Volodymyr Zelenskyy: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హత్యకు కుట్ర.. అడ్డంగా దొరికిన రష్యన్ ఇన్‌ఫార్మర్

ABN , First Publish Date - 2023-08-07T20:39:02+05:30 IST

గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై దండయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి.. ఆ దేశ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీని హతమార్చేందుకు రష్యా కుట్రలు పన్నింది. జెలెన్‌స్కీ మృతి ఉక్రెయిన్ దళాల ధైర్యాన్ని దెబ్బ తీస్తుందని..

Volodymyr Zelenskyy: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హత్యకు కుట్ర.. అడ్డంగా దొరికిన రష్యన్ ఇన్‌ఫార్మర్

గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై దండయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి.. ఆ దేశ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీని హతమార్చేందుకు రష్యా కుట్రలు పన్నింది. జెలెన్‌స్కీ మృతి ఉక్రెయిన్ దళాల ధైర్యాన్ని దెబ్బ తీస్తుందని, దాదాపు ఉక్రెయిన్ హస్తగతం అవుతుందన్న ఉద్దేశంతో.. ఆయన హత్యకు రష్యా కుట్రలు పన్నుతూ వస్తోంది. కానీ.. ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ ముందస్తు చర్యల కారణంగా, రష్యా ప్లాన్స్ ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి.

రీసెంట్‌గా కూడా ఇలాంటి ఒక ప్రయత్నాన్నే తాము భగ్నం చేసినట్లు ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసెస్ (ఎస్‌బీయూ) వెల్లడించింది. జెలెన్‌స్కీ ‘మైకోలైవ్‌’ పర్యటనకు వెళ్లినప్పుడు.. మాస్కో సైన్యం వైమానిక దాడులకు కుట్ర పన్నిందని, ఈ పథకం గురించి ముందే సమాచారం అందడంతో అదనపు భద్రతా చర్యలు తీసుకోవడం జరిగిందని ఎస్‌బీయూ తెలిపింది. అదే సమయంలో రష్యన్స్‌కు రహస్య సమాచారాన్ని అందిజేస్తున్న ఒక మహిళా రష్యన్ ఇన్‌ఫార్మర్‌ను కూడా తాము కస్టడీలోకి తీసుకున్న ఆ భద్రతా సంస్థ పేర్కొంది.


‘‘జులై చివరి వారంలో జెలెన్‌స్కీ మైకోలైవ్‌ పర్యటనకు వెళ్లారు. అయితే.. ఓ రష్యన్ ఇన్‌ఫార్మర్ ఈ పర్యటనకు సంబంధించిన వివరాల్ని సేకరించింది. అలాగే.. జెలెన్‌స్కీ రూట్‌ మ్యాప్‌లోని ప్రాంతాలు, సమయం వంటి సమగ్ర వివరాలతో ఒక జాబితాను రూపొందించేందుకు ప్రయత్నించారు. మా ఏజెంట్లకు ఈ విషయం తెలియడంతో, జెలెన్‌స్కీకి భద్రత పెంచారు’’ అంటూ ఆ భద్రతా సంస్థ ఒక ప్రకటనలో చెప్పుకొచ్చింది. కాగా.. ఆ రష్యన్‌ ఇన్‌ఫార్మర్‌ను మైకోలైవ్‌లోని ఓచకోవ్‌ నివాసిగా గుర్తించారు.

గతంలో ఇక్కడి ఓ మిలిటరీ స్టోర్‌లో ఆమె సేల్స్‌వుమన్‌గా పని చేసిందని తెలిసింది. మైకోలైవ్ ప్రాంతంలోని ఓచకివ్ పట్టణానికి సమీపంలో ఉన్న ఉక్రెయిన్ సైన్యం ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వ్యవస్థలు, మందుగుండు సామగ్రి నిల్వ కేంద్రాలను గుర్తించే పని కూడా ఆమెకి అప్పగించినట్లు గుర్తించినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఆమె చాలా చోట్ల పర్యటించి, ఫోటోలు తీసినట్లు వాళ్లు గుర్తించారు. ఆమె పేరు, ఇతర వివరాలు వెల్లడించలేదు కానీ, ప్రస్తుతం ఆమెని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు.

Updated Date - 2023-08-07T20:39:02+05:30 IST