Vande Bharat Express : వందే భారత్ రైలులో నాసిరకం ఆహారంపై ట్వీట్... ఆ తర్వాత...
ABN , First Publish Date - 2023-02-04T20:23:03+05:30 IST
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు (Vande Bharat Express train)లో సరఫరా చేస్తున్న ఆహారం సరైన ప్రమాణాలతో లేదని ఆరోపణలు వస్తున్నాయి.
హైదరాబాద్ : వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు (Vande Bharat Express train)లో సరఫరా చేస్తున్న ఆహారం సరైన ప్రమాణాలతో లేదని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై వెంటనే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) స్పందించింది. దిద్దుబాటు చర్యల కోసం సంబంధిత అధికారికి తెలియజేసినట్లు వెల్లడించింది.
సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఇటీవలే ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ రైలులో అల్పాహారం సక్రమంగా లేదని ఆరోపణలు వస్తున్నాయని రమేశ్ వైట్ల అనే పాత్రికేయుడు ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. 49 సెకండ్లపాటు ఉన్న ఓ వీడియోను జత చేశారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి ఈ రైలులో తీసుకున్న అల్పాహారాన్ని చూపించారు. వడ నుంచి పిండిన కొద్దీ నూనె కారుతోందని తెలిపారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న ఈ రైలులో ఈ సంఘటన జరిగినట్లు తెలిపారు. ప్రయాణికులు అల్పాహారం తినడానికి భయపడుతున్నారని పేర్కొన్నారు. ఆహార పదార్థాలు నాసిరకంగా ఉన్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారని తెలిపారు.
రైల్వే ప్రయాణికులకు సహకరించే అధికారిక అకౌంట్ రైల్వే సేవ (RailwaySeva) శనివారం స్పందిస్తూ, ‘‘సార్, డీఎం ద్వారా మీ మొబైల్ నెంబరు కోరుతున్నాం. సత్వర పరిష్కారం కోసం https://railmadad.indianrailways.gov.in లేదా ఫోన్ నెంబరు 139 ద్వారా నేరుగా మీరు మీ సమస్యను తెలియజేయవచ్చు’’నని పేర్కొంది.
రమేశ్ వైట్ల ట్వీట్‌కు చాలా మంది స్పందించారు. భారతీయ రైల్వేలలో సాధారణంగా ఆహారం నాణ్యంగా ఉండటం లేదని ఆరోపించారు.