I.N.D.I.A : ప్రతిపక్ష ఇండియా కూటమిలో తెరపైకి మరో ప్రధానమంత్రి అభ్యర్థి
ABN , First Publish Date - 2023-08-30T11:30:58+05:30 IST
బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ చొరవతో ప్రారంభమైన ప్రతిపక్ష కూటమిలో ప్రధాన మంత్రి అభ్యర్థులు పెరిగిపోతున్నారు. పాట్నా, బెంగళూరు తర్వాత ముచ్చటగా మూడోసారి ముంబైలో సమావేశమవబోతున్న ఈ పార్టీల నేతలు తమ అధినేత ఆ పదవికి తగినవారని ప్రకటనలు ఇస్తున్నారు.
న్యూఢిల్లీ : బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ చొరవతో ప్రారంభమైన ప్రతిపక్ష కూటమిలో ప్రధాన మంత్రి అభ్యర్థులు పెరిగిపోతున్నారు. పాట్నా, బెంగళూరు తర్వాత ముచ్చటగా మూడోసారి ముంబైలో సమావేశమవబోతున్న ఈ పార్టీల నేతలు తమ అధినేత ఆ పదవికి తగినవారని ప్రకటనలు ఇస్తున్నారు. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ మాట్లాడుతూ అరవింద్ కేజ్రీవాల్ ఈ కూటమికి సారథ్యం వహించాలన్నారు.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఓడించాలనే లక్ష్యంతో 26 ప్రతిపక్ష పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ కూటమి తదుపరి సమావేశాలు గురు, శుక్రవారాల్లో ముంబైలో జరుగుతాయి. ఈ సమావేశాల్లో కూటమి లోగో, సమన్వయ కమిటీ నియామకం వంటి అంశాలపై చర్చ జరుగుతుందని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ బుధవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రజల సమస్యలను నిరంతరం లేవనెత్తుతున్నారని చెప్పారు. ఆయన అమలు చేస్తున్న విధానాల వల్ల ఢిల్లీలో ద్రవ్యోల్బణం తక్కువగా ఉందన్నారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నప్పటికీ, కేజ్రీవాల్ లాభదాయక బడ్జెట్‌ను సమర్పించారని చెప్పారు. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులను వారి కోసమే ఖర్చు చేసినట్లు తెలిపారు. అయితే ఇండియా కూటమి నేతను నిర్ణయించేది తాను కాదన్నారు.
కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను సిలిండర్‌కు రూ.200 చొప్పున తగ్గించడం గురించి మాట్లాడుతూ, ఇండియా కూటమి పాట్నా, బెంగళూరు సమావేశాల తర్వాత ఈ ధరలు తగ్గాయని, మూడో సమావేశం తర్వాత పెట్రోలు, డీజిల్ ధరలు కూడా తగ్గుతాయన్నారు.
ఇదిలావుండగా, ప్రధాన మంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ సరైనవారని రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, భూపేశ్ బాఘెల్ ప్రకటించారు. టీఎంసీ నేతలు మాట్లాడుతూ, ఆ పదవికి తగినవారు మమత బెనర్జీ అంటున్నారు. నితీశ్ కుమార్‌కు అటువంటి ఆలోచన లేదని జేడీయూ నేతలు చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి :
BJP : యోగి ఆదిత్యనాథ్‌పై వరుణ్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు