PM Modi: ప్లీజ్ మోదీజీ..! ప్రధాని మోదీకి జమ్మూ బాలిక రిక్వెస్ట్.. వైరల్‌గా మారిపోయిన వీడియో.. చిన్నారి ఏం కోరిందంటే..
ABN , First Publish Date - 2023-04-14T14:37:05+05:30 IST
సీరత్ నాజ్ జమ్మూ-కశ్మీరులోని కథువా జిల్లా, లోహాయ్-మల్హర్ గ్రామవాసి. తాను చదువుతున్న పాఠశాల దుస్థితిని వివరిస్తూ
జమ్మూ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)కి జమ్మూ-కశ్మీరు చిన్నారి సీరత్ నాజ్ (Seerat Naaz) పంపిన వీడియో సందేశం వైరల్ అవుతోంది. తాను చదువుతున్న పాఠశాల దుస్థితిని ఆమె వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. అపరిశుభ్రమైన వాతావరణంలో తన స్నేహితులతో కలిసి చదువుకోవలసిరావడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ పాఠశాలను చక్కదిద్దాలని మోదీని కోరిన తీరుకు ప్రశంసలు కురుస్తున్నాయి.
సీరత్ నాజ్ జమ్మూ-కశ్మీరులోని కథువా జిల్లా, లోహాయ్-మల్హర్ గ్రామవాసి. తాను చదువుతున్న పాఠశాల దుస్థితిని వివరిస్తూ ఓ వీడియోను చిత్రీకరించి, ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపించింది. ‘‘మోదీజీ, దయచేసి మంచి పాఠశాలగా తీర్చిదిద్దండి’’ అని కోరింది. ‘మార్మిక్ న్యూస్’ అనే ఫేస్‌బుక్ పేజ్ ఈ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోకు దాదాపు 20 లక్షల వ్యూస్ వచ్చాయి. 1,16,000 లైక్‌లు వచ్చాయి.
సీరత్ నాజ్ సుమారు ఐదు నిమిషాల నిడివిగల ఈ వీడియోలో మొదట తనను తాను పరిచయం చేసుకుంది. తాను స్థానిక ప్రభుత్వ హైస్కూల్‌లో చదువుతున్నట్లు తెలిపింది. ‘‘మోదీ గారూ, నేను మీకు ఓ విషయం చెప్పాలి’’ అని తెలిపింది. అనంతరం తాను చదువుతున్న పాఠశాల దుస్థితిని చిత్రీకరించింది. కాంక్రీట్ రాళ్లు తేలిన నేలను చూపించింది. ప్రిన్సిపాల్ కార్యాలయాన్ని, సిబ్బంది గదిని చూపించింది. నేల ఎంత మురికిగా ఉందో చూపించింది. విద్యార్థినీ, విద్యార్థులను ఆ మురికి కూపంలోనే కూర్చోబెడుతున్నారని చెప్పింది. పాఠశాల భవనం మొత్తం కలియదిరిగి చూపించింది. నిర్మాణం పూర్తి కానటువంటి ఓ భవనాన్ని కూడా చూపించింది. ఆ పాఠశాలను చక్కదిద్దడానికి అధికారులు చేయవలసినదానిని వివరించింది.
‘‘ఐదేళ్ల నుంచి శుభ్రపరచని భవనం ఎలా ఉందో చూడండి. ఈ భవనం లోపలి భాగాన్ని చూపిస్తాను రండి’’ అని చెప్తూ, ఆ భవనం లోపలి భాగాన్ని చిత్రీకరించింది. పాఠాలు వినేందుకు విద్యార్థినీ, విద్యార్థులు కూర్చునే చోటు ఎంత మురికిగా ఉందో కూడా చూపించింది. తమ కోసం ఓ మంచి పాఠశాలను నిర్మించాలని కోరింది. మురికి నేలపై కూర్చొనడం వల్ల తమ యూనిఫారాలు మురికి అయిపోతున్నాయని, తమ తల్లులు తమను తరచూ మందలిస్తున్నారని తెలిపింది. కూర్చొనడానికి తమకు బెంచీలు లేవని తెలిపింది. మొదటి అంతస్థులోని నడవ ఎంత అపరిశుభ్రంగా ఉందో చూపించింది.
‘‘మోదీ గారూ, దయచేసి మా పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచండి. దయచేసి నా వినతిని అమలు చేయండి’’ అని కోరింది. పాఠశాలలోని మరుగుదొడ్డి ఎంత చెత్తగా ఉందో కూడా చూపించింది. మూత్ర విసర్జన కోసం బహిరంగ స్థలాలకు వెళ్లవలసి వస్తోందని తెలిపింది.
‘‘మోదీ గారూ, మీరు యావత్తు దేశం చెప్పే మాటలను వింటారు. నా మాట కూడా వినండి. మా కోసం మంచి పాఠశాలను నిర్మించండి. మేము నేలపై కూర్చోవలసిన అవసరం లేని పాఠశాలను నిర్మించండి’’ అని కోరింది. తన యూనిఫాం మురికి అయినందుకు తన తల్లి తనను మందలించని, తామంతా బాగా చదువుకోవడానికి వీలయ్యేలా పాఠశాలను తీర్చిదిద్దాలని కోరింది. తమ కోసం ఓ మంచి పాఠశాలను నిర్మించాలని కోరింది.
ఇవి కూడా చదవండి :
America : దశాబ్దంలో అతి పెద్ద ఇంటెలిజెన్స్ లీక్.. 21 ఏళ్ళ యువకుడి అరెస్ట్..