AIADMK: రద్దయిన అన్నాడీఎంకే కార్యనిర్వాహక మండలి సమావేశం.. కారణమేంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-04-05T09:22:18+05:30 IST

ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే ఈ నెల 7న జరుపదలచిన కార్యనిర్వాహక మండలి సమావేశం ఆకస్మికంగా రద్దయ్యింది.

AIADMK: రద్దయిన అన్నాడీఎంకే కార్యనిర్వాహక మండలి సమావేశం.. కారణమేంటో తెలిస్తే..

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే ఈ నెల 7న జరుపదలచిన కార్యనిర్వాహక మండలి సమావేశం ఆకస్మికంగా రద్దయ్యింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) మంగళవారం ఓ ప్రకటన జారీ చేశారు. అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్‌ తమిళ్‌మగన్‌ హుసేన్‌ అధ్యక్షతన పార్టీ కార్యనిర్వాహక మండలి సమావేశం జరిపి పార్టీ ఏడో ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి పళనిస్వామి ఎంపికను ఆ సమావేశంలో ఆమోదించాలని పార్టీ సీనియర్‌ నేతలు నిర్ణయించారు. అదే సమయంలో అసమ్మతివర్గం నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం(Former Chief Minister O. Panneerselvam) అప్పీలుపై విచారణను హైకోర్టు ధర్మాసనం ఈ నెల 22 వరకు వాయిదా వేసింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఈపీఎస్‌ ఎన్నికపై స్టే విధించేందుకు నిరాకరించటంతోపాటు, పార్టీలో ఆయనకు ఉపశమనం కలిగించే రీతిలో ఏదైనా పదవిని అప్పగించాలని ఆదేశాలివ్వడానికి కూడా ధర్మాసనం నిరాకరించింది. ఈ కేసు విచారణ పూర్తయిన తర్వాత కార్యనిర్వాహక మండలి సమావేశం జరిపితే సమంజసంగా ఉంటుందని ఈపీఎస్‌, సహా నాయకులు భావిస్తున్నారు. ఈ కారణాల వల్లే కార్యనిర్వాహక మండలి సమావేశాన్ని ఆకస్మికంగా రద్దు చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనల ప్రకారం గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీలు యేడాదికి రెండుసార్లు కార్యనిర్వాహక మండలి సమావేశాలు జరపాల్సి ఉంటుంది. గత యేడాది జూలైలో పార్టీ కార్యనిర్వాహక మండలి సమావేశం జరిగింది. ఈ యేడాది జనవరిలో మళ్ళీ ఈ సమావేశం నిర్వహించాలనుకున్నారు. ఆ తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈపీఎస్‏ను ఎన్నుకునేందుకు ఎన్నికల ప్రక్రియ, ఓపీఎస్‌ అప్పీలుపై హైకోర్టు విచారణ తదితర కారణాల వల్ల ఈ నెల 7న ఆ సమావేశాన్ని జరిపేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఓపీఎస్‌ అప్పీలుపై హైకోర్టు ధర్మాసనం ఈ నెల 22న తుది విచారణ జరిపి తీర్పువెలువరించనుండటంతో కార్యనిర్వాహక మండలిని రద్దు చేశారు.

నేడు సభ్యత్వానికి దరఖాస్తుల పంపిణీ...

అన్నాడీఎంకేలో కొత్త సభ్యత్వానికి దరఖాస్తుల పంపిణీ బుధవారం ప్రారంభమవుతుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు. పార్టీలో చేరదలచినవారు ఒక్కో దరఖాస్తుకు రూ.10 రుసుముగా చెల్లించాలని తెలిపారు. ఒక దరఖాస్తును ఉపయోగించి 25 మందిని సభ్యులుగా చేర్పించవచ్చునని, దరఖాస్తుతోపాటు పేరు, పుట్టిన తేదీ, చిరునామా, ఆధార్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డు తదితర వివరాలకు సంబంధించిన నకళ్లను కూడా జత చేయాలని పేర్కొన్నారు.

Updated Date - 2023-04-05T09:22:18+05:30 IST