NCP: పవార్‌తో ఎన్‌సీపీ రెబల్ నేతల మంతనాలు.. రెండోరోజూ అదే డ్రామా..!
ABN , First Publish Date - 2023-07-17T17:04:38+05:30 IST
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని ఐక్యంగా ఉంచాలని కోరుతూ ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ ను ఒప్పించేందుకు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎన్‌సీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు రెండోరోజైన సోమవారంనాడు కూడా ప్రయత్నించారు.
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)ని ఐక్యంగా ఉంచాలని కోరుతూ ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar)ను ఒప్పించేందుకు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar), ఎన్‌సీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు రెండోరోజైన సోమవారంనాడు కూడా ప్రయత్నించారు. ముంబైలోని వైబీ చవాన్ కేంద్రంలో శరద్‌పవార్‌ను ఆదివారం కలిసిన వీరంతా సోమవారం కూడా ఆయనను మరోసారి కలుసుకున్నారు. అజిత్ పవార్‌తో పాటు ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే పాటిల్ తదితరులు సీనియర్ పవార్‌ను కలిసిన వారిలో ఉన్నారు.
శరద్‌పవార్‌ను కలుసుకున్న విషయాన్ని ప్రఫుల్ పటేల్ మీడియాకు తెలియజేస్తూ, ఎన్‌సీపీని ఐక్యంగా ఉంచాలని మరోసారి పవార్‌కు విజ్ఞప్తి చేశామని అన్నారు. తాము చెప్పిన విషయాలన్నీ ఆయన విన్నారని, అయితే ఆయన ఏమీ చెప్పలేదని తెలిపారు. దీనికి ముందు ఆదివారంనాడు ఇదే టీమ్ శరద్ పవార్‌ను కలుసుకున్నారు. శరద్ పవార్ ఆశీస్సులు తీసుకుని, ఎన్‌పీకి ఐక్యంగా ఉంచేలా చూడాలని కోరామని, ఆయన నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదని సమావేశానంతరం వారు తెలిపారు.
కాగా, శరద్ పవార్‌ను శాంతింపజేసేందుకు అజిత్, ఆయన వర్గం మంత్రులు గట్టిగానే ప్రయత్నించారని, శరద్ పవార్ అంగీకరిస్తే కేంద్ర క్యాబినెట్ తదుపరి విస్తరణలో ఆయన కుమార్తె సుప్రియా సూలే మంత్రి అయ్యేందుకు మార్గం సుగమం అవుతుందని చెప్పారని తెలుస్తోంది. ఎన్‌సీపీని ఐక్యంగా ఉంచేలా చూడాలని, అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో పవార్ వర్గీయులపై సభలో ఎలాంటి దాడులకు తావీయకుండా వ్యవహరిస్తామని పవార్‌కు నచ్చజెప్పారని తెలుస్తోంది.
బెంగళూరుకు పవార్, ఢిల్లీకి అజిత్...
కాగా, విపక్ష ఐక్య కూటమి ఏర్పాట్లు ప్రయత్నాల్లో భాగంగా బెంగళూరులో సోమ, మంగళవారాల్లో జరుగుతున్న సమావేశాల్లో శరద్ పవార్ పాల్గొనే విషయంలో తలెత్తిన అనిశ్చితి కూడా తొలిగింది. పవార్, సుప్రియా సూలే మంగళవారంనాడు బెంగళూరు వెళ్తారని ఎన్‌సీపీ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు, ఢిల్లీలో ఎన్డీయే భాగస్వాములతో ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన మంగళవారం జరుగుతున్న సమావేశానికి తాను, అజిత్ పవార్ హాజరవుతున్నట్టు ప్రఫుల్ పటేల్ మీడియాకు తెలిపారు.