Halal Tea : రైలులో హలాల్ టీ.. ప్రయాణికుడి ఆగ్రహం..

ABN , First Publish Date - 2023-07-22T15:39:07+05:30 IST

పవిత్రమైన శ్రావణ మాసంలో హలాల్ టీ ఇచ్చిన రైల్వే ఉద్యోగిపై ప్రయాణికుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను భక్తిశ్రద్ధలతో పూజ చేసుకోవలసి ఉందని, అటువంటి సమయంలో ఓ మతపరమైన సర్టిఫికేషన్ ఉన్న టీని ఏ విధంగా ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై ఆ ఉద్యోగి మాట్లాడుతూ, టీ శాకాహారమేనని ఆ ప్రయాణికునికి నచ్చజెప్పారు.

Halal Tea : రైలులో హలాల్ టీ.. ప్రయాణికుడి ఆగ్రహం..

న్యూఢిల్లీ : పవిత్రమైన శ్రావణ మాసంలో హలాల్ టీ ఇచ్చిన రైల్వే ఉద్యోగిపై ప్రయాణికుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను భక్తిశ్రద్ధలతో పూజ చేసుకోవలసి ఉందని, అటువంటి సమయంలో ఓ మతపరమైన సర్టిఫికేషన్ ఉన్న టీని ఏ విధంగా ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై ఆ ఉద్యోగి మాట్లాడుతూ, టీ శాకాహారమేనని ఆ ప్రయాణికునికి నచ్చజెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే కొందరు ఆ ప్రయాణికుడిని తప్పుబట్టారు.

రైల్వే ఉద్యోగితో ప్రయాణికుడు ఆగ్రహంతో మాట్లాడుతూ, పవిత్రమైన శ్రావణ మాసంలో హలాల్ సర్టిఫైడ్ టీ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. హలాల్ సర్టిఫైడ్ అంటే ఏమిటో వివరించాలని కోరారు. దాని గురించి తెలియాలని చెప్పారు. ‘‘మాకు ఐఎస్ఐ సర్టిఫికేట్ గురించి తెలుసు. హలాల్ సర్టిఫికేట్ అంటే ఏమిటి?’’ అని ప్రశ్నించారు.

దీనిపై రైల్వే సిబ్బంది స్పందిస్తూ, ‘‘ఇది మసాలా టీ ప్రీమిక్స్. ఇది నూటికి నూరు శాతం శాకాహారం’’ అని చెప్పారు.

ప్రయాణికుడు మాట్లాడుతూ, ‘‘అయితే హలాల్ సర్టిఫైడ్ అంటే ఏమిటి? ఈ టీ తాగిన తర్వాత నేను పూజ చేసుకోవాలి’’ అన్నారు.

రైల్వే సిబ్బంది మాట్లాడుతూ, ‘‘మీరు వీడియో చిత్రీకరిస్తున్నారా? ఇది నూటికి నూరు శాతం శాకాహార టీ, టీ అంటే శాకాహారమే, సార్’’ అని చెప్పారు.

ప్రయాణికుడు మాట్లాడుతూ, ‘‘నాకు మతపరమైన సర్టిఫికేషన్ అక్కర్లేదు. మా మనోభావాలను దృష్టిలో పెట్టుకోండి. అలా అయితే స్వస్తిక్ సర్టిఫికేట్ పెట్టండి’’ అన్నారు.

రైల్వే సిబ్బంది స్పందిస్తూ, దీనిని దృష్టిలో పెట్టుకుంటామని చెప్పారు.

ఈ వీడియో వైరల్ అవడంతో కొందరు యూజర్లు టీ ప్రీమిక్స్‌కు హలాల్ సర్టిఫికేషన్ ఎందుకు? అని అడిగారు. కొందరు యూజర్లు సహనంతో మాట్లాడిన రైల్వే సిబ్బందిని ప్రశంసించారు. మరికొందరు యూజర్లు స్వస్తిక్ సర్టిఫైడ్ టీ కావాలని కోరినందుకు ప్రయాణికుడిని ఎగతాళి చేశారు.

హలాల్ సర్టిఫికేషన్ అంటే ఏమిటి?

హలాల్ సర్టిఫికేషన్‌ను మొదట 1974లో మాంసం కోసం పరిచయం చేశారు. 1993 వరకు ఇది కేవలం మాంసం ఉత్పత్తులకు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఇది ఇతర ఆహారోత్పత్తులకు, కాస్మటిక్స్, మందులు మొదలైనవాటికి కూడా వర్తింపజేస్తున్నారు. అరబిక్‌లో హలాల్ అంటే అనుమతించదగినది అని అర్థం. హలాల్ సర్టిఫైడ్ అంటే ఇస్లామిక్ నియమాల ప్రకారం తయారు చేసిన ఆహారం అని అర్థం. కంఠం, కంఠనాళాలను నరికి చంపిన పశువు మాంసం హలాల్ మాంసం అవుతుంది. హలాల్ సర్టిఫికేషన్‌‌‌పై పూర్తిగా నిషేధం విధించాలని కోరుతూ 2022లో సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దేశంలోని 15 శాతం మంది వల్ల 85 శాతం మందికిగల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పిటిషనర్ ఆరోపించారు.

ఇవి కూడా చదవండి :

HD Kumaraswamy : కర్ణాటక ప్రయోజనాల కోసం జేడీఎస్ కీలక నిర్ణయం

Shiv Sena and BJP : మహారాష్ట్ర సీఎం షిండే ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. అజిత్ పవార్ చేరికతో ముసలం మొదలైందా?..

Updated Date - 2023-07-22T15:39:07+05:30 IST