Nagaland, Meghalaya Polls: నాగాలాండ్‌లో 82 శాతం, మేఘాలయలో 75 శాతం పోలింగ్

ABN , First Publish Date - 2023-02-27T19:13:57+05:30 IST

నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో సోమవారంనాడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా...

Nagaland, Meghalaya Polls: నాగాలాండ్‌లో 82 శాతం, మేఘాలయలో  75 శాతం పోలింగ్

న్యూఢిల్లీ: నాగాలాండ్ (Nagaland), మేఘాలయ (Meghalaya) రాష్ట్రాల్లో సోమవారంనాడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల కమిషన్ సమాచారం ప్రకారం, సాయంత్రం 5 గంటల వరకూ నాగాలాండ్‌లో 81.94 శాతం పోలింగ్ నమోదైంది. మేఘాలయలో 74.32 శాతం నమోదైంది. పోలింగ్ సమయం ముగిసినా అప్పటికే క్యూలో ఉన్న వారికి తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ జరిగింది.

నాగాలాండ్‌లో...

నాగాలాండ్‌లో 60 అసెంబ్లీ స్థానాలకు గాను 59 స్థానాల్లో పోలింగ్ నిర్వహించారు. 183 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,291 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో మహిళలే పోలింగ్ సిబ్బందిగా 196 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, దివ్యాంగుల కోసం 10 పోలింగ్ స్టేషన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

మేఘాలయలో...

మేఘాలయలో సైతం 60 అసెంబ్లీ స్థానాలకు గాను 59 స్థానాల్లో పోలింగ్ నిర్వహించారు. అభ్యర్థులలో ఒకరు మరణించడంతో సోహియాంగ్ నియోజవర్గంలోని ఎన్నికలను వాయిదా వేశారు. 6,400 పోలింగ్ బూత్‌లను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. మొత్తం 369 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా, వీరిలో 36 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. కాగా, తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమబెంగాల్, జార్ఖాండ్‌లోని ఒక్కో స్థానానికి జరిగిన ఉప ఎన్నికకు కూడా సోమవారంనాడు పోలింగ్ జరిగింది.

Updated Date - 2023-02-27T19:13:58+05:30 IST