Sanjay Singh Arrest: 15 నెలల్లో 1000 ప్రాంతాల్లో దాడులు.. ఎంపీ అరెస్టుపై ఆప్, కాంగ్రెస్ ఫైర్
ABN , First Publish Date - 2023-10-04T18:59:09+05:30 IST
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్‌ను ఈడీ అరెస్టు చేయడంపై ఆప్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీపై విరుచుకుపడ్డాయి. పదిహేను నెలలుగా ఈడీ, సీబీలను ఉసిగొలపడం, అరెస్టులు చేయడం రివాజుగా మారినట్టు ఆరోపించాయి.
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ (Delhi Liquior policy scam)లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ సంజయ్ సింగ్ (Sanjay Singh)ను ఈడీ (ED) అరెస్టు చేయడంపై ఆప్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీపై విరుచుకుపడ్డాయి. గత పదిహేను నెలలుగా ఆప్ వర్కర్లపై ఆరోపణలు చేయడం, విచారణ పేరుతో 1000 ప్రాంతాల్లో ఈడీ, సీబీఐలతో దాడులు చేయడం పరిపాటైందని, ఈ దాడుల్లో కనీసం ఒక్క పైసా కూడా దొరక్కపోవడం బీజేపీకి ఆశాభంగమైందని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా విమర్శించారు. కాగా, ఇదేమిటని ప్రశ్నించిన వాళ్లను కటకటాల వెనక్కి పంపడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని కాంగ్రెస్ పార్టీ మండిపడింది.
అసలు స్కామ్ అనేదే లేదు..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ పేరుతో బీజేపీ గత పదిహేను నెలలుగా ఆప్ నేతలపై ఆరోపణలు చేయడం, విచారణ పేరుతో 1000కు ప్రాంతాల్లో ఈడీ, సీబీఐ దాడులు జరపడం జరిగిందని, ఈ దాడుల్లో ఏ ఒక్క ఏజెన్సీ కూడా ఒక్క రూపాయి కూడా కనుగొనలేకపోయిందని రాఘవ్ చద్దా అన్నారు. దీంతో ఆశాభంగానికి గురైన బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతో తమ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఇంటిపై దాడులకు దిగందని ఆన్నారు. ''నేను చాలా స్పష్టంగా చెబుతున్నాను. ఈడీకి ఒక్క పైసా కూడా దొరకలేదు. ఎలాంటి ఆధారాలు కూడా లభ్యం కాలేదు. అసలు స్కామ్ అనేదే జరగలేదనడానికి ఇంతకంటే ఆధారాలు ఏమి కావాలి?'' అని రాఘవ్ చద్దా మీడియా మాట్లాడుతూ అన్నారు.
అరెస్టులు...జైలుకు పంపడం బీజేపీకి పరిపాటైంది..
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టును కాంగ్రెస్ నేత మీమ్ అఫ్జల్ ఖండించారు. ఈ అరెస్టులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పరిపాటుగా మారిందన్నారు. ప్రశ్నించిన వారిని కటకటాల వెనక్కి పంపుతున్నారని విమర్శించారు. సంజయ్ సింగ్ అరెస్టు తనకు ఆశ్చర్యం కలిగించలేదని చెప్పారు. పార్లమెంటు లోపల, వెలుపల సంజయ్ సింగ్ మాట్లాడటం, మోదీని, ఇతర నేతలను సవాలు చేస్తూ ఆయన బహిరంగంగంగానే విమర్శలు చేస్తుండటంతో ఆయన అరెస్టు అనివార్యం అయిందన్నారు. బీజేపీకి ఇది రివాజుగా మారిందన్నారు.
ఇక కేజ్రీవాల్ వంతే...!
ఢిల్లీ లిక్కర్ కేసులో సంజయ్ సింగ్ అరెస్టుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ మాట్లాడుతూ, నిజాన్ని దాచలేరనేది ఆప్ ఎంపీ అరెస్టుతో రుజువైందని, సంజయ్ సింగ్ తర్వాత అరవింద్ కేజ్రీవాలేనని ఆయన వ్యాఖ్యానించారు.