Air India Pee Gate: శంకర్ మిశ్రాపై నాలుగు నెలల నిషేధం విధించిన ఎయిర్ ఇండియా

ABN , First Publish Date - 2023-01-19T18:01:17+05:30 IST

న్యూయార్క్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా (Air India) విమానంలో సహ ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న

Air India Pee Gate: శంకర్ మిశ్రాపై నాలుగు నెలల నిషేధం విధించిన ఎయిర్ ఇండియా

న్యూఢిల్లీ: న్యూయార్క్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా (Air India) విమానంలో సహ ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర్ మిశ్రా(Shankar Mishra)పై ఎయిర్ ఇండియా నాలుగు నెలల నిషేధం విధించింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే జరిపిన అంతర్గత విచారణ నివేదికను కూడా సమర్పించినట్టు తెలుస్తోంది. ఎయిర్ ఇండియా విధించిన నిషేధాన్ని ఇతర విమానయాన సంస్థలు కూడా పాటించాల్సి ఉంటుంది.

ఈ ఘటనపై ఇప్పటికే ఢిల్లీ పోలీస్ స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత పరారైన శంకర్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు ఈ నెల 7న బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై తొలుత పెదవి విప్పిన శంకర్ మిశ్రా.. బాధిత మహిళకు తాను పరిహారం చెల్లించానని, సమస్య ముగిసిపోయిందని పేర్కొన్నాడు. అయితే, ఆ తర్వాత కోర్టు విచారణలో మాత్రం తాను మూత్ర విసర్జన చేయలేదని, ఆ పెద్దావిడే మూత్రాన్ని ఆపుకోలేక తనంత తానే పోసుకుందని తీవ్ర ఆరోపణలు చేశాడు. మిశ్రా వ్యాఖ్యలపై బాధిత మహిళ తీవ్రస్థాయిలో స్పందించింది. చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెందాల్సింది పోయి తిరిగి ఇలాంటి ఆరోపణలు చేయడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

శంకర్ మిశ్రా తనపై మూత్ర విసర్జన చేసిన విషయాన్ని బాధితురాలు టాటా గ్రూప్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ దృష్టికి లేఖ ద్వారా తీసుకెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంలో విమాన సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా కూడా వ్యవహరించారని ఆమె ఆ లేఖలో ఆరోపించారు.

Updated Date - 2023-01-19T18:01:23+05:30 IST