Ajit approaches Ec: పార్టీ మాదేనంటూ ఈసీని ఆశ్రయించిన అజిత్ వర్గం

ABN , First Publish Date - 2023-07-05T16:30:40+05:30 IST

మహారాష్ట్రలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చెలరేగిన కల్లోలం మరో మలుపు తిరిగింది.తనకు 35 మంది ఎమ్మెల్యేల బలం ఉందంటూ అజిత్ పవార్ ఎన్నికల కమిషన్‌‌ను ఆశ్రయించారు. నిజమైన ఎన్‌సీపీ, ఆ పార్టీ గుర్తు తమదేనని ఈసీకి దాఖలు చేసిన పిటిషన్‌లో అజిత్ పవార్ క్లెయిమ్ చేశారు.

Ajit approaches Ec: పార్టీ మాదేనంటూ ఈసీని ఆశ్రయించిన అజిత్ వర్గం

ముంబై: మహారాష్ట్రలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో చెలరేగిన కల్లోలం బుధవారంనాడు పతాక స్థాయికి చేరుకుంది. పార్టీ ఎమ్మెల్యేలతో ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar), చీలక వర్గం నేత అజిత్ పవార్ (Ajit Pawar) వేర్వేరుగా సమావేశం ఏర్పాటు చేసి బలప్రదర్శనకు దిగారు. ఎమ్మెల్యేలతో సమావేశమైన వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా తనకున్న ఎమ్మెల్యేల బలంతో అజిత్ పవార్ ఎన్నికల కమిషన్‌‌ను (Election commission of India) ఆశ్రయించారు. నిజమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ గుర్తు తమదేనని ఈసీకి దాఖలు చేసిన పిటిషన్‌లో అజిత్ పవార్ క్లెయిమ్ చేశారు. మొత్తం 53 మంది ఎమ్మెల్యేలలో 35 మంది ఎమ్మెల్యేల బలం తనకుందని ఈసీ దృష్టికి తెచ్చారు.

అజిత్ పవార్ పిటిషన్ అందింది: ఈసీ

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పేరు, గుర్తు తమవేనని క్లెయిమ్ చేస్తూ అజిత్ పవార్ వేసిన పిటిషన్ భారత ఎన్నికల సంఘానికి అందినట్టు ఈసీ వర్గాలు తెలిపాయి. 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత ప్రక్రియను ప్రారంభించినట్టు జయంత్ పాటిల్ నుంచి కేవియట్ కూడా అందిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

పవార్‌జీ...ఇక చాలించండి..!

దీనికి ముందు, పార్టీ ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో శరద్‌ పవార్‌పై అజిత్ పవార్ ఘాటు విమర్శలకు దిగారు. ''మీరు (శరద్ పవార్) నన్ను అందరిముందు విలన్‌గా చూపించారు. ఇప్పటికీ మీరంటే నాకు గౌరవం ఉంది. మీరే చెప్పండి...ఐఏఎస్ అధికారులు 60 ఏళ్లకు పదవీ విరమణ చేస్తున్నారు. రాజకీయాల్లో కూడా బీజేపీ నేతలు 75 ఏళ్లకు రిటైర్ అవుతున్నారు. ఎల్.కె.అడ్వాణి, మురళీ మనోహర్ జోషిలను ఉదాహరణగా తీసుకోండి. కొత్త జనరేషన్ ఎదిగేందుకు అవకాశం ఇవ్వండి. మీ ఆశీస్సులు మాకు ఇవ్వండి. మీ వయస్సు 83. ఇప్పటికైనా ఆగరా? మీరు మాకు ఆశీస్సులు ఇస్తే, మీరు చిరకాలం ఆయురారోగ్యాలతో ఉంటాలని మేము భగవంతుని ప్రార్థిస్తాం'' అని అజిత్ పవార్ అన్నారు.

Updated Date - 2023-07-05T16:31:48+05:30 IST