Crimean Bridge: పుతిన్ డ్రీమ్ బ్రిడ్జ్‌ని కూల్చింది మేమే.. అంగీకరించిన ఉక్రెయిన్

ABN , First Publish Date - 2023-07-27T15:30:48+05:30 IST

గతేడాదిలో రష్యా-క్రిమియాని కలిపే కర్చ్ బ్రిడ్జ్‌పై భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో భాగంగా..

Crimean Bridge: పుతిన్ డ్రీమ్ బ్రిడ్జ్‌ని కూల్చింది మేమే.. అంగీకరించిన ఉక్రెయిన్

గతేడాదిలో రష్యా-క్రిమియాని కలిపే కర్చ్ బ్రిడ్జ్‌పై భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో భాగంగా.. పరస్పర దాడుల్లో 2022 అక్టోబర్ 8వ తేదీన ఈ బ్రిడ్జ్ కూలింది. ఆ సమయంలో ఈ బ్రిడ్జ్‌ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సందర్శించారు కూడా! ఇది ఉక్రెయిన్ పనేనని అప్పట్లో రష్యా ఆరోపించగా.. ఉక్రెయిన్ మాత్రం నోరు మెదపలేదు. ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించింది.

ఇప్పుడు ఇన్ని నెలలు గడిచిన తర్వాత.. ఆ వంతెనపై దాడి చేసింది తామేనంటూ ఉక్రెయిన్ అంగీకరించింది. ఈ దాడి గురించి ఉక్రెయిన్ నిఘా సంస్థ (SBU) చీఫ్ వాసిల్ మాల్యుక్ స్పందిస్తూ.. తాము ఎన్నో ఆపరేషన్స్‌తో పాటు కొన్ని స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహించామని, వాటిల్లో కొన్నింటిపై విజయం సాధించిన తర్వాత బహిరంగంగా చెప్పగలుగుతున్నామని అన్నారు. అలాంటి దాడుల్లో గతేడాది అక్టోబర్ 8వ తేదీన క్రిమియా బ్రిడ్జిపై దాడి చేసిన ఘటన ఒకటని పేర్కొన్నారు. అయితే.. తాము ఇతర ఆపరేషన్స్ గురించి మాత్రం చెప్పలేమని వ్యాఖ్యానించారు.


ఇదిలావుండగా.. 2014లో క్రిమియా ద్వీపాన్ని రష్యా స్వాధీనం చేసుకున్న తర్వాత 2018లో అక్షరాల 3 బిలియన్ డాలర్లు వెచ్చించి, కెర్చ్ జలసంధిపై రైలు, రోడ్డు వంతెనని నిర్మించింది. రవాణా, పౌర సరఫరాలకు ఎంతో కీలకంగా నిలిచిన ఈ వంతెనపై.. పుతిన్ 70వ పుట్టినరోజు చేసుకున్న మరుసటి రోజే ఉక్రెయిన్ దాడి చేసింది. ఆ వంతెనపై ట్రక్ బాంబ్ పేలడంతో.. పక్కనే రైలు మార్గంలో చమురు ట్యాంకర్లతో వెళ్తున్న రైలు కూడా మంటల్లో చిక్కుకుంది. ఈ దాడి తీవ్రత కారణంగా.. ఆ వంతెన కొంత భాగం కూలిపోయింది.

Updated Date - 2023-07-27T15:30:48+05:30 IST