Haldwani Eviction : రాత్రికి రాత్రే 50 వేల మందిని నిర్వాసితులను చేయలేం : సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2023-01-05T14:29:01+05:30 IST

ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పుపై అపీలును జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది.

Haldwani Eviction : రాత్రికి రాత్రే 50 వేల మందిని నిర్వాసితులను చేయలేం : సుప్రీంకోర్టు
Uttarakhand's Haldwani

న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లోని హల్‌ద్వానీలో రైల్వే స్థలాల ఆక్రమణలను తొలగించేందుకు చేపట్టిన ప్రయత్నాలను సుప్రీంకోర్టు (Supreme Court) గురువారం నిలిపేసింది. 50 వేల మందిని రాత్రికి రాత్రే ఖాళీ చేయించకూడదని, వారి కోసం ఆచరణ సాధ్యమైన ఏర్పాట్లు చేయాలని తెలిపింది. వీరందరికీ సంపూర్ణ పునరావాసం కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ భూముల్లో కొత్తగా ఎటువంటి నిర్మాణాలను చేపట్టరాదని స్పష్టం చేసింది.

ఉత్తరాఖండ్‌లోని హల్‌ద్వానీ (Haldwani)లో 29 ఎకరాల రైల్వే భూములను ఆక్రమించుకుని, దాదాపు 4,365 ఇళ్లు, కొన్ని మసీదులు, దేవాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను నిర్మించారు. వీటిలో సుమారు 50,000 మంది నివసిస్తున్నారు. ఈ ఆక్రమణలను తొలగించాలని 2013లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన ఉత్తరాఖండ్ హైకోర్టు 2022 డిసెంబరులో తీర్పు చెప్పింది. రైల్వే భూములను ఖాళీ చేయాలని తీర్పు చెప్పింది. దీంతో ఇక్కడ నివసిస్తున్నవారు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వీరికి కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఏఐఎంఐఎం పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. గతంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో జరిగిన నిరసనలతో హల్‌ద్వానీ నిరసనలను పోల్చుతున్నారు.

ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పుపై అపీలును జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ఏడు రోజుల్లో 50 వేల మందిని ఖాళీ చేయించరాదని పేర్కొంది. హైకోర్టు తీర్పు అమలును నిలిపేసింది. ఈ కేసులో చాలా అంశాలు ఉన్నాయని జస్టిస్ కౌల్ అన్నారు. ఇక్కడి ప్రజలు అనేక సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారన్నారు. ఇక్కడ ఎస్టాబ్లిష్‌మెంట్స్ కూడా ఉన్నాయని, ఏడు రోజుల్లో వీటన్నిటినీ తొలగించాలని ఎలా చెబుతారని ప్రశ్నించారు.

అడిషినల్ సొలిసిటర్ జనరల్ మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధి కోసం రైల్వే భూముల్లోని ఆక్రమణలను తొలగించడం చాలా ముఖ్యమని తెలిపారు. దీనిపై జస్టిస్ కౌల్ స్పందిస్తూ, రైల్వేల అవసరాలను గుర్తిస్తూనే, ఈ భూమిలో ఉన్నవారిలో ఎవరు అర్హులు? ఎవరు అర్హులు కాదు? ఇప్పటికే ఉన్న పునరావాస పథకాలు ఏమిటి? వంటివాటిపై ఆచరణ సాధ్యమైన ఏర్పాట్లు అవసరమని చెప్పారు. తదుపరి విచారణ ఫిబ్రవరి ఏడున జరుగుతుంది.

హైకోర్టు (Uttarakhand high court) ఆదేశాల ప్రకారం, రైల్వే భూముల నుంచి ఆక్రమణదారులను ఖాళీ చేయించే ప్రక్రియ జనవరి 10 నుంచి ప్రారంభం కావలసి ఉంది. ఇదిలావుండగా, ఉత్తరాఖండ్ (Uttarakhand) ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami) స్పందిస్తూ న్యాయస్థానం ఆదేశాల ప్రకారమే ప్రభుత్వం నడుచుకుంటుందని చెప్పారు.

Updated Date - 2023-01-05T14:29:04+05:30 IST