Assembly polls: అక్రమంగా తరలిస్తున్న రూ. కోటి నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు
ABN , First Publish Date - 2023-04-13T22:50:02+05:30 IST
పోలీసుల తనిఖీల్లో ఎన్నికలకు ముందు కోటి రూపాయల నగదు పట్టుబడింది.
బెంగళూరు: వచ్చే నెలలో కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు (Karnataka Assembly Elections) జరగనున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు తాయిలాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో ఎన్నికలకు ముందు కోటి రూపాయల నగదు పట్టుబడింది. బెంగళూరు సిటీ మార్కెట్ ప్రాంతంలో రూ. 1 కోటి నగదును గురువారం బెంగళూరు పోలీసులు (Bengaluru Police) స్వాధీనం చేసుకున్నారు.
నగదు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు సురేష్, ప్రవీణ్‌లను పోలీసులు విచారించగా నగదును ఓ ప్రైవేట్ కంపెనీకి చెందినదని, తాము విజయనగర్ నుంచి జయనగర్‌కు వెళ్తున్నామని పోలీసులకు తెలిపారు. అయితే నగదుకు సంబంధించిన పత్రాలను చూపించాలని పోలీసులు గట్టిగా అడగడంతో నిందితులు తడబడ్డారు. దీంతో పోలీసులు నగదును స్వాధీనం చేసుకుని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమాచారం అందించారు. కర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మే 13న ఫలితాలు వెలువడనున్నాయి.