Rahul on Adani Group: అదానీ గ్రూప్ బొగ్గు దిగుమతులపై నిప్పులు చెరిగిన రాహుల్
ABN , First Publish Date - 2023-10-18T15:00:06+05:30 IST
అదానీ గ్రూప్‌పై మళ్లీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. బొగ్గు దిగుమతుల్లో ఓవర్ ఇన్వాయిసింగ్ వల్ల విద్యుత్ ధరలు అమాంతం పెరిగిపోయాయని, ఈ ప్రక్రియలో రూ.12,000 కోట్ల ప్రజాధనాన్ని అదానీ గ్రూప్ లూటీ చేసిందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి తక్షణం దర్యాప్తునకు ఆదేశించి మిస్టర్ క్లీన్ అనిపించుకోవాలని అన్నారు.
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ (Adani Group)పై మళ్లీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) నిప్పులు చెరిగారు. బొగ్గు దిగుమతుల్లో (Coal imports) ఓవర్ ఇన్వాయిసింగ్ వల్ల విద్యుత్ ధరలు అమాంతం పెరిగిపోయాయని, ఈ ప్రక్రియలో రూ.12,000 కోట్ల ప్రజాధనాన్ని అదానీ గ్రూప్ లూటీ చేసిందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి తక్షణం దర్యాప్తునకు ఆదేశించి మిస్టర్ క్లీన్ అనిపించుకోవాలని, తమ విశ్వసనీయతను నిరూపించుకోవాలని రాహుల్ డిమాండ్ చేశారు. బుధవారంనాడిక్కడ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ సంచలన ఆరోపణలు చేశారు.
''ఈ అంశంపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు? నేను కేవలం ప్రధానికి సాయపడుతున్నాను. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించి తమ విశ్వసనీయతను నిరూపించుకోవాలని కోరుతున్నాను'' అని రాహుల్ అన్నారు. ఇందుకు ఆధారంగా 'ఫైనాన్సియల్ టైమ్స్' ఇటీవల రాసిన ఓ వార్తా కథనాన్ని మీడియాకు చూపించారు. మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ ధరకు బిలియన్ డాలర్ల బొగ్గును అదానీ గ్రూప్ దిగుమతి చేసుకున్నట్టు కనిపిస్తోందంటూ ఆ కథనం పేర్కొంది. అద్వానీ ఓవర్ ఇన్వాయిస్‌డ్ బొగ్గు దిగుమతుల వల్ల రూ.12,000 కోట్ల మేరకు ప్రజల జేబులు గుల్లయ్యాయని అన్నారు. ఇండోనేసియా నుంచి అదానీ బొగ్గు కొనుగోలు చేశారని, అది ఇండియాకు చేరే సరికి ధర రెట్టింపయిందని నివేదికను ఉటంకిస్తూ రాహుల్ ఆరోపించారు. బొగ్గు ఓవర్ ఇన్వాయిసింగ్ వల్ల దేశంలోని విద్యుత్ రేట్లపై ఆ ప్రభావం పడిందని, దీంతో వినియోగదారులు హెచ్చు విద్యుత్ ధరలు చెల్లించాల్సి వచ్చిందని అన్నారు. ఇది ప్రత్యక్ష దోపిడీ అని, ప్రపంచంలో ఏ ప్రభుత్వమైన దీనిపై చర్యలు తీసుకుంటుందని, కానీ ఇండియాలో మాత్రం ఎలాంటి చర్యలు లేవని ఆయన తప్పుపట్టారు.
''అదానీకి ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తోంది. ఆయన వెనుక ఏ శక్తి ఉందో అందరికీ తెలుసు'' అని రాహుల్ విమర్శలు గుప్పించారు. స్టాక్ ప్రైజ్ మానిప్యులేషన్‌కు పాల్పడుతున్నారంటూ అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేసినప్పుడు కూడా తాను ప్రశ్నించానని చెప్పారు. కాగా, హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలను అప్పట్లో అదానీ గ్రూప్ ఖండించింది. ఎలాంటి తప్పిదాలకు తాము పాల్పడలేదని ప్రకటించింది. అయితే, రాహుల్ గాంధీ చేసిన తాజా ఆరోపణలపై మాత్రం ఇంకా అదానీ గ్రూప్ స్పందించలేదు.