Maratha quota row: కోటా అమలుపై ఉద్యమం ఉధృతం.. మనోజ్ జారంగే అల్టిమేటం
ABN , First Publish Date - 2023-10-14T16:58:23+05:30 IST
మరాఠా రిజర్వేషన్ పోరాట కార్యకర్త మనోజ్ జారంగే తమ పోరాటాన్ని ఉధృతం చేయనున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని శనివారంనాడు హెచ్చరించారు. మరాఠా కమ్యూనిటీకి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలనే తమ డిమాండ్‌ను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన పక్షంలో అక్టోబర్ 24 నుంచి తమ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేయనున్నట్టు ప్రకటించారు.
ముంబై: మరాఠా రిజర్వేషన్ (Maratha quota) పోరాట కార్యకర్త మనోజ్ జారంగే (Manoj Jarange) తమ పోరాటాన్ని ఉధృతం చేయనున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని శనివారంనాడు హెచ్చరించారు. మరాఠా కమ్యూనిటీకి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలనే తమ డిమాండ్‌ను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన పక్షంలో అక్టోబర్ 24 నుంచి తమ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేయనున్నట్టు జారంగే ప్రకటించారు. 40 రోజుల్లోగా మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్ల అమలు చేయాలంటూ జారంగే ఇంతకుముందు గడువు విధించారు.
అంత్రక్రియల ఊరేగింపో..విజయోత్సవాలో...
జల్నా జిల్లాలోని అంతర్వాలి సరటి గ్రామంలో పెద్దసంఖ్యలో హాజరైన తన మద్దతుదారులను ఉద్దేశించి జారంగే మాట్లాడుతూ, అక్టోబర్ 24 తర్వాత తన అంత్యక్రియల ఊరేగింపు లేదా కమ్యూనిటీ విజయోత్సవాలు జరగాలని అన్నారు. జారంగే డిమాండ్లను పరిష్కరిస్తామంటూ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే హామీ ఇవ్వడంతో సెప్టెంబర్ 14న జారంగే తన నిరాహార దీక్షను ఉపసంహరించుకున్నారు. అయితే, దీక్షా స్థలిని విడిచిపెట్టేది లేదని ఆయన అప్పట్లో ప్రకటించారు.
కుంబి సర్టిఫికెట్లు ఇవ్వాలి...
రాష్ట్రవ్యాప్తంగా మరాఠీలకు కుంబి (kunbi) సర్టిఫికెట్లు ఇవ్వాలని, ఓబీసీ కేటగిరి కింద కుంబీలు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందాలని జారంగే డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించకుంటే అక్టోబర్ 22న తదుపరి కార్యాచరణపై కమ్యూనిటీ సభ్యులతో మాట్లాడతానని, అంతవరకూ తన మద్దతుదారులు ప్రశాంతంగా, ఎలాంటి నిరసనలు చేపట్టకుండా ఉండాలని కోరారు.
ఏడు కోట్ల వసూళ్లా?
శనివారంనాటి నిరసన కార్యక్రమం కోసం రూ.7 కోట్లు సేకరించారంటూ ఎన్‌సీపీ నేత ఛగన్ భుజ్‌బల్ చేసిన ఆరోపణలను జారంగే తిప్పికొట్టారు. మరాఠీ కమ్యూనిటీ మాత్రమే నిరసనకు మద్దతు తెలుపుతోందని, వారికి వారే ఈ సమావేశం కోసం రూ.21 లక్షలు సమకూర్చుకున్నారని చెప్పారు. మరాఠా కమ్యూనిటీని రెచ్చగొట్టేందుకు భుజ్‌బల్, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, న్యాయవాది గుణ్‌రతన్ సదావర్తే ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. విభజన ఎత్తుగడుల ఉచ్చులో పడకుండా తన మద్దతుదారులంతా ఐక్యంగా ఉండాలని కోరారు.
ప్రధానికి విజ్ఞప్తి...
మరాఠా ప్రజలకు రిజర్వేషన్ అంశంపై వివేకం మేలుకోవాలని, ఈ దిశగా ఫడ్నవిస్‌కు ఒక మాట చెప్పాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాకు జారంగే విజ్ఞప్తి చేశారు. ఫడ్నవిస్‌కు మహారాష్ట్ర కమ్యూనిటీ ఎంతో చేసిందని గుర్తు చేశారు. తన ఫేస్‌బుక్ అకౌంట్ సైతం రెండు గంటలు అందుబాటులో లేకపోవడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. మరాఠా రిజర్వేషన్లకు మార్గం సుగమం చేస్తూ ఎందుకు సర్వే చేపట్టడం లేదని కూడా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని జారంగే నిలదీశారు.