Akilesh Yadav:ఇండియా కూటమిలో అఖిలేష్ కల్లోలం.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేసిన ఎస్పీ అధినేత
ABN , First Publish Date - 2023-10-21T12:04:33+05:30 IST
కాంగ్రెస్ పార్టీపై సమాజ్‌వాది పార్టీ(Samajwadi Party) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) ఆగ్రహం చల్లారినట్లు లేదు. తాజాగా ఆయన ఆ పార్టీపై చేసిన విమర్శలు ఇండియా కూటమిలో తీవ్ర కల్లోలం రేపుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే కులగణన(Caste Census) చేపడతామంటున్న కాంగ్రెస్(Congress) పార్టీకి ప్రస్తుతం వెనకబడిన కులాలు, తెగల మద్దతు లేదని అఖిలేష్ విమర్శించారు.
హర్దోయ్ (ఉత్తర్‌ప్రదేశ్): కాంగ్రెస్ పార్టీపై సమాజ్‌వాది పార్టీ(Samajwadi Party) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) ఆగ్రహం చల్లారినట్లు లేదు. తాజాగా ఆయన ఆ పార్టీపై చేసిన విమర్శలు ఇండియా కూటమిలో తీవ్ర కల్లోలం రేపుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే కులగణన(Caste Census) చేపడతామంటున్న కాంగ్రెస్(Congress) పార్టీకి ప్రస్తుతం వెనకబడిన కులాలు, తెగల మద్దతు లేదని అఖిలేష్ విమర్శించారు. వారి కులగణన చేపడతామంటున్న కాంగ్రెస్ కు ఇప్పుడు ప్రజల మద్దతు లేదని ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్(Madyapradesh)లో కాంగ్రెస్ తో ఎస్పీ పొత్తు పెట్టుకోవాలని చూసింది. అయితే కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అఖిలేష్ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.
ఇప్పుడే తమకు మద్దతు ఇవ్వకుంటే.. 2024లో బీజేపీ(BJP)తో కలిసికట్టుగా ఎలా పోరాడతామని కాంగ్రెస్ ను ప్రశ్నించారు. తమకు మధ్యప్రదేశ్‌లో సీట్లు ఇవ్వకూడదని కాంగ్రెస్ భావిస్తే ముందే చెప్పాల్సి ఉండేదని పేర్కొన్నారు. తమకు 6 సీట్లు ఇవ్వడం గురించి ఆలోచిస్తామని కాంగ్రెస్ చెప్పినా.. అభ్యర్థులను ప్రకటించినప్పుడు తమ పార్టీ ప్రస్తావన తీసుకురాలేదని మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌లో కూటమి లేదని ముందే తెలిస్తే.. అసలు ఇండియా కూటమి(INDIA Alliance)తో కలిసేవాడినే కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇలాగే వ్యవహరిస్తే వారితో ఎవరు నిలబడతారని ప్రశ్నించారు. ఈ విమర్శలతో అఖిలేష్ ఇండియా కూటమి నుంచి బయటకి వస్తాడా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎస్పీ, కాంగ్రెస్ మధ్య విభేదాలతో ఇండియా కూటమి భవిష్యత్తు అయోమయంలో పడినట్లైంది. ఇప్పటికే ఎన్సీపీ అధినేత శరద్ పవార్(Sharadh Pawar) ద్వంద్వ వైఖరిపై భయపడుతున్న ఇండియా కూటమికి తాజా పరిణామాలు మరో తలనొప్పిగా మారాయి. తాము అధికారంలోకి వచ్చే రాష్ట్రాల్లో కుల గణనను నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తూ వస్తోంది. ఇటీవలే బిహార్ లోని నితీష్ సర్కార్ కులగణన నివేదిక బయటపెట్టింది. అదే బాటలో రాజస్థాన్ తదితర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి.