Donald Trump: డొనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడవుతారా? సర్వేలు ఏం చెబుతున్నాయంటే..?

ABN , First Publish Date - 2023-09-25T13:56:06+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉంది. కానీ అప్పుడే అమెరికాలో తదుపరి అధ్యక్షడు ఎవరనే సర్వేలు ఊపందుకున్నాయి.

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడవుతారా? సర్వేలు ఏం చెబుతున్నాయంటే..?

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉంది. కానీ అప్పుడే అమెరికాలో తదుపరి అధ్యక్షడు ఎవరనే సర్వేలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల వాషింగ్టన్ పోస్ట్, ఏబీసీ న్యూస్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కంటే ఎక్కువ మంది మద్దతు తెలపడం గమనార్హం. వీరిద్దరి మధ్య తేడా 51-42గా ఉంది. దీంతో బైడెన్ కంటే ట్రంప్‌నకు దాదాపు 10 శాతం మద్దతు ఎక్కువగా ఉంది. అటు రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థుల జాబితాలోనూ ట్రంప్ అందరికంటే ముందున్నారు. మిగతా వారు కూడా పోటీలో ఉన్నప్పటికీ ట్రంప్ వారికి అందనంత దూరంలో మెజారిటీ మద్దతుతో దూసుకుపోతున్నారు. అలాగే ఏబీసీ న్యూస్- వాషింగ్టన్ పోస్ట్ గతంలో నిర్వహించిన సర్వేతో పోలిస్తే బైడెన్‌కు మద్దతు తెలుపుతున్న వారి రేటు ఏకంగా 19 పాయింట్లు తగ్గింది.


ఏబీసీ న్యూస్- వాషింగ్టన్ పోస్ట్ సర్వే ప్రకారం.. అమెరికా ఆర్థిక వ్యవస్థతోపాటు ఇమ్మిగ్రేషన్ అంశాల నిర్వహణ విషయంలో గత సర్వేతో పోలిస్తే బైడెన్ రేటింగ్ తగ్గింది. ఆర్థిక అంశాల విషయంలో అయితే 30 శాతం మంది మాత్రమే బైడెన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఇక అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో ఇమ్మిగ్రేషన్ పరిష్కారం విషయంలో బైడెన్‌కు మద్దతు తెలుపుతున్న వారి సంఖ్య మరింత తక్కువగా ఉంది. కేవలం 23 శాతం మంది మాత్రమే ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. మొత్తంగా చూసిన జో బైడెన్‌కు 37 శాతం మంది మాత్రమే మద్దతు పలుకుతుండగా.. ఏకంగా 57 శాతం మంది వ్యతిరేకిస్తున్నారు. ఇక వయసు రీత్యా ఇద్దరు లీడర్ల విషయంలో సర్వేలో పాల్గొన్న వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. జో బైడెన్‌ను అయితే ఆయన వయసు రీత్యా ఏకంగా 74 శాతం మంది సమర్ధించలేకపోయారు. ప్రస్తుతం జో బైడెన్ వయసు 80 సంవత్సరాలు కాగా.. డొనాల్డ్ ట్రంప్ వయసు 77 సంవత్సరాలుగా ఉంది. ప్రభుత్వం షట్ డౌన్ విషయంలో కాంగ్రెస్‌లో జరిగిన అంశం పట్ల 40 శాతం మంది అధికార డెమోక్రాట్లదే తప్పని అభిప్రాయపడ్డారు. 33 శాతం మంది రిపబ్లికన్లది తప్పని చెప్పారు.

ఇక అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ పని తీరుపై 2021లో నిర్వహించిన సర్వేలో 38 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేశారు. కానీ తాజాగా ఆ సంఖ్య 48 శాతానికి పెరగడం విశేషం. అయినప్పటికీ ఇప్పటికీ 49 శాతం మంది ట్రంప్ పనితీరుపై అసంతృప్తిగానే ఉన్నారు. కానీ ప్రస్తుత జో బైడెన్ పని తీరుపై ఏకంగా 56 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందులో ఏకంగా 75 శాతం మంది తిరిగి ట్రంప్‌నకు ఓటు వేస్తామని చెబుతున్నారు. కానీ 2020 ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ట్రంప్ ఆరోపణల్ని మాత్రం చాలా మంది నమ్మడం లేదని సర్వేలో తేలింది. మొత్తంగా ఎన్నికల వరకు ఇదే ట్రెండ్ కొనసాగితే డొనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే అవకాశాలున్నాయి.

Updated Date - 2023-09-25T13:57:56+05:30 IST