తర చైనాలో ఇన్‌ఫ్లుఎంజా అనారోగ్యం పెరుగుతోంది. "పిల్లలలో శ్వాసకోశ వ్యాధుల పెరుగుదల, న్యుమోనియా సమూహాలను నివేదించడంపై వివరణాత్మక సమాచారం ఇవ్వాలని డబ్ల్యూహెచ్‌ఓ చైనాకు అధికారిక అభ్యర్థన చేసింది" అని ఐక్యరాజ్యసమితి ఆరోగ్య సంస్థ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్‌ఫ్లుఎంజా, SARS-CoV-2 (కోవిడ్-19కి దారితీసే వైరస్), శిశువులను ప్రభావితం చేసే ఆర్‌ఎస్‌వీ, మైకోప్లాస్మా న్యుమోనియాతో సహా తెలిసిన వ్యాధికారక వ్యాప్తిలో ఇటీవలి పోకడలపై కూడా డబ్ల్యూహెచ్‌ఓ అదనపు సమాచారాన్ని కోరింది. ఈలోగా టీకాలు వేసుకోవడం, అనారోగ్య వ్యక్తుల నుంచి దూరంగా ఉండడం, మాస్కులు ధరించడం వంటి నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలను కోరింది.

చైనాలో వ్యాపిస్తున్న ఈన్యుమోనియా వ్యాధి గురించి ప్రోమెడ్ బయటపెట్టింది. ప్రోమెడ్ అనేది ప్రపంచ దేశాల్లో మనుషులు, జంతువుల్లో వ్యాపించే వ్యాధుల గురించి ట్రాక్ చేసే సర్వైవలెన్స్ ప్లాట్‌ఫామ్. ఈ ప్రోమెడే చైనాలోని న్యుమోనియో వ్యాప్తి గురించి బయటి ప్రపంచానికి చెప్పింది. 2019లో చైనాలో పుట్టిన కరోనా గురించి ఈ ప్రోమెడ్ సంస్థనే మొదట బయటపెట్టింది. అయితే చైనాలో ప్రస్తుత న్యుమోనియా వ్యాధి ఎప్పుడు మొదలైందనే విషయం స్పష్టంగా తెలియదని ప్రోమెడ్ తెలిపింది. అయితే ఈ న్యుమోనియా కూడా మరో కరోనా మహమ్మారి మాదిరిగా మారుతుందా? లేదా అనేది కూడా ఇప్పుడే చెప్పలేమని వివరించింది. అయితే దీని కారణంగా మరోసారి కరోనా తరహా విలయం తప్పదేమోననే భయం కూడా పలువురిలో ఉంది.

Updated Date - 2023-11-23T11:07:08+05:30 IST