Maharashtra political Crisis: షిండే పని అంతేనట... ఆదిత్య థాకరే సంచలన జోస్యం

ABN , First Publish Date - 2023-07-08T15:37:02+05:30 IST

మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఇవాళో, రేపో జరగబోతోందంటూ బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఉద్ధవ్ థాకరే వర్గం నేత ఆదిత్య థాకరే బాంబులాంటి కబురు చెప్పారు. ఏక్‌నాథ్ షిండే తో మొదలుపెట్టి ప్రభుత్వంలో భారీ మార్పులు జరగబోతున్నాయని ఆయన జోస్యం చెప్పారు. షిండే సీఎం పదవి ప్రమాదంలో పడిందన్నారు.

Maharashtra political Crisis:  షిండే పని అంతేనట... ఆదిత్య థాకరే సంచలన జోస్యం

ముంబై: మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఇవాళో, రేపో జరగబోతోందంటూ బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఉద్ధవ్ థాకరే వర్గం నేత ఆదిత్య థాకరే (Aditya Thackeray) బాంబులాంటి కబురు చెప్పారు. ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde)తో మొదలుపెట్టి ప్రభుత్వంలో భారీ మార్పులు జరగబోతున్నాయని ఆయన జోస్యం చెప్పారు. షిండే సీఎం పదవి ప్రమాదంలో పడిందన్నారు. ఆయనను రాజీనామా చేయమని కోరినట్టు తనకు సమాచారం ఉందని తెలిపారు. అజిత్ పవార్, 8 మంది ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు ఇటీవల ఆ పార్టీపై తిరుగుబాటు చేసి శివసేన-బీజేపీ ప్రభుత్వంలో చేరడం, మంత్రి కొలువులు దక్కించుకున్న నేపథ్యంలో ఆదిత్య థాకరే వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

''ముఖ్యమంత్రిని (ఏక్‌నాథ్ షిండే) రాజీనామా చేయమని అడిగినట్టు నాకు తెలిసింది. ప్రభుత్వంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది'' అని ఆదిత్య థాకరే మీడియాకు తెలిపారు. అజిత్ పవార్, ఆయన అనుచరులు ప్రభుత్వంలో చేరగానే మంత్రి పదవులు దక్కించుకోవడంపై షిండే వర్గం శివసేన నేతలు అసంతృప్తితో ఉన్నారన్న వార్తల నేపథ్యంలో ఆదిత్య వ్యాఖ్యలపై చర్చ మొదలైంది.

ఉద్ధవ్‌తో 20 మంది షిండే వర్గీయులు మంతనాలు?

ప్రభుత్వంలో అజిత్ పవార్ వర్గీయులు చేరడంతో షిండే వర్గానికి చెందిన సుమారు 20 మంది ఎమ్మెల్యేలు ఉద్ధవ్ థాకరే (యూబీటీ)తో మంతనాలు జరుపుతున్నారని థాకరే వర్గం ఎంపీ సంజయ్ రౌత్ ఇటీవల వెల్లడించారు.

ఆ ఆలోచన లేదన్న షిండే

కాగా, సీఎం పదవి నుంచి తప్పుకునే ఆలోచన ఏదీ లేదని, ఎన్‌సీపీ నేతల విషయంలో శివసేనలో ఎలాంటి తిరుగుబాటు లేదని ఏక్‌నాథ్ షిండే తెలిపారు. ఈ విషయాన్ని శివసేన నేత ఉదయ్ సావంత్ సైతం బలపరచారు. షిండే నాయకత్వం ప్రతి ఒక్కరినీ పరిగణనలోకి తీసుకుంటోందని, ఏక్‌నాథ్ షిండేపై ఎమ్మెల్యేలు, ఎంపీలంతా విశ్వాసం వ్యక్తం చేశారని, షిండే రాజీనామా చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని సావంత్ చెప్పారు.

Updated Date - 2023-07-08T15:58:44+05:30 IST