AIADMK: మాజీసీఎం వ్యూహ రచన.. పీఎంకే, డీఎండీకే వైపు అన్నాడీఎంకే చూపు.. అదేగాని జరిగితే అధికారపార్టీకి ఇక చుక్కలు..
ABN , First Publish Date - 2023-10-01T08:17:07+05:30 IST
ఇన్నాళ్లూ బీజేపీతో జతకట్టి పలు పార్టీలకు దూరమైన అన్నాడీఎంకే(AIADMK).. ఇప్పుడు వాటిని దరి చేర్చుకునేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది.
చెన్నై, (ఆంధ్రజ్యోతి): ఇన్నాళ్లూ బీజేపీతో జతకట్టి పలు పార్టీలకు దూరమైన అన్నాడీఎంకే(AIADMK).. ఇప్పుడు వాటిని దరి చేర్చుకునేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. అధికార డీఎంకే కూటమిని ఎదుర్కోవాలంటే తమకూ గట్టి మద్దతు ఉండాలని భావిస్తున్న అన్నాడీంకే.. ఈ మేరకు చర్యలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా అధికారపక్షానికి దూరంగా ఉంటున్న డీఎండీకే, పీఎంకే(DMDK, PMK) వంటి పార్టీలను దరి చేర్చుకునేందుకు సిద్ధమైంది. ఆయా పార్టీలతో చర్చించాలని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తన సహచరులను పురమాయించారు. వన్నియార్ల ఓటు బ్యాంకు కలిగిన పీఎంకేని కూటమిలో చేర్చేందుకు పావులు కదుపుతున్నారు. తమ అధినేత ఈపీఎస్ ఆదేశాల మేరకు పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్ రాందాస్తో అన్నాడీఎంకే సీనియర్ నేతలు, మాజీ మంత్రులు రహస్య మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విధంగా కెప్టెన్ విజయకాంత్ నాయకత్వంలోని డీఎండీకేని కూడా కూటమిలో స్థానం కల్పించాలని ఈపీఎస్ నిర్ణయించారు.
ప్రస్తుతం డీఎండీకే వ్యవహారాలన్నీ నిర్వర్తిస్తున్న ఆ పార్టీ కోశాధికారి ప్రేమలత కూడా అన్నాడీఎంకే కూటమిలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వర్గాలు చెబుతున్నాయి. తమ కూటమిలో చేరితే అడిగినన్ని స్థానాలు ఇవ్వడంతో పాటు ఎన్నికల్లో ఆర్థికపరమైన అండదండలు కూడా అందిస్తామని అన్నాడీఎంకే పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో ఆ రెండు పార్టీలు ఈ వ్యవహారంపై సీరియ్‌సగానే యోచిస్తున్నట్లు సమాచారం. బీజేపీతో తెగదెంపులు చేసుకోవడంతో ప్రస్తుతం అన్నాడీఎంకే కూటమిలో తమిళ మానిల కాంగ్రెస్, పుదియ తమిళగం, తమిళగ మక్కల్ మున్నేట్రకళగం, పురట్చి భారతం వంటి చిన్నాచితకా పార్టీలే మిగిలాయి. ఆ పార్టీలు కూడా అన్నాడీఎంకే కూటమిలో ఉండాలా? లేక బీజేపీతో కత కట్టాలా అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అందుకే ప్రజల్లో మెరుగైన బలమున్న పార్టీలను దరి చేర్చుకోవాలని ఈపీఎస్ యోచిస్తున్నారు. నిజానికి పీఎంకే, డీఎండీకే గతంలోనూ అన్నాడీఎంకేతో కలిసి ఎన్నికలను ఎదుర్కొన్నాయి. అందువల్ల పాతమిత్రులు తమను అర్థం చేసుకుని, తమతో చేతులు కలుపుతారని ఈపీఎస్ భావిస్తున్నారు. అందుకే బీజేపీతో కటీఫ్ చెప్పగానే ఈ రెండు పార్టీల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే దీనిపై ఒక స్పష్టత వస్తుందని అన్నాడీఎంకే వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.